If they do not like ………………………………
నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, 76 ఏళ్ల అంగ్ సాన్ సూకీ పై 102 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉన్న11 అభియోగాలు నమోదు అయ్యాయి. ఇటీవల మయన్మార్ రాజధానిలోని ప్రత్యేక న్యాయస్థానం ఆంగ్ సాన్ సూకీ కరోనా వైరస్ ఆంక్షలను ఉల్లంఘించారన్నఅభియోగాన్ని పరిశీలించి దోషిగా నిర్ధారించింది. ఆమెకు నాలుగు సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
ఆమె ప్రభుత్వాన్ని పడగొట్టిన తర్వాత సూకీపై పెట్టిన కేసులకు సంబంధించి వచ్చిన మొదటి తీర్పుఇది. సైన్యానికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టడం ..దేశంలో కోవిడ్-19 ప్రోటోకాల్‌ను ఉల్లంఘించడం వంటి ఆరోపణలపై సూకీని దోషిగా తేల్చారు.మరో అభియోగంపై తీర్పు డిసెంబర్ 14కి రిజర్వ్ చేశారు. ఆ కేసులో సూకీకి మూడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని అంటున్నారు.
లంచాల స్వీకరణ ..అనుకూలమైన ఆస్తి ఒప్పందాల కోసం అధికారాన్ని దుర్వినియోగం చేయడం .. మరో నాలుగు అవినీతి ఆరోపణలతో సహా పలు ఇతర కేసుల్లో సూకీపై విచారణ జరుగుతోంది. సూకీ సెక్యూరిటీ గార్డులు లైసెన్స్ లేని వాకీ-టాకీలను ఉపయోగించినట్లు కూడా కేసు నమోదైంది.
జైలు శిక్ష అనుభవిస్తున్నఆస్ట్రేలియా ఆర్థికవేత్త సీన్ టర్నెల్‌తో కలసి అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించినందుకు కూడా ఆమెపై విచారణ జరుగుతోంది. ఇలా రకరకాల కేసుల్లో దశలవారీగా శిక్షలు విధించే అవకాశాలున్నాయి.వాస్తవానికి ఇలాంటి శిక్షలు .. నిర్బంధాలు అంగన్ సాన్ సూకీ కి అలవాటే. ఇపుడు కూడా ఆమె నిర్బంధం లోనే ఉన్నారు.
సూకీ 1989–2010 సంవత్సరాల మధ్యకాలంలో దాదాపు 15 సంవత్సరాలు నిర్బంధంలో గడిపారు. నాడు సైనిక పాలనలో ఉన్న మయన్మార్‌లో ప్రజాస్వామ్యాన్ని తీసుకురావడానికి ఆమె చేసిన వ్యక్తిగత పోరాటం సామాన్యమైనది కాదు. అణచివేతను నిరసిస్తూ శాంతి కపోతంగా నిలిచిన ఆమెకు అపుడే నోబెల్ శాంతి బహుమతి లభించింది.
2015లో సూకీ భారీ మెజారిటీతో విజయం సాధించినప్పటికీ, మయన్మార్ రాజ్యాంగం ఆమెను అధ్యక్షురాలిగా నిషేధించింది, ఆమెకు విదేశీ పౌరులైన పిల్లలున్నారని అభ్యంతరాలు వచ్చాయి. 2020 ఎన్నికల్లో 2015 కంటే భారీ మెజారిటీ తో గెలిచినప్పటికీ ఎన్నికల ప్రక్రియలో మోసాలకు పాల్పడ్డారనే అభియోగం తో ఆమెను మిలిటరీ పదవి నుంచి తొలగించింది. ఆ తర్వాత ఎమర్జెన్సీని ప్రకటించింది, పూర్తి సంవత్సరం పాటు సైన్యానికి అధికారాన్ని అప్పగించింది.
సూకీ పై వచ్చిన ఆరోపణలు బూటకమైనవి..రాజకీయంగా ప్రేరేపణతో నమోదైనవని … ఆమెను వెంటనే షరతులు లేకుండా విడుదల చేయాలని హ్యూమన్ రైట్స్ వాచ్ డిప్యూటీ ఆసియా డైరెక్టర్ ఫిల్ రాబర్ట్‌సన్ విజ్ఞప్తి చేశారు.సూకీ ని నిర్బంధం నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మయన్మార్ అంతటా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు ఈ శిక్షల విషయమై ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తదితర సంస్థలు మయన్మార్ సైన్యం తీరును విమర్శిస్తున్నాయి. అయినా మిలిటరీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.