సీనియర్ జర్నలిస్ట్ ..దమ్మున్న ఛానల్, పత్రిక అధినేత ఆర్కే రాజగురువు గా మారినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇన్నాళ్లు అందరూ అంటుంటే నిజమో కాదో అనుకున్నాను. మాజీ సీఎం తెలుగు దేశం అధినేత చంద్రబాబుకి ఆయనే సలహాలు ఇస్తుంటారని ..రాజకీయ వ్యూహాలు చెబుతుంటారు అని గిట్టని వాళ్ళు అంటుంటే విన్నాను. కానీ నమ్మ లేదు. కానీ నిన్న కాబోయే పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వెళ్లి అన్నయ్యను కలిసి ఆశీర్వాదం తీసుకుని ఫోటోలు దిగిన దరిమిలా ఆ మాట నిజమే అని రూడీ చేసుకున్నా. ఒక జర్నలిస్టు ఇంటికి పీసీసీ నేత అంతటివాడు వచ్చాడు అంటే జర్నలిస్టులకు ఎంత గర్వకారణం. నిన్న పదిమంది జర్నలిస్టులు ఫోన్ చేస్తే ఇదే మాట చెప్పా.
ఇప్పుడే కాదు మూడేళ్ళ కిందట తెలంగాణ సీఎం కేసీఆర్ అంతటివాడే ఈయనను వెంటబెట్టుకుని పరిటాల సునీత ఇంటికెళ్లి వచ్చారు. ఆ రోజునే మనసులో అనుకున్నా కాబోయే రాజగురువు ఆర్కే నే అని. ఆమాట బయటకు అనకుండా ఒకరిద్దరితో ఈయనను ఆయన ఎందుకు వెంటబెట్టుకు వెళ్లారని అడిగితే కేసీఆర్ ఆర్కే లు ఇద్దరూ ఫ్రెండ్స్ .. కాబట్టి ఈయనే వెంటబడి వెళ్లి ఉండొచ్చు అని ఎకసెక్కం చేశారు. నాకెందుకో అలా అనిపించలేదు. వాళ్ళిద్దరి మధ్య దోస్తానా అందరికి తెలిసిందే.
అసలు చాలామందికి మా ఆర్కే అంటే కుళ్ళు. ఎపుడూ తిట్టి పోస్తుంటారు. అసలు ఆయన ఏం చేసాడు ? తెలుగు దేశం పార్టీ కి అవుట్ రైట్ న సపోర్ట్ చేసాడు ? అందులో తప్పేముంది ? అంతా ఓపెన్ గానే చేస్తున్నాడు కదా ? కొన్నాళ్ళు ఆపార్టీని .. మరి కొన్నాళ్ళు వేరే పార్టీని భుజాన మోస్తే మీరు ఎన్నైనా అనొచ్చు. చంద్రబాబు అధికారంలోకి రాకముందు ..వచ్చిన తర్వాత కూడా అన్నయ్య తెలుగుదేశమే కదా. అసలు తెలుగు దేశం ఓడిపోతే బాబు గారి కంటే ఎక్కువగా బాధపడింది అన్నయ్యే కదా. రెండు మూడు రోజులు అన్ని మానేశారు. కాదంటారా ? అసలు ఇందులో విమర్శించాల్సిన అంశం ఏముంది ?
జర్నలిస్ట్ బ్యాలెన్స్ గా ఉండాలి కదా అని మీరు అనొచ్చు. అయినా పత్రిక ఆయనది . ఛానల్ ఆయనది. ఆయనిష్టం కదా ? ఆయన రాసిన రాతలను నమ్మితే నమ్ముతారు. లేదంటే లేదు. మొన్నటి ఎన్నికల్లో ఆయన రాతలు నమ్మలేదు కాబట్టే టీడీపీ కి డ్యామేజీ అయింది అంటారా ? అనుకోండి తప్పేముంది? మీరు ఎన్ని అనుకున్నా ఆయన రాతలు అలాగే ఉంటాయి. ఇపుడు కూడా నమ్మడం లేదంటారా ? ఆవిషయం అన్నయ్యకూ తెలుసు. అయినా పేపర్ కొని చదువుతారు …ఛానల్ చూస్తారు .. అదే అన్నయ్య కు కావాల్సింది. ఇక నమ్మేవాళ్లే నమ్ముతారు.లేదంటే లేదు .. అంతే.
అయినా విమర్శకులు ఇదే మాట రామోజీ గారిని అడగలేదు ఎందుకని ? అప్పట్లో రామోజీ రావు రాజగురువుగా వ్యవహరించలేదా ? తెరవెనుక రాజకీయాల్లో ఆయన సిద్ధ హస్తులు అని జనాలు చెప్పుకోలేదా ? కాంగ్రెస్ ను వ్యతిరేకిస్తూనే కాంగ్రెస్ నేతలకు పోస్టర్లు గట్రా ప్రింట్ చేయించి పంపుతూ .. మంచి కవరేజ్ కూడా ఇచ్చేవారు కదా. ఆ కాంగ్రెస్ నాయకుడు జలగం వెంగళరావు అనేది బహిరంగ రహస్యం కదా. ఆ తర్వాత రామోజీ ఎన్టీఆర్ ను తలకెత్తుకుని ఎన్నికల్లో ఆయన కు బ్రహ్మాండమైన పబ్లిసిటీ కూడా ఇచ్చారు. 83 ఎన్నికల్లో ఎన్టీఆర్ గెలిచారు. తర్వాత ఇద్దరికీ చెడింది. అది వేరే విషయం. అప్పటి నుంచి బాబు గారికే సపోర్ట్ ఇచ్చారని అందరికి తెల్సిన విషయం కదా.
ఇపుడు ఆయన పెద్దోడు అయిపోయాడు .. కాబట్టి యంగ్ స్టర్ గా ఉన్న అన్నయ్య సలహాలు బాబు తీసుకుంటున్నారు. తప్పేమిటి ? ఈ మాత్రం దానికే జర్నలిజం విలువలు అంటూ పెద్ద మాటలు మాట్లాడుతుంటారు ? అసలు విలువలు ఎవరికున్నాయి ? విలువలను నిర్ణయించేదెవరు ? సరే .. అసలు విషయానికొస్తే … ఇవాళ రేవంత్ వచ్చాడు .. రేపు రాహుల్ రావచ్చు . ఎల్లుండి ఇంకొకరు రావచ్చు. ఎవరైనా వచ్చి పెద్ద మనిషి ని కలిస్తే తప్పేముంది. ఈ మాత్రానికే సోషల్ మీడియాలో విమర్శించాలా ? రేవంత్ ను ఆయనే పంపితే ఏమిటి ? ఇంకొకరు పంపితే ఏమిటి ? అవన్నీ మీకు అవసరమా ? అయినా ఇలాంటి విమర్శలు అన్నయ్య కు కొత్తేమి కాదు. నాటి ఎన్టీఆర్ నుంచి ఇప్పటి సోషల్ మీడియా రాతగాళ్ల వరకు ఎందరో విమర్శించారు.
అన్నయ్యా .. ఈ విమర్శలను నువ్వేమి పట్టించుకోకు .. నీ పని నువ్వు చేసుకుపో. అందరికి సలహాలు ఇవ్వు. ఇక దూసుకుపో .. రాజగురువుగా పదికాలాలు వర్ధిల్లు. పదిమందికి సేవ చేయి. ఈ రేవంత్ రావడం అయితే బాగానే ఉంది కానీ పెద్దాయన నీకు దోస్త్ అని తెలిసి ఎలా వచ్చాడు ? నీకు ఆయనకు పుల్లలు పెడతాడేమో ? జాగ్రత్త మరి. అయినా నీకు సలహాలు ఇచ్చేటంత వాళ్లమా ? జయహో రాజ గురువా !!
—————KNMURTHY