1983 జూన్ 15న మహాకవి శ్రీశ్రీ చనిపోయినపుడు, మంచి ఫోటో వేసి (అది నా కలెక్షన్) ‘‘నిప్పులు చిమ్ముకుంటూ నింగికెరిపోయిన శ్రీశ్రీ’’ అనే శీర్షికతో వార్త యిచ్చినపుడు, రామోజీ రావు నన్ను కంగ్రాచ్యులేట్ చేస్తూ ఒక పర్సనల్ మెస్సేజ్ పంపారు.
ఇది రామోజీ రావు గురించి మాట్లాడుకోవాల్సిన సమయం అని నేను అనుకుంటున్నాను. పత్రికాధిపతి గనక, మిగతా పత్రికలేవీ ఆయన పేరు స్మరించడానిక్కూడా యిష్టపడవు. మన సంకుచిత మనస్తత్వానికీ, ఇరుకు జర్నలిజానికీ యిదే గుర్తు. రామోజీరావుకి 75 ఏళ్లు వచ్చినపుడన్నా ఆయన గొప్పగా కంట్రిబ్యూట్ చేశాడనో, లేదా సవాలక్ష తప్పులు చేశాడనో ఏదో ఒక ఆబ్జెక్టివ్ అసెస్ మెంట్ చేయాలి కదా!
ఐతే, రామోజీరావు ఒక ఫినామినా, ఒక లివింగ్ లెజెండ్ అని పొగిడి చేతులు దులిపేసుకోవడం, లేదా అతనో రాక్షసుడు, రాష్ట్ర ముఖ్యమంత్రులనే మార్చేసిన మాయల ఫకీరు, ధన పిశాచి అని శాపనార్ధాలు పెట్టి మెటికలు విరవడం! అలా కాకుండా ఆయన విజయాల్నీ, వ్యక్తిత్వాన్నీ, స్వార్థపరత్వాన్ని కూడా సరిగా అంచనా వేసి విశ్లేషించడం అవసరమేమో.
How can anybody on earth ignore Ramoji? శ్రీశ్రీని పేరడీ చేస్తే, బిల్ గేట్స్ ని తలుస్తారు, వారెన్ బఫెట్ ని కొలుస్తారు. రామోజీరావంటే భయంపుట్టి వణుకుతారు. అంటే మన పెట్టుబడిదారులనే మనం క్షమించం. ఎన్టీరామారావ్, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబులు పాతబడి, రోతపుట్టి Fade out అయిపోతున్నపుడు ఆశా కిరణంలా మెరిసింది చిరంజీవి! జనానికి కావాల్సిన కొత్త డ్యాన్సుల, గమ్మత్తుల, బూతుపాటల మజాని యిచ్చిన వాడు చిరంజీవి!
అచ్చుగుద్దినట్టు అలాగే, ఆంధ్ర పత్రిక, ప్రభ, జ్యోతి, భూమి, విశాలాంధ్ర, ప్రజాశక్తి… ఇంకా సంప్రదాయ జర్నలిజం చూరుపట్టుకు గబ్బిలాల్లా వేలాడుతున్నపుడు ఉరుములు, మెరుపులతో కొత్త వెలుగుల అక్షర దీపాల్ని వెలిగించిన వాడు రామోజీరావు. సూటిగా స్పష్టంగా వుండే సరళమైన తెలుగుతో సామాన్యుణ్ణి కూడా చదివించే భాషతో, కదిలించే శైలితో సమ్మోహన పరిచింది ఈనాడు.
అదే ఈనాడుతో రాష్ట్ర మంత్రులకీ, ముఖ్యమంత్రులకీ నిద్రలేని రాత్రుల్ని ప్రసాదించిన వాడూ రామోజీరావే! స్పష్టమైన చూపున్న ఆధునిక పెట్టుబడిదారుడు. హృదయంలేని వ్యాపారస్తుడు. అక్షరాలా అచ్చమైన తెలుగు రాక్షసుడు! నందమూరి తారక రామారావుని గెలిపించిందీ, లక్ష్మీపార్వతీ సమేత ఎన్టీఆర్ ను ఓడించిందీ చివరిదాకా పీడించిందీ రామోజీరావే కావడం… దాన్ని మనం గుడ్లప్పగించి చూడటం ఎంత విచిత్రం.
నాకు తెలిసి, రామోజీరావు ఎప్పుడూ తన ఫోటో ఈనాడులో వేయడానికి ఒప్పుకోలేదు. ‘‘నా పేపర్లో నా ఫోటో ఏంటయ్యా!’’ అనేవాడు. ఆయన తల్లి లేదా తండ్రి చనిపోయినపుడు (సరిగా గుర్తులేదు), ఒక సీనియర్ జర్నలిస్టు ‘‘మీ అమ్మగారి ఫోటో వేసి, వార్త యిద్దాం’’ అన్నాడు. ‘‘మా అమ్మ చనిపోతే యీ రాష్ట్రానికి వార్త ఎలా అవుద్దీ. వద్దు. అలాంటిదేం చేయకండి’’ అని రామోజీ అన్నారని నాకు తెలుసు. ‘‘సభలో పెద్దల గలభా’’ అని హెడ్డింగ్ పెట్టినందుకు అరెస్టు చేయమని ఐపీఎస్ అధికారి విజయరామారావును సభాధ్యక్షుడు ఆదేశించారు.
రామోజీని అరెస్టు చేసేందుకు విజయరామారావు ఈనాడుకు వచ్చిన ఫోటోని మొదటి పేజీలో వేశారు. ఆ మాత్రం సెన్సూ, బేలన్సూ వున్నవాడాయన! రామోజీరావు తన సైన్యంతో గుర్రాల మీద గోబీ ఎడారిలో తూనీగల్లా దూసుకుపోతున్న వయసులో… దయలేదు… దాక్షిణ్యమూ లేదు, యుక్తా యుక్త విచక్షణ లేదు, పగ.. పగ… అనే కృష్ణపాండవీయం డైలాగు గుర్తొచ్చేది నాకు. విజయం అనే పంతం నెగ్గించుకునే దాకా నిద్రపోని వాడే రామోజీరావు. సరదాకి- రామోజీకీ, నాకూ చిన్న పోలిక చెబుతా. మా యిద్దరి మధ్యా పెద్ద తేడా ఏం లేదు. మార్గదర్శి, ఈనాడు, ఫిల్మ్ సిటీ నాకు లేకపోవచ్చు.
కానీ నా లాగా ఆయన కవిత్వాన్ని ఎంజాయ్ చేయగలడా? చెలాన్నో, చేగువేరానో పదే పదే చదువుకుని పరవశించిపోగలడా? లేదు. ఆయన ట్రాక్ వేరు. నాకు యిద్దరు మగపిల్లలు. ఆయనకీ యిద్దరు అబ్బాయిలు. నా పెద్ద కొడుకు నిత్యా నాదెండ్ల అయిపోవాలనీ, రెండో వాడు అతి సుందర పిచాయ్ కావాలనీ నేను కనని కల లేదు. ఏలూరు నుంచి నడిచొచ్చిన నాలాంటి వలస కూలీ గాడికే ఇన్ని కలలుంటే రాజాధిరాజ, రాజమార్తాండ శ్రీమాన్ చెరుకూరి రామోజీరావు ప్రభువులకు కనీసం వంద వైల్డ్ డ్రీమ్స్ అన్నా వుండవా? వుంటాయి.
వుండితీరతాయి. జాగ్రత్తగా వినండి. ఇదో మేజర్ ఇష్యూ. మనలాంటి వాళ్లం అంటే మధ్య తరగతి వాళ్లం.. అనగా యింటద్దె కట్టడానికి వెతుక్కునే వాళ్లం… సాయంత్రాలు డాబా మీద చాప వేసుకుని తలకింద చేతులు పెట్టుకు పడుకుని నీలాకాశం, మబ్బులూ చూస్తూ ఆనందిస్తాం. నెలవంకనీ, తొలి నక్షత్రాన్నీ చూసి పరవశించిపోతాం. రామోజీరావు ప్రోబ్లం ఏమిటంటే, చేత్తో ఆకాశాన్ని అందుకుందాం అనుకుంటాడు. అందకపోయిందా, దాన్ని కొనేద్దాం అనుకునే రకం. అందనిదేదో తన సొంతం అయ్యేదాకా నిద్రపోడు! పంతం మనిషికి. వుడుం పట్టుదల!
ఒక రోజు హైద్రాబాద్ ఈనాడు ఆఫీసులో గజ్జెల మల్లారెడ్డితో రామోజీరావు ఇలా అన్నారు. ‘‘మల్లారెడ్డీ, నేను గనక కమ్యూనిస్టు రష్యాలో వుంటే, ఏమయ్యేవాణ్ణి? మాస్కో శివారులోని ఒక పెద్ద ఫ్యాక్టరీకి చిన్న మేనేజరుగా… అంతేగా!’’ అన్నారు. మార్గదర్శి, ఈనాడు అనే మహా సంస్థల్ని స్థాపించే అవకాశం అక్కడ నాకు రాదుగా అని రామోజీ ఫిర్యాదు. మల్లారెడ్డి నాకీ విషయం చెప్పారు. ఆ ఫీలింగ్ తో నేను కూడా ఐడెంటిఫై అయ్యాను.
ఈనాడులో నేను గనక జాయిన్ అయివుండకపోతే, ఏ దిక్కు మాలిన సంస్థలో క్లర్కుగానో, ఘనత వహించిన ఒక బ్యాంకులో గుమస్తాగానో…. చెహోవ్ కథలోని భయస్తుడిగా మిగిలిపోయేవాణ్ణి. అందుకైనా నేను ఆయనకి కృతజ్ఞుణ్ణి. ‘ఉదయం’ పత్రిక వస్తుందన్న మోజులో, పతంజలి తిరుపతిలో ఈనాడుకి రిజైన్ చేశారు. అక్కడి మేనేజరు గోవిందరావు నన్ను పిలిచారు. రామోజీరావు ఫోన్ చేశారు. మిమ్మల్ని వుండమని, తన మాటగా చెప్పమన్నారు. అయినప్పటికీ.. ప్రకాష్ రాజీనామా చేస్తే- వెంటనే ఆమోదించమన్నారు.
దయచేసి నా మాట వినండి. మీరు వుండండి. ఛైర్మన్ గారు ఎవరి గురించీ నాకిలా చెప్పలేదు’’ అని ప్రాధేయపడుతున్నట్టుగా వివరించారు. పతంజలి అంటే యిష్టమూ, స్నేహమూ, గౌరవం వల్ల… ఆ క్షణంలోనే రాజీనామా చేసి వచ్చేశాను. బైటికి వచ్చేశాక తెలిసొచ్చింది, అక్కడ ఎంత సుఖంగా, గౌరవంగా బతికామో! ఇది నా సొంత ట్రాజెడీ! అటువైపు, అనగా రామోజీరావు కోణం నుంచి చూసినపుడు ఆయనకే విషాదమూ లేదా?…. అది కూడా చూడాలిగా!
Loneliness at the top అంటారుగా…. 85 సంవత్సరాల వయసున్న ఇప్పటి రామోజీరావు మానసిక స్థితి ఏమిటో! Autumn of the patriarch నవల్లో గాబ్రియేల్ గార్షియా మార్క్విజ్ మొత్తం అధికారాలన్నీ ఒక నియంత చేతుల్లో వుండిపోవడం వల్ల కలిగే దుష్ఫలితాల గురించి రాశారు. ఈ పెద్ద వయసులో… జీవిత చరమాంకంలో… ఫిల్మ్ సిటీలో… ఏ పదో అంతస్తులోనో అద్దాల గదిలోంచి దూరాకాశాన్ని చూస్తూ తనలో తాను ఏం మాట్లాడుకుంటాడు? సిరిసంపదలూ, భోగభాగ్యాలూ హంసతూలికా తల్పాలూ…ఇవన్నీ సరే, ఎందుకింత తాపత్రయ పడ్డాను?
ఎందుకిన్ని ఉరుకులూ, పరుగులూ! నేను పోగు చేసిన అపార ధనరాశుల కొండల్ని యిపుడు నేనే ఎక్కలేను కదా! ఇలాంటి విచారమే మిగుల్తుందా? లక్షల మందికి ఉద్యోగాలిచ్చి, వేల కుటుంబాల్ని నిలబెట్టానన్న సంతృప్తి ఓదారుస్తుందా? చీకటి ఆకాశంలో ఒంటరి నక్షత్రాన్ని చూస్తున్నపుడు ఆయనకు ఏమనిపిస్తుంది? రాబోయే తరాలు రామోజీరావనే విజేతని ఎలా గుర్తు పెట్టుకుంటాయో! ఒక నార్ల వెంకటేశ్వరరావుని తలుచుకున్నట్టు… ఒక చండ్ర రాజేశ్వరరావుని స్మరించుకున్నట్టు… ఒక దేశోద్దారక నాగేశ్వరరావు పంతుల్ని గుర్తు చేసుకున్నట్టు… తనను జ్ఞప్తి చేసుకోవడం జరిగే పనేనా?
రామోజీరావు ఫిల్మ్ సిటీ అద్దాల మేడలోంచి చూసినట్టుగానే… ఆనంద్ నగర్ కాలనీలో మా అద్దెయింటి బాల్కనీలోంచి పున్నాగపూల చెట్టుని చూస్తున్నపుడూ… నాకో సందేహం! ఒక కఠోర దీక్ష పాటించిన అయ్యప్పస్వామి భక్తుడు శబరిమలై వెళ్లి మొక్కు చెల్లించుకుని తిరిగి వస్తూ అనుభవించే పవిత్రమైన ఆనందం రామోజీరావుకి ఎప్పుడైనా దొరికిందా?
శ్రీకాకుళం జిల్లాలో మారుమూల గ్రామం నుంచి ముగ్గురు పిల్లల్తో రైలెక్కిన నిరుపేద భార్యాభర్తలు, దుర్భరమైన ప్రయాణం చేసి, బిడ్డల్ని ఎత్తుకుని, తిరుమల కొండ నడిచి ఎక్కి, తలనీలాలు సమర్పించి, కోనేట్లో స్నానం చేసి, భగవంతుణ్ణి దర్శించుకున్నపుడు ఆ నిరక్షరాస్యులు పొందిన అనిర్వచనీయమైన మనశ్శాంతి రామోజీకి ఎప్పుడైనా అనుభవంలోకి వచ్చి ఉంటుందా? ఈ సుదీర్ఘ కల్లోల జీవనయానంలో నిజమైన, నిరాడంబరమైన ఆనందాన్ని రామోజీరావు పొందగలిగారా…? నాకు అనుమానమే.
మరిచిపోలేని నా పుట్టిన రోజు: 1979 గానీ 80 గానీ కావచ్చు. విశాఖపట్నం, నవంబరులో ఓ రోజు. అది నా పుట్టిన రోజు. అమ్మా, నాన్నా, ఒక అన్నయ్య, ఇద్దరు అక్కలు, నలుగురు చెల్లెళ్లూ ఉన్నా, ఇక్కడ నేను ఒంటరిగా మిగిలాను. ఏం బతుకో ఏంటో… అనుకుంటూ ఆఫీసుకు ఎర్లీగానే వెళ్లిపోయాను. టీ ఇచ్చే బాయ్ వచ్చి స్వీట్ ప్యాకెట్ అందించాడు. ఆనందం కట్టలు తెగింది. ఒక వెర్రి సబ్ ఎడిటర్ గాణ్ణీ, వాడి పుట్టిన రోజునీ గుర్తు పెట్టుకుని యాజమాన్యం స్వీట్లు పంపించిందంటే, అతను రామోజీరావు కాదు, సాక్షాత్తూ వేయి చేతుల విష్ణుమూర్తే అనుకున్నాను.
ఇంతలో ఇతర జర్నలిస్టులు న్యూస్ ఎడిటర్ తెన్నేటి కేశవరావు వచ్చారు. వాళ్లందరికీ కూడా స్వీట్లు ప్యాకెట్లు పంచారు. ఇది కదా అదృష్టమంటే అని మురిసిపోయాను. అంతలోనే, ఇవ్వాళ నవంబరు 16 కదా, ఛైర్మన్ గారి పుట్టిన రోజు అని కేశవరావు చెప్పారు. నోరు మూసుకుని, ఏడేళ్ల బాలికపై యజమాని అత్యాచారం లాంటి పనికిమాలిన వార్తేదో రాసుకుంటూ… మనసులో నా కలలు కూడ దోచుకునే దొరలు ఎందుకు అని పాడుకుంటూ… హు… నవంబర్..