లాజిక్ లోపించిన రివెంజ్ డ్రామా !

Sharing is Caring...

అశ్మీ ….. లో బడ్జెట్ సినిమా .. అయిదారు పాత్రలతో నడిచే నాటకం లాంటి ఫిమేల్ ఓరియంటేడ్ సస్పెన్స్ సినిమా. కథంతా రివెంజ్ డ్రామా తో సాగుతుంది. అశ్మీ అనే అమ్మాయి కిడ్నాప్ అయి నాలుగేళ్లు ఒక గదిలో బందీగా ఉంటుంది. బంధించిన వ్యక్తి అశ్మీని రోజూ రేప్ చేసేవాడు. ఒక రోజు ఆమె తప్పించుకుని  స్నేహితురాలి కారుకి ఆడ్డం పడుతుంది. ఈ అశ్మీని ప్రేమించే శివ దగ్గరకే చివరికి చేరుతుంది.

స్నేహితురాలి సలహా మేరకు అశ్మీ శివాలు పెళ్లి చేసుకుంటారు. అశ్మీ బందీ గా ఉన్నప్పటి జ్ఞాపకాలు మర్చిపోలేక పోతుంటుంది.  ఇక్కడ నుంచే కథ మలుపు తిరుగుతుంది. ముగింపులో తనను బంధించింది ఎవరో తెలుస్తుంది ? అశ్మీ అపుడు ఏమి చేసిందనేది కథ. రివెంజ్ డ్రామా ను దర్శకుడు ఆసక్తికరంగానే తెరకెక్కించాడు. అయితే కథ విస్తృతి తక్కువ.

వేర్వేరు సంఘటనలు .. మలుపులు ఉండవు. కథలో లోపాలు ఎక్కువ. అశ్మీ బందీ గా ఉన్న రూమ్ నుంచి ఎలా బయట పడింది ? అశ్మీ వాయిస్ ..  స్మెల్ ఆధారంగా శివ బాస్ రాజేశ్ మిశ్రా ను టార్గెట్ చేయడం చిత్రంగా అనిపిస్తుంది. తర్వాత అతగాడు నిందితుడు కాదని గమనిస్తుంది. ఇలా చాలా లాజిక్ లేని సన్నివేశాలతో సినిమా నడుస్తుంది. ఇవన్నీ ఆలోచించకుండా చూస్తే సినిమా బాగానే ఉందనిపిస్తుంది.

దర్శకుడు శేష్‌ కార్తికేయ మొదటి సినిమా ఇది. రాసుకున్న కథను నీటుగానే తెరకెక్కించాడు. కథ పై ఇంకొంచెం కసరత్తు చేసి ఉంటే బాగుండేది. ముగింపు కూడా ప్రేక్షకుడు ఈజీగానే ఊహిస్తాడు. అశ్మీ గా రుషికారాజ్ బాగానే చేసింది. పాత్ర కవసరమైన హావభావాలను పలికించింది. అశ్మీ భర్తగా రాజా నరేంద్ర .. అతని బాస్ గా కేశవ్ దీపక్ తమ పరిధిమేరకు చేశారు. శాండి అద్దంకి నేపథ్య సంగీతం బాగుంది.

ప్రేక్షకుల్ని కట్టిపడేసే సన్నివేశాలు, ఆసక్తి రేకెత్తించే సంఘటనలు లేకపోవడంతో ఈ రివెంజ్ డ్రామా సాగదీసినట్టు అనిపిస్తుంది. శేష్ కార్తికేయ కెమెరా బాగా హ్యాండిల్ చేసాడు. కథ రాసుకుని తనే దర్శకుడిగా మారి సినిమా తీసాడు.

రివెంజ్ .. సస్పెన్స్ సినిమాలు  తీసేటప్పుడు లాజికల్ గా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే కథ పేలవంగా తయారవుతుంది. ప్రేక్షకుడిని తక్కువగా అంచనా వేసారా దర్శకుడు అనిపిస్తుంది. సెప్టెంబర్ లో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇపుడు అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ అవుతోంది. ఆసక్తి ఉన్నవారు చూడవచ్చు. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!