’Mr. MyNaa swamy explained to the P.M about the greatness and historical significance of the temple————-
లేపాక్షి ఆలయం మూల విరాట్-ధ్యాన ముద్రలోని సుందర రూపం, శ్రీవీరభద్ర స్వామి ఉగ్రరూపo- తైలవర్ణచిత్రం, వేలాడే స్తంభం, వటపత్రశాయి,భిక్షాటనమూర్తి అద్భుత శిల్పం… భారత ప్రధాని నరేంద్ర మోడి ని మంత్రముగ్ధుడిని చేశాయి. జనవరి 16న లేపాక్షి వీరభద్రాలయ సందర్శనకు వచ్చిన మోడీ విజయనగర సామ్రాజ్య సాంస్కృతిక వైభవానికి ప్రత్యక్ష నిదర్శనగా నిలిచిన లేపాక్షి శిల్ప సంపద-తైల వర్ణచిత్రాలను చూసి సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు.
విజయనగర కాలం నాటి వైభవాన్ని ప్రత్యక్షoగా వీక్షించిన ప్రధాని తన్మయత్వం చెందారు. ప్రధాని ఆలయ సందర్శన సందర్భంగా చరిత్రకారుడు మైనా స్వామి మార్గదర్శక వ్యాఖ్యాతగా వ్యవహరించడం అరుదైన విషయం. దేవాలయ చరిత్ర, తైలవర్ణ చిత్రాలు-శిల్పాల గురించి ప్రధానికి చరిత్రకారుడు మైనాస్వామి వివరించారు. మైనాస్వామి రాసిన లేపాక్షి పుస్తకం మూడు భాషల్లో వెలువడి సంచలనం సృష్టించింది.మరో రెండు భాషల్లో వెలువరించడానికి ప్రయత్నిస్తున్నారు.
ప్రత్యేక పూజలు,సంకీర్తనల గానం,తోలుబొమ్మలాట పూర్తయిన తర్వాత ప్రధాని గర్భగుడి ప్రదక్షిణ చేశారు. అనంతరం మహా మండపం పైకప్పు మీద గల 25×14 అడుగుల వీరభద్రస్వామి ఉగ్రరూప తైలవర్ణ చిత్రాన్ని ప్రధాని చూశారు. 10 చేతుల్లో వివిధ ఆయుధాలు, పొడవాటి కత్తి, దక్షయజ్ఞం సందర్భంగా దక్షప్రజాపతి తలను తెగనరకడం వoటి విషయాలను చరిత్రకారుడు మైనాస్వామి ప్రధానికి వివరించారు.
మూల విరాట్ 4 చేతులు కలిగి ధ్యానముద్ర లో వున్నాడు.తైలవర్ణచిత్రం మాత్రం 10 చేతులతో మహోగ్రరూపంతో భిన్నంగా వుంది.ఆ తేడాను గమనించమని మోడిని కోరగా రెండు రూపాలను తదేకంగా తిలకించారు.
వేలాడేస్తంభం: నాట్యమండపంలోని భారీ స్తంభాలు- శిల్పాలు, పైకప్పుపై గల తైలవర్ణ చిత్రాలను చూసిన ప్రధాని ముగ్దులయ్యారు.
నేలను తాకని ఆకాశ స్తంభం దిగువన మైనాస్వామి ఒక పలుచటి వస్త్రాన్ని వుంచగా, ప్రధాని దాన్ని స్వయంగా స్తంభం కింద నుంచి వెలుపలకు లాగారు. వేలాడే స్తంభాన్ని ఆసక్తిగా గమనించారు.వేలాడే స్తంభం ప్రత్యేకతను అడిగి తెలుసు కొన్నారు. వేలాడే స్తంభం మరియు దాని పక్కనున్న స్తంభం చోళ శిల్పశైలి-మరో 2 పెద్ద స్తంభాలు హొయసల శైలిలో వుండగా,మిగిలిన స్తంభాలన్నీ విజయనగర శైలిలో వున్నాయని చరిత్రకారుడు చెప్పగా ఎంతో ఆసక్తిగా విన్నారు.
వటపత్రశాయి: మహాభారతం-అరణ్యపర్వంలోని కిరాతార్జునీయo, శివ పురాణంలోని గిరిజా కల్యాణం, వీరభద్ర అనుగ్రహం పొందిన ఆలయ నిర్మాత విరూపణ్ణ- ఆయన పరివారం, మార్కండేయ పురాణంలోని వటపత్రశాయి తైలవర్ణ చిత్రాలను పరిశీలించారు.ఆయా గాథలు-వటపత్రశాయి వర్ణచిత్రం గురించి మైనాస్వామి వివరించినప్పుడు బాలకృష్ణుని కన్నులను చిత్రించిన విధానాన్ని మోడి మూడు వైపుల నుంచి చూశారు. విజయనగర శిల్పులు-కళాకారుల ప్రతిభా పాటవాలకు ప్రధాని చేతులెత్తి నమస్కరించారు.
భిక్షాటనమూర్తి: నాట్యమండపం ఎడమవైపునున్న భిక్షాటనమూర్తి సుందర రూపాన్ని తనవి తీరా చూశారు. విజయనగర శిల్ప శైలి-ఇతర శైలి భిక్షాటనమూర్తి విగ్రహాలలో భేదాల గురించి చరిత్రకారుడు చెప్పగా భక్తి శ్రద్ధలతో విన్నారు. నరేంద్రమోడి శైవపురాణ క్షేత్రం-కాశి నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి పాఠకులకు తెలుసు.
ప్రధాని రాకతో లేపాక్షి ప్రభ నలుదిశల వ్యాపించడమే కాకుండా,వెనుకబడిన రాయలసీమ అభివృద్ధికి కూడా దోహదం కాగలదని చరిత్రకారుడు మైనాస్వామి అభిలషించారు.ఇలావుండగా వీరభద్ర స్వామి గుడిని పెనుకొండ కు చెందిన నంది లక్కిశెట్టి-ముద్దమాంబల సుపుత్రుడు నంది విరూపణ్ణ సామాన్య శకం 1531 లో నిర్మించాడు.
విజయనగర సామ్రాజ్య చక్రవర్తి సంబెట అచ్యుత దేవ రాయలు(శ్రీక్రిష్ణ దేవరాయల తమ్ముడు) ఆలయ నిర్మాణానికి అన్నిరకాలుగా సాయపడినట్టు చలివెందుల శాసనం(1531 ఆగస్ట్ 6) చెబుతున్నది. గుడి సముదాయంలో సుమారు 20 శాసనాలున్నాయి.రెండోప్రాకార గోడపై ఉత్తర దిక్కున గల ‘తుళు ప్రశస్తి’ శాసనాన్ని మైనాస్వామి ఇటీవల పరిష్కరించారు. ఆ శాసనాన్ని అచ్యుత దేవరాయలు 1533 లో రాయించారు.
కాగా లేపాక్షి వీరభద్రాలయ సముదాయానికి ‘యునెస్కొ(UNESCO)’ గుర్తింపు కోరుతూ మైనాస్వామి 2022 డిసెంబర్ 14,15 తేదీల్లో జాతీయ సదస్సును విజయవంతంగా నిర్వహించారు.
(చరిత్రకారుడు మైనాస్వామి ని 9502659119 చరవాణిలో సంప్రదించవచ్చు)