యాంటీ బీజేపీ భావజాలంతో పదునైన విమర్శలు చేసే సత్తా ఉన్న బహుభాషా నటుడు ప్రకాష్ రాజ్ కి కీలక పదవి ఇచ్చి, ఆయన సేవలను పార్టీ కోసం వినియోగించుకోవాలని తెలంగాణ సీఎం కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ లతో మూడో ఫ్రంట్ పై చర్చలకు కూడా ప్రకాష్ రాజ్ ను కేసీఆర్ వెంట బెట్టుకువెళ్లారు.
ముంబయి లో సడన్ గా ప్రకాష్ రాజ్ ప్రత్యక్షమై కేసీఆర్ తో చర్చలకు వెళ్లడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపింది. ప్రకాష్ రాజ్ కి కేసీఆర్ కి చాలాకాలంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. 2015 లో ఒకసారి ప్రకాష్ రాజ్ ను ప్రగతి భవన్ కి పిలిపించుకుని వివిధ అంశాలపై మాట్లాడారు. అప్పటి నుంచి ప్రకాష్ రాజ్ కేసీఆర్ ల మధ్య స్నేహం కొనసాగుతోంది.
కేసీఆర్ కి ఎవరిపై అయినా గురి కుదిరితే వారిని అంత త్వరగా వదలరు. ప్రస్తుతం కేసీఆర్ కు దేశ రాజకీయాలపై మాట్లాడేవాళ్ళు ..సలహాలిచ్చేవాళ్ళ అవసరం ఉంది. ఈ క్రమంలోనే ప్రకాష్ రాజ్ ను పార్టీ టీమ్ లోకి తీసుకోవాలని కేసీఆర్ యోచిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇక ప్రకాష్ రాజ్ 2019 ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. నాటి ఎన్నికలో బీజేపీ అభ్యర్థి పీసీ మోహన్ విజయం సాధించారు. అప్పట్లో పీసీమోహన్ కి 6,02,853 ఓట్లు .. కాంగ్రెస్ అభ్యర్ధికి రిజ్వాన్ అర్షద్ కి 5,31,885 ఓట్లు వచ్చాయి. ప్రకాష్ రాజ్ కి కేవలం 28,906 ఓట్లు పడ్డాయి. బీజేపీ 70,968 ఓట్ల ఆధిక్యతతో గెలిచింది. ఇటీవల మా అసోసియేషన్ ఎన్నికల్లో కూడా ప్రకాష్ రాజ్ ఓడిపోయారు.
కాగా 2018 లో కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుపై బెంగళూరు వెళ్లి మాజీ ప్రధాని దేవెగౌడ ను కలిసినపుడు కూడా ప్రకాష్ రాజ్ ఉన్నారు. కాగా త్వరలో మరో విడత కేసీఆర్ తమిళనాడు సీఎం స్టాలిన్ .. కర్ణాటక మాజీ సీఎం కుమార స్వామి, దేవెగౌడలను కలవాలనుకుంటున్నారు.
ఈ కీలక భేటీలలో కూడా ప్రకాష్ రాజ్ ఉండబోతున్నారు. అటు స్టాలిన్ తో ..ఇటు కుమార స్వామితో ప్రకాష్ రాజ్ కు మంచి సంబంధాలున్నాయి. ఈ క్రమంలోనే సౌత్ ఇండియా లో గుర్తింపు ఉన్న ప్రకాష్ రాజ్ కు కీలక పదవి ఇచ్చి పార్టీ టీమ్ లోకి తీసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నట్టు పార్టీ వర్గాలలో వినిపిస్తోంది. మరి ప్రకాష్ రాజ్ ఏమంటాడో చూడాలి.