కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పై దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన ఆత్మకథలో ఘాటైన విమర్శలు చేసారు. ఇప్పటికే స్వపక్షంలోని నేతలు విమర్శలు చేస్తుంటే … తట్టుకోలేక వాటికి సమాధానం చెప్పలేక మల్లగుల్లాలు పడుతున్న సోనియా .. రాహుల్ గాంధీ లు ప్రణబ్ విమర్శలపై నోరెత్తలేని పరిస్థితిలో పడిపోయారు. దివంగత నేతపై విమర్శలు చేస్తే సబబుగా ఉండదు. అదొక కాంట్రవర్సీ గా మారే ప్రమాదం లేకపోలేదు. ఇటీవలి కాలంలో స్వపక్ష నేతలు చెప్పిన విషయాలనే ప్రణబ్ తన పుస్తకంలో ఉటంకించారు. ప్రణబ్ ‘‘ద ప్రెసిడెన్షియల్ ఇయర్స్’’ పేరిట తన ఆత్మకథను రాశారు. వాటిలో కొన్ని విషయాలు లీక్ అయ్యాయి. అవే ఇపుడు సంచలనంగా మారాయి.
“2014 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి సోనియా, మన్మోహన్ లే కారణం . 2004లో నేను ప్రధాని అయ్యుంటే, పార్టీ అధికారం కోల్పోయేది కాదు. ఈ మాట నాది కాదు . వాటితో నేను ఏకీభవించలేదు. నేను రాష్ట్రపతి అయిన తర్వాత కాంగ్రెస్ నాయకత్వం బలహీనపడింది. పార్టీ వ్యవహారాలను సోనియా సమర్థవంతంగా నిర్వహించలేకపోయారు.” అని ప్రణబ్ వ్యాఖ్యానించారు. ఎంపీలకూ, మన్మోహన్‌కూ మధ్య సంప్రదింపులు లేకపోవడం … సోనియా పట్టించుకోకపోవడం తో పార్టీ పతనం మొదలైందని ప్రణబ్ పుస్తకంలోరాసుకున్నారు.వచ్చే నెలలో ఈ బుక్ విడుదల కానుంది.
నరేంద్రమోడీ పనితీరుపై కూడా ప్రణబ్ ముఖర్జీ కామెంట్ చేశారు. మోడీ తన తొలి ఐదేళ్ల పాలనలో నియంతృత్వ విధానాన్ని అనుసరించారు. ఆ సమయంలో ప్రభుత్వం, చట్టసభలు, న్యాయవ్యవస్థ మధ్య సంబంధాలు సరైన రీతిలో లేవు . అంటూ ప్రణబ్ వ్యాఖ్యానించారు.బుక్ రిలీజ్ కాకముందే ఇన్ని సంచలనాలు ఉంటే .. విడుదల అయ్యాక మరేలా ఉంటుందో చూడాలి. రూపా పబ్లిషర్స్ ఈ ఆత్మకథను తీసుకొస్తున్నది. ప్రణబ్ అనారోగ్యానికి గురికాక ముందే ఈ ఆత్మకథ రాసారని సమాచారం. కాంగ్రెస్ నాయకత్వం లో మార్పు రావాలని కోరుతూ …లేఖలు రాస్తూ .. విమర్శలు చేస్తూ పార్టీలో కొందరు నేతలు అసమ్మతి గళం వినిపిస్తున్న తరుణంలో… ప్రణబ్ ఆత్మకథ లోని విషయాలు సంచలనం సృష్టిస్తున్నాయి . తమ వాదనకు బలం దొరికిందని అసమ్మతి నేతలు దూకుడు పెంచే అవకాశాలు ఉన్నాయి. 84 ఏళ్ల ప్రణబ్ ముఖర్జీ కొవిడ్ బారినపడి జులై 31న కనుమూశారు.