రాజకీయపార్టీల ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతోంది. సంస్కరణలు మరింత ఉధృతంగా సాగుతూ పారిశ్రామికవేత్తల, కార్పొరేట్ సంస్థల ఆస్తులు పెరుగుతున్నపుడు భారీ విరాళాలతో రాజకీయ పార్టీలు బలపడటం సహజం.ఇందులో ఆశ్చర్య పోనవసరం లేదు. ఇక రాజకీయపార్టీల ఆదాయంలో 70 శాతం ‘గుర్తు తెలియని దాతల’ నుంచే అందుతున్నదని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రాటిక్ రైట్స్ (ఏడీఆర్) అనే స్వచ్ఛంద సంస్థ ఆమధ్య ప్రకటించింది. ఈ గుర్తు తెలియని దాతలు ఎవరనేది టాప్ సీక్రెట్. అది పారదర్శకత గురించి పదే పదే చెప్పే నేతలకే తెలియాలి. సామాన్యుడు తన బ్యాంకు ఖాతాలో దాచుకొనే మొత్తానికి కూడా లెక్కలు విప్పి చెప్పాలి … కానీ రాజకీయపార్టీలకు మాత్రం ఆ అవసరం ఉండదు. అది మన దేశంలోని ప్రత్యేకత. రాజకీయ పార్టీలకు కొన్ని చట్టాలు కవచకుండలాలు మాదిరి రక్షణ కల్పిస్తున్నాయని విమర్శలు వస్తున్నాయంటే రావా మరి.
ఆరు జాతీయపార్టీలు, గుర్తింపు పొందిన యాభై ఒక్క ప్రాంతీయపార్టీలు పదేళ్ళకాలంలో ఎన్నికల సంఘానికీ, ఆదాయపు పన్ను శాఖకూ సమర్పించిన వివరాలను బట్టి, అవి విరాళంగా అందుకున్న మొత్తం సొమ్ము దాదాపుగా 12 వేల కోట్లు అయితే, అందులో సుమారు 2 వేల కోట్లకు మాత్రమే దాతల వివరాలున్నాయి. ఆస్తుల అమ్మకం, వడ్డీలు, సభ్యత్వ రుసుములు ఇత్యాది ఆదాయాలను మినహాయిస్తే, ఏతావాతా 10 కోట్లు తమకు ఎక్కడ నుంచి.. ఏలా వచ్చిందో ఏపార్టీ చెప్పడం లేదు. ఆదాయపుపన్ను చట్టం ద్వారా పార్టీలు పొందుతున్న మినహాయింపుల కారణంగా అవి ఎంతటి అక్రమానికైనా పాల్పడేందుకు అవకాశాలున్నాయి.ఇది ఒకప్పటి పరిస్థితి. దీనిపై విమర్శలు వచ్చాయి.రాజకీయపార్టీలకు ఆదాయపుపన్ను మినహాయింపు ఎందుకంటూ ఎం.ఎల్.శర్మ అనే న్యాయవాది సుప్రీంకోర్టులో పిల్ వేస్తే సుప్రీంకోర్టు కొట్టివేసింది. పార్టీలు తాము స్వీకరిస్తున్న ప్రతి రూపాయికీ దాతలెవరో చెప్పాలన్న వాదనను కూడా న్యాయస్థానం తిరస్కరించింది.
ఈ మినహాయింపు ఎందుకు చట్టవిరుద్ధమో, విరాళం పేరిట రాజకీయపక్షాలు ఎలా కోట్లాది రూపాయల నల్లధనాన్ని కూడబెడుతున్నాయో వివరించారు శర్మ. కానీ, ఎవరిని పన్ను పరిధిలోకి తీసుకురావాలో, ఎవరిని మినహాయించాలో నిర్ణయించాల్సింది ప్రభుత్వాలే కానీ, న్యాయస్థానాలు కాదంటూ ధర్మాసనం చేతులు దులిపేసుకుంది. రాజకీయపక్షాలు ప్రజలనుంచి పారదర్శకతనూ జవాబుదారీ తనాన్నీ డిమాండ్ చేస్తూ తాము మాత్రం వాటికి అతీతంగా వ్యవహరిస్తున్నాయి. తమను పోషిస్తున్న వ్యక్తులనూ, సంస్థలనూ చట్టాలతో కాపాడు కొస్తున్నాయి. పన్నుమినహాయింపులు, భూకేటాయింపులు సహా పలు ప్రయోజనాలు పొందుతున్నందున రాజకీయపార్టీలు ఖచ్చితంగా సమాచారహక్కుచట్టం పరిధిలోకి వస్తాయని 2013లో కేంద్ర సమాచార కమిషన్ ప్రకటించింది. ఈ ఆదేశాన్ని రాజకీయపార్టీలు బేఖాతరు చేశాయి. ఈ ఒక్క విషయంలో మాత్రం ఒకే మాట మీద ఉన్నాయి.
ఈ క్రమంలోనే 2017లో మోదీ ప్రభుత్వం ఎన్నికల బాండ్ల పధకం ప్రవేశపెట్టింది. దీని కింద ఎవరైనా గానీ బ్యాంకులకు వెళ్లి బాండ్లు కొనుగోలు చేసి తమ ఇష్టం వచ్చిన రాజకీయపార్టీకి వాటిని విరాళంగా ఇవ్వవచ్చు. అలా ఇచ్చిన దాతల వివరాలు రహస్యంగా ఉంటాయి అవినీతి, నల్లధనంపై పోరాటం అనగానే ఎవరికైనా నరేంద్ర మోదీ గుర్తుకు వస్తారు. ఎందుకంటే దశాబ్దాల కాంగ్రెస్ పాలన అవినీతినీ, నల్లధనాన్నీ వ్యవస్థీకృతం చేసిందనీ, ఈ రుగ్మతలను రూపు మాపడమే తన లక్ష్యమనీ ఆయన పలుమార్లు చెప్పారు కాబట్టి . ఈ మాటలతోనే చాలామంది ప్రజలను ఆయన నమ్మించగలిగారు. ఆ పోరాటం సంగతేమో గానీ రాజకీయ పార్టీల నిధుల సమీకరణలో కూడా నల్లధనానికి దారులు వేసింది మోదీ ప్రభుత్వమే.ఈ పధకం ప్రవేశపెట్టడం వెనుక జరిగన కథ తెలుసుకుంటే ఆశ్చర్యం కలగక మానదు. చాలా తెలివిగా సమాచారహక్కు చట్టం పరిధిలోకి రాకుండా నిధులు సమీకరణ చేసుకునే అవకాశం రాజకీయపార్టీలకు కల్పించారు .
2017లో అప్పటి ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ 2017 బడ్జెట్‌లో ఈ పధకం ప్రకటించడానికి కొద్దీ రోజుల ముందు ఆ శాఖలోని ఒక అధికారి, దీనికి ముందు రిజర్వు బ్యాంక్ సమ్మతి తీసుకోలేదన్న సంగతి గుర్తించారు. అప్పటికప్పుడు హడావుడిగా అనుమతి తెప్పించారు. ఆర్బీఐ అభ్యంతరాలతోనే అనుమతి ఇచ్చింది . తర్వాత జైట్లీ పార్లమెంట్‌కు ఈ ప్రతిపాదన సమర్పించారు. ఆ మరుసటి నెలలో ప్రతిపాదన చట్టంగా మారింది. ఈ పధకం రాజకీయపార్టీలకు, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి నిధుల వరద పారించింది. ఇప్పటివరకూ బ్యాంకులు బాండ్లు అమ్మకాల ద్వారా వచ్చిన నిధుల్లో 90 శాతం పైగా బిజెపికి అందాయి. మొదటి విడత అమ్ముడైన 222 కోట్ల బాండ్లలో బిజెపికి 95 శాతం అందినట్లు అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ సంస్థ తెలిపింది. గతంలో కార్పొరేట్ కంపెనీలు తాము రాజకీయపార్టీలకు ఇచ్చిన విరాళాలను బహిరంగపరచాల్సివచ్చేది. ముందు మూడేళ్లలో తమ కంపెనీ ఆర్జించిన లాభం సగటులో 7.5 శాతం కన్నా ఎక్కువ నిధులు విరాళంగా ఇవ్వడానికి వీలయ్యేది కాదు. విదేశీ కంపెనీలయితే అసలు విరాళాలు ఇచ్చేందుకు లేదు. ఎన్నికల బాండ్ల వల్ల ఈ విధానం మారిపోయింది. కంపెనీలు, ఆ మాటకొస్తే సూటుకేసు కంపెనీలు, వ్యక్తులు, ట్రస్టులు, విదేశీ కంపెనీలు గప్‌చిప్‌గా ఎన్ని కావాలంటే అన్ని బాండ్లు కొనుగోలు చేసి తమ ఇష్టం వచ్చిన రాజకీయపార్టీలకు విరాళంగా ఇవ్వవచ్చు.ఇస్తున్నాయి.
ఈ బాండ్ల పధకాన్ని లోక్‌సభలో జైట్లీ ప్రతిపాదించినపుడు, ఈ సంస్కరణ రాజకీయపార్టీల నిధుల సేకరణలో మరింత పారదర్శకత, జవాబుదారీతనం తీసుకువచ్చి భవిష్యత్తులో నల్లధనం రాకుండా అరికడుతుంది అని ప్రకటించారు. కానీ అందుకు భిన్నంగా జరుగుతోంది. వీటి ప్రకారం బాండ్లు కొనుగోలు చేసిన వారి వివరాలను బ్యాంకులు రహస్యంగా ఉంచాలి. ఈ వివరాలు సమాచార హక్కు చట్టం పరిధిలోకి రావు. తమకు బాండ్లు విరాళంగా ఇచ్చిన వారి వివరాలను రాజకీయ పార్టీలు రికార్డు చేయాల్సిన అవసరం లేదు. మోదీ ప్రభుత్వం మరో గమ్మత్తు కూడా చేసింది. బాండ్లు కొనుగోలు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయని బహిరంగంగా చెప్పిన దానికి భిన్నంగా ఆ వివరాలు ప్రభుత్వానికి మాత్రమే తెలిసేలా చేశారు. బ్యాంకుల దగ్గరున్న వివరాలను కావాలనుకుంటే ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు తీసుకోవచ్చని తీర్మానించారు. దీన్ని బట్టి చూస్తుంటే చాలా తెలివిగా ఎన్నికల బాండ్ల పధకాన్ని తెరపైకి తెచ్చారని చెప్పుకోవచ్చు. ఆర్టీఐ కింద వివరాలు అడిగితే ఏ నగరంలో ఎంత మొత్తం లో బాండ్లు అమ్మారో బ్యాంకు వారు చెబుతున్నారు కానీ వాటిని ఎవరికి అమ్మారో చెప్పడం లేదు. చెప్పరు కూడా. ఇక రాజకీయ పార్టీలు అసలు చెప్పనే చెప్పవు.
——————-KNM