Priyadarshini Krishna……….. An excellent novel…………………………
నాకు ఎంతెంతో నచ్చిన పుస్తకం. అందరూ చదవాల్సిన పుస్తకం.. మేటి కన్నడ రచయిత్రి అనుపమ నిరంజన్ రాసిన ‘మాధవి’ అత్యద్భుతమైన నవల. ఇది మహాభారతం లోని కథల్లోని ఒక అత్యద్భుత వ్యక్తిత్వం కలిగి సమస్త పురుషాధిక్య, రాచరిక సమాజాన్ని ప్రశ్నించిన స్త్రీ గాధ.
దీనిని తెలుగులోకి కళ్యాణి నీలారంభం అనువదించారు. అనువాదం అంటే ఎందుకో చాలా తేలికైన పదం లాగా వినపడుతుంది. ఆద్యంతం ఏకబిగిన చదివించేలాగా వుంటుందీ నవల. కథలోకి వెళితే……………………………
మాధవి రాకుమార్తె. యయాతి- శర్మిష్ఠల కుమార్తె. సవతి దేవయాని కిరాతకాలకు భయపడి అజ్ఞాతంగా వుండిపోయిన శర్మిష్ట, తన కూతురిపైన కూడా దేవయాని పెత్తనం తప్పించలేకపోతుంది. స్వయంవరం చేసి రాకుమారునికి కట్టబెట్టలేము కనుక సహాయం చెయ్యమని వచ్చిన విశ్వామిత్రుని శిష్యుడైన గాలావునికే దానమివ్వడం మంచిదని చెప్పిన దేవయాని సలహామేరకు యయాతి మహారాజు మాధవిని వదిలించుకుంటాడు.
గాలవునికి తన గురుదక్షిణ సంపాదించాల్సిన బృహత్కార్యం కోసం మాధవిని ఒక ‘వస్తువుగా’ వస్తుమార్పిడివిధానంలో వినియోగించుకుంటాడు. ఈ క్రమంలో మాధవిని నలుగురు రాజులకు పత్నిగా ‘నియమించి’ క్షేత్ర బీజ ధర్మం ప్రకారం ఆ రాజులకు పుత్రులను కని ఇచ్చే ఒప్పందాన్ని కుదుర్చుకుంటాడు.
ఈ మొత్తం తతంగంలో ఎక్కడా మాధవి అభిప్రాయాన్ని గాని ఇష్టానిష్టాలను తెలుసుకోడం గాని జరగదు. అసలు అలాంటి ప్రక్రియకు తావుండదు.ఇలా మొత్తం వ్యవహారంలో మాధవి అనుభవించే క్షోభ, పురుషాధిక్యతపై ఆమె నిరసన ఎంతో గొప్పగా మనసును తాకేవిధంగా చిత్రించారు.
ఒక్కో రాజు దగ్గరికి పుత్రుణ్ణి కనివ్వడానికి (నియమించిన) వెళ్లిన ప్రతిసారి పడిన క్షోభ, పుత్రుణ్ణి కనిన వెంటనే ‘పనైపోయింది ఇక పద’ మనే గాలావుని మాటకు బిడ్డని విడిచివెళ్లేప్పటి సంఘర్షణ ఎంతో హృదయవిదారకంగా ఉంటుంది.
స్త్రీ ఒక వస్తువుగా , సంతానోత్పత్తికై వినియోగించే క్షేత్రంగా మాత్రమే వాడుకోవడం ఈ నవలలో కళ్లకుకట్టినట్లుగా ఉంటుంది. చివరకు, తనఛుట్టూ వుండే పురుషులు, తనతో పుత్రులను కన్న పురుషులు, చివరికి తన తండ్రైన యయాతి కూడా ఏ కోణంలో స్త్రీ తమలాంటి సాటి మనిషే అనే స్పృహలేకుండానే తమ కాంక్షలు వాంఛలు తీర్చుకోడం, అవి తీర్చుకునే క్రమంలో స్త్రీని వాడుకోడాన్ని అసహ్యించుకుని ఏవగించుకుని జీవితాన్నిత్యజించి హిమాలయాలకు వెళ్ళిపోడంతో కథ ముగుస్తుంది.
నాకున్న కొద్దిపాటి అవగాహనలో ‘మాధవి’ తొట్టతొలి స్త్రీవాద , పురుషాధిక్య సమాజ తిరుగుబాటుదారు అనిపిస్తోంది.
నిస్సహాయురాలైన తల్లి శర్మిష్ఠ, దేవయాని వంటి భార్యకు ఎదురుచెప్పలేని తనతండ్రి యయాతి, అందరిపై ఆధిపత్యం చెలాయించే పినతల్లి దేవయాని, దానంగా స్వీకరించిన యజమాని గాలావుడు, ధర్మానికి కట్టుబడి రాణిగా నలుగురు పుత్రులను కని ఇచ్చిన రాజులు, చివరకు బ్రహ్మర్షి విశ్వామిత్రుడు సైతం సంకుచ మనసుతో ప్రవర్తించడం ధర్మాధర్మాలు న్యాయాన్యాయాలు విస్మరించడాన్ని సహించకపోడం అనేక సన్నివేశాల్లో మనకు కనపడుతుంది.
అందుకే మాధవి పితృస్వామ్యసమాజంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన మేటి స్త్రీ, స్త్రీవాది !!