అయ్యా …. సీఎం జగన్మోహనరెడ్డి గారు … నమస్కారం.
భజన గురించి … ఆ భజన పర్యవసానాల గురించి అసెంబ్లీ లో మీరు ప్రదర్శించిన చంద్రబాబు గారి భజన వీడియో చూసిన తర్వాత మీతో పాటు ‘ మేము ‘ కూడా నవ్వుకున్నాం. భజన పేరుతో పాలకుడ్ని ఏ విధంగా అధమ స్థాయికి తీసుకురావొచ్చో..ప్రజల్లో ఏ విధంగా నవ్వులపాలు చేయొచ్చో. ప్రత్యర్థి పార్టీకి ఏ మాత్రం శ్రమ లేకుండా కుర్చీకి ఎలా నిప్పెట్టుకోవాలో స్పష్టంగా అర్థమైంది. మాతో పాటు మీకు కూడా అర్ధమయ్యే వుంటుంది లేండి.
అయితే….
అదే భజన … అలాంటి భజన బ్యాచ్ ఇప్పుడు మిమ్మల్ని కూడా డీ ఫేమ్ చేయడానికి .. మీ వెనకే సునామీలా తరుముకొస్తుందని గమనించండి.
మీకు గుడి కట్టే ప్రయత్నాలు చేసినప్పుడే మీ ప్రతిస్పందన పార్టీ వర్గాలకు..ముఖ్యంగా భజనపరులకు తెలియచేసుంటే కధ అక్కడితో ఆగిపోయేదేమో. బతికున్నప్పుడే విగ్రహాలు..ఫోటోలకు దండలు వెయ్యటం.. ముక్కోటి దేవతలు,దేవుళ్లలో మిమ్మల్ని కలిపెయ్యటం వెర్రిగా అభిమానించే భక్తులకు నచ్చుతుందేమో కానీ సామాన్యులకు నచ్చదు.
మీ తండ్రిగారు రాజకీయాల్లో సుమారు మూడు దశాబ్దాలకు పైగా అలుపెరగని పోరాటం చేసి ముఖ్యమంత్రి పీఠం అధిష్టించారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు.. ముఖ్యమంత్రి పీఠం అధిష్టించినప్పుడు కూడా ఆయన భజనపరులను పక్కన పెట్టి సుశిక్షితులైన అనుచరులను తయారు చేసుకున్నారు. పాలనలో మంచి చెడులను విశ్లేషించి చెప్పగలిగే సలహదారుడ్ని పక్కన పెట్టుకున్నారు . మంచి పాలకుడిగా పేరు తెచ్చుకుని తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. ఆయనతో పోలిస్తే మీ రాజకీయ ప్రయాణం అంత సుదీర్ఘమైనదేం కాదు. ఒడిదుడుకుల మధ్య అయినా అతి తక్కువ కాలంలో ముఖ్యమంత్రి పీఠం అధిష్టించగలిగారు. ఈ విజయం కేవలం మీ ఒక్కడి సొంతం . ఒక్కసారి వెనక్కి తిరిగి సింహవలోకనం చేసుకోండి .. కళ్ళ ముందు మీరు పడ్డ కష్టం కనపడుతుంది.
అప్పుడు మీ చుట్టూ వందిమాగదులు లేరు ..మిమ్మల్ని దేవుడ్ని చేస్తూ కొలిచే భజనపరులు లేరు. నేరుగా మీరు..ప్రజలు. అంతే. మీ చుట్టూ ఉన్న భజనపరుల్ని పక్కకు నెట్టి ఒక్కసారి ప్రజల వంక చూడండి .. ఆ ప్రజల కళ్ళల్లో మీ మీద పెట్టుకున్న ఆశలు చూడండి. మీకు ప్రజలకు మధ్య ఉన్న అడ్డుగోడలను తొలగించుకుని తక్షణం జనంలోకి రండి. ప్రజలను నమ్ముకున్న పాలకుడు… ప్రజరంజకంగా పాలించిన పాలకుడు చెడిపోయినట్లు చరిత్రలో లేదు. పాలకుడికి మొదటి శత్రువు భజనపరుడే. పాలకుడికి మొదటి మిత్రుడు సద్విమర్శకుడే . కాబట్టి ఎవర్ని దగ్గర పెట్టుకోవాలో … ఎవర్నిదూరం పెట్టాలో ఆలోచించి నిర్ణయం తీసుకోండి.
———– తుర్లపాటి పరేశ్