Nirmal Akkaraju ………………………..
ఒకప్పటి ఎన్నికల ప్రచార సభలకు ఇప్పటి సభలకు చాలా తేడావుంది. ఇదివరకు కొంత మేరకు జనం స్వచ్చందం గా సభలకు తరలివచ్చే వారు. అయితే రాను రాను ప్రజలు కూడా తెలివి మీరారు. మాకింత ఇస్తేనే సభలకు వస్తాం.. అని ముందుగానే మాట్లాడేసుకుంటున్నారు. ఇది ఇవాళ కొత్తగా జరుగుతున్నదేమీ కాదు.
దేశంలో ఎన్నో సభలు జరుగుతుంటాయి. సభ సక్సెస్ కావాలంటే జనం ఉండాలి. చప్పట్లు కొట్టాలి. ఈలలు వేయాలి. జిందాబాద్ అంటూ కేకలు వేయాలి. అవన్నీ లేకపోతే సభ జరిగిన కిక్ రాదు. అందుకే పార్టీ నేతలు ప్రజలను సమీకరిస్తుంటారు. ఒకప్పుడు 20-30 శాతం ప్రజలను సమీకరించేవారు. మిగిలిన వారు స్వచ్ఛందంగా వచ్చేవారు. అలా జనం స్వచ్ఛందంగా వెళ్ళిన సభలు చాలా ఉన్నాయి.
జనాలను ఆకర్షించేందుకు స్టార్ క్యాంపేయినర్లుగా సినిమా నటీనటులను తెచ్చేవారు. వాళ్ళని చూడడానికైనా జనాలు వస్తారని నాయకులు అంచనా వేసేవారు. అలా సక్సెస్ అయిన సభలు ఎన్నో ఉన్నాయి. అయితే కాలంతో పాటు ట్రెండ్ మారింది. జనాలను సమీకరించే చోటామోటా నాయకులు పెరిగిపోయారు. జన సమీకరణ ఒక వ్యాపారంగా మారిపోయింది.
ఇంతమంది జనం కావాలంటే ఇంత ఖర్చు అవుతుందని లెక్కలేసి అడ్వాన్సులు తీసుకుని జనాలను తరలిస్తున్నారు. దీంతో రాను రాను సభ అంటే డబ్బు ఖర్చు విపరీతంగా పెరిగింది. సభకు వచ్చే జనాలకు లిక్కర్, బిర్యానీ, మనిషికి 500 రూపాయలు ఇలా ఇచ్చి తరలిస్తున్నారు.ఇలాంటి జనంతో పాటు పొదుపు సంఘాలు , ప్రభుత్వ పధకాలు అందుకునే వారిని బలవంతంగా రప్పిస్తున్నారు. అధికారం , పదవీ కోరుకునేవారు మెప్పు కోసం ప్రజలను సమీకరిస్తున్నారు. ఇది కూడా ఒక రకమైన క్విడ్-ప్రో -కో లాంటిదే.
ప్రజా సమీకరణ చేసి అగ్రనేతల దృష్టిలో పడటం తర్వాత పదవులకోసం లాబీయింగ్ చేయడం ఒక అలవాటుగా మారింది. ఇవన్నీ పార్టీలో అందరికి తెల్సిన విషయమే. ఎలాగైనా సభ సక్సెస్ చేయడమే టార్గెట్ కాబట్టి ఏదో ఒకటి చేసి జనాలను రప్పిస్తుంటారు. దీంతో బహిరంగ సభల రూపు రేఖలు మారిపోయాయి. బలసమీకరణాలు గా మారాయి. ఆ ప్రాంత నాయకుడికి ఇది తంటాగా మారింది.
అదనంగా అధికారంలో ఉన్న వాళ్ళకి అధికారులు వంత పాడుతూ సభలకు రండి డబ్బులిస్తామంటారు.అయితే జన సమీకరణే ప్రామాణికమా అంటే అవుననే చెప్పుకోవాలి. వెలవెల పోతున్న సభలో మాట్లాడితే బలం తగ్గింది అనుకుంటారు. నిండుగా సభ ఉంటే బాగా జరిగింది అని ప్రజలలో పాజిటివ్ దృక్పథం కల్పించవచ్చు. అయితే ప్రజలను బురిడీ కొట్టించడం అంత సులభం కాదు. సభలు జరిగే తీరు గురించి ప్రజలకు తెలుసు.
అందుకే ఈ మధ్య పెద్ద పెద్ద బహిరంగ సభలు తగ్గాయి. చిన్న గల్లీలు చూసి రోడ్ షోలు చేస్తున్నారు. సమీకరించిన జనాలు కొంత మందైతే ట్రాఫిక్ ఆగి నిలిచేవాళ్ళు కొందరు.. మొత్తం మీద ఫ్రేమ్ లో ఎక్కువ మంది జనాలు కనిపిస్తారు.
జన సమీకరణ ఒక ఎత్తు అయితే న్యూస్ కవరేజ్ మరో ఎత్తు. నిర్వాహకులకు ఇదో పెద్ద సవాల్. మీడియాలో మంచి కవరేజ్ సంపాదించడం అంత సులభం కాదు. కొంతవరకు మీడియాను మేనేజ్ చేయాలి. అనుకూల పత్రిక అయితే క్లోజ్ ఫొటో తీసి ‘సభ సక్సెస్’ అని రాసేస్తుంటారు. వ్యతిరేక పత్రిక అయితే సభ ప్రారంభానికి ముందే ఫొటో తీసి ‘వెలవెల పోతున్న సభ ‘అని పత్రికలలో వేస్తుంటారు.
ఎలక్ట్రానిక్ మీడియా వచ్చాక ఇలాంటి దారుణాలు కొంత మేరకు తగ్గాయి. ట్రెండ్ మారింది. ఇపుడు మొత్తం ప్యాకేజీలమీదనే న్యూస్ కవరేజ్ నడుస్తుంది. వ్యతిరేకమనుకుంటే అసలు ఏ కవరేజ్ ఉండదు. ఏదో మొక్కుబడిగా చిన్న వార్త వేస్తారు. అంతే.
మూడు రోజుల క్రితం సత్తుపల్లిలో ఒక పార్టీ సభకు డబ్బులు ఇస్తామని జనాన్ని తరలించారట. సభ ముగిసిన తర్వాత డబ్బులు అడిగితే పార్టీ నేతలు దాడి చేసి జనాలను కొట్టినట్టు వార్తలు వచ్చాయి. అపుడపుడు ఆలా జరుగుతుంటాయి. మొత్తం మీద ఒక సభ సక్సెస్ కావాలంటే తెర వెనక ఇన్ని కష్టాలు ఉంటాయి. ఇంత కష్ట పడినా నాయకుడు గెలుస్తాడా ?లేదా అన్నది ఖచ్చితంగా చెప్పలేం.