Hero in an ivory case…………………….
ఏనుగు దంతాలు అక్రమ సేకరణ కేసులో ప్రముఖ నటుడు మోహన్ లాల్‌కు కాస్త ఊరట లభించింది . ఈ కేసుకు సంబంధించి వచ్చే ఆరు నెలల పాటు మోహన్ లాల్ పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కేరళ హైకోర్టు ఆదేశించింది.
2011లో మోహన్‌లాల్ నివాసంపై ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసినప్పుడు ఏనుగు దంతాలతో తయారు చేసిన కొన్ని వస్తువులు వారి కంటపడ్డాయి. ఈక్రమంలో కేరళ అటవీ, వన్యప్రాణి విభాగం అధికారులు అటవీ చట్టం కింద మోహన్‌లాల్‌పై కేసు నమోదు చేశారు. ఆ తర్వాత 2019లో, ఎర్నాకులంలోని మెక్కప్పల్ ఫారెస్ట్ స్టేషన్ కూడా మోహన్‌లాల్‌పై కేసు నమోదు చేసింది.
ఈ కేసు పెరంబూర్ మేజిస్ట్రేట్ కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ మోహన్‌లాల్ కేరళ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు.. వచ్చే ఆరు నెలల వరకు మోహన్ లాల్ పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. దీంతో ఏనుగు దంతాల కేసులో సూపర్ స్టార్‌కు ఊరట లభించింది.
కాగా కొన్ని నెలల క్రితం ఒక కేసు విషయంలో మోహన్‌లాల్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. కేరళకు చెందిన ఘరానా మోసగాడు మోన్సన్ మవున్‌కల్‌తో సంబంధం ఉన్నాయంటూ ఈడీ ఆయనకు నోటీసులు ఇచ్చింది. విచారణకు కూడా పిలిచారు. మోన్సన్ తన వద్ద పురాతన వస్తువులు ఉన్నాయని నమ్మించి పలువురి నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేశాడు.
మనీలాండరింగ్ కేసులో మోన్సన్ ను ఈడీ అరెస్ట్ చేసింది. అతడిని విచారించగా మోహన్‌లాల్‌తో సంబంధాలు ఉన్నట్లు తెలిపాడు. దీంతో మోహన్‌లాల్‌కు నోటీసులిచ్చి విచారణకు హాజరు కావాలన్నారు. మలయాళంలో సూపర్‌స్టార్‌గా వెలుగొందుతోన్న మోహన్ లాల్ పలు వ్యాపారాలు చేస్తున్నారు.
ఫిషింగ్, బోటింగ్, రియల్ ఎస్టేట్, బంగారం వ్యాపారం, రవాణా, విదేశీ పెట్టుబడులు, దుబాయ్‌లో రియల్ ఎస్టేట్, ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్స్‌లో ఆయన పెట్టుబడులు కూడా పెట్టారు. ఈ నేపథ్యంలోనే ఆయనపై పలు సార్లు ఐటీ దాడులు జరిగాయి.