డైమండ్ బీచ్…పేరే ఆకర్షణీయంగా ఉంది కదా. అక్కడి అందాలు ఇంకా అద్భుతంగా ఉంటాయి. పర్యాటకులను కట్టి పడేస్తాయి. అక్కడ ఎంత సేపు గడిపినా తనవితీరదు. ఇలాంటి సాగర తీరాలు అరుదుగా ఉంటాయి. ఇక్కడ అర్ధరాత్రి వరకూ సూర్యుడు ఆకాశంలో కనిపిస్తాడు. అరుదైన ఈ డైమండ్ బీచ్ ఐస్ ల్యాండ్ రాజధాని రెక్యవిక్ నగరానికి దగ్గర్లో ఉంది.
ఇండియాలో మనకు తెలిసిన బీచ్ లకు భిన్నమైనది ఈ డైమండ్ బీచ్. ఒడ్డున నల్లటి ఇసుక ..అక్కడ నిలబడితే కాళ్ళ కింద కరిగి పోయే మంచు పలకలు ఉంటాయి. చుట్టూ ఉన్న మంచుకొండల తాలూకు పలకలవి. ఒక వైపు సముద్రం … మరో వైపు మంచుకొండలు. మనకెక్కడా కనిపించవు. ఈ అద్భుతమైన మంచుకొండలు ఒకప్పుడు Breiða merkurjökull హిమనీ నదంలో భాగం. దాని నుంచి విడిపోయి డైమండ్ బీచ్‌లో జకుల్ సర్లాన్ గ్లేసియర్ లగూన్ చుట్టూ కదులుతుంటాయి.
చెక్కు చెదరని ఆకర్షణతో ప్రతిరోజు కొత్త అందాలను ఆవిష్కరిస్తుంటాయి. తెలుపు రంగు నుంచి నీలం రంగులో మారుతూ … సూర్యకిరణాల తాకిడితో మెరుస్తుంటాయి. వివిధ ఆకృతుల్లో .. పరిమాణాల్లో ఆకట్టుకునే విధంగా ఉంటాయి. పర్యాటకులు ఈ మంచు కొండల చుట్టూ పడవల్లో తిరగవచ్చు. ఈ మంచు కొండలు అర్ధరాత్రి సూర్యుడి వెలుగులో వజ్రాల మాదిరిగా మెరుస్తుంటాయి.
ఈ మంచు కొండలు వెయ్యి ఏళ్లకు ముందు నుంచే ఉన్నాయంటారు. అందుకనే ఈ బీచ్ కి డైమండ్ బీచ్ అనే పేరు వచ్చింది. ఇక్కడకి ఏడాది పొడుగునా పర్యాటకులు వస్తుంటారు. శీతాకాలంలో ఈ సాగర తీర సోయగాలు ఆకర్షణీయంగా ఉంటాయి. ఎక్కువమంది ఆ సమయంలో వెళుతుంటారు.అవకాశం ఉంటే ఒక్కసారయినా వెళ్లి ఆ అందాలను తిలకించి రండి.
ఇక ఐస్ ల్యాండ్ గురించి చెప్పుకోవాలంటే చిన్న దేశం. ఐస్‌ల్యాండ్ జనాభా దాదాపు 365,000 మంది మాత్రమే.ప్రజలు పట్టణాలు .. నగరాలలో ఎక్కువగా నివసిస్తున్నారు. ఐరోపా దేశాలన్నింటి కంటే ఐస్‌ల్యాండ్ అతి తక్కువ జనాభా సాంద్రత కలిగి ఉంది. సగటున, ఐస్‌ల్యాండ్‌లో కిలోమీటరుకు 3 మంది (లేదా చదరపు మైలుకు 9 మంది) ఉంటారు.
ఇక ఐస్‌ల్యాండ్‌లో నేరాల రేటు చాలా తక్కువ. స్టాండింగ్ ఆర్మీ, నావికాదళం.. వైమానిక దళం లాంటి వేమి లేవు. పోలీసులు డ్యూటీలో తుపాకీలను ఉపయోగించరు. ప్రపంచంలో అత్యంత శాంతియుత దేశం ఇది. ఈ దేశంలో చూడటానికి మరెన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. మరోసారి ఆ వివరాలు చెప్పుకుందాం.