బీహార్ అసెంబ్లీ లో ఇవాళ నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. విపక్ష ఎమ్మెల్యేలపై పోలీసులు దాడి చేసారు.కిక్ పంచ్ లతో ఎమ్మెల్యేలను కొట్టారు. పోలీసులకు ప్రత్యేక అధికారాలు కల్పించే ‘‘బీహార్ స్పెషల్ ఆర్మ్‌డ్ పోలీస్ బిల్ 2021’’ను ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.కొద్దీ రోజుల క్రితం అసెంబ్లీ సమావేశంలో విపక్ష ఆర్‌జేడీ ఎమ్మెల్యేలు ఆ బిల్లు ప్రతులను చింపేశారు. ఆరోజు అసెంబ్లీలో జరిగిన రభసతో స్పీకర్, అసెంబ్లీని మంగళవారం నాటికి వాయిదా వేశారు.ఇవాళ సభ ప్రారంభంలోనే విపక్ష ఎమ్మెల్యేల నినాదాలతో మారు మ్రోగింది. దీంతో సభలో గందరగోళం నెలకొంది. స్పీకర్ సభను వాయిదా వేశారు. తర్వాత స్పీకర్ తన గదిలో ఉండగా ఆయన బయటకు రాకుండా ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు.
దీంతో స్పీకర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి ఎమ్మెల్యేలను బయటకు పంపే ప్రయత్నం చేశారు. వీరికి మార్షల్స్ కూడా సహకరించారు. ఎమ్మెల్యేలను సభ బయటికి పంపే క్రమంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వాగ్యుద్ధం జరిగింది.ఈ సందర్భంగా పోలీసులు ఎమ్మెల్యేలను తరిమికొట్టారు. అసెంబ్లీ ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. మహిళా ఎమ్మెల్యేలు కాసేపు ధర్నాకూడా చేశారు.
అదే సమయంలో బీహార్ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్నిఆర్జేడీ నిర్వహించింది. పార్టీ కార్యకర్తలను తరిమి కొట్టేందుకు పోలీసులు పోలీసు లాఠీ ఛార్జ్ చేశారు. ఆర్జేడీ మద్దతుదారులు పోలీసులపై రాళ్ళు రువ్వారు. పార్టీ నేతలను ..కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ బిల్ పాస్ కాకముందే పరిస్థితి ఇలా ఉంటే ఇక ముందు ముందు పరిస్థితులు ఎలాఉంటాయో అని విపక్ష ఎమ్మెల్యేలు వాదిస్తున్నారు. పోలీసుల దాడికి సంబంధించిన వీడియో నెట్లో హల్ చల్ చేస్తోంది.