పెంకుటిల్లుకూ…ఓ కథ వుంది..!!

Sharing is Caring...

Abdul Rajahussain……………..

ఉమ్మడి కుటుంబాల ‘ వసారా ‘ కూలిపోతోంది..మనుషుల్ని కలిపివుంచే మండువా లోగిళ్ళు  మాయమైపోతున్నాయి….!! సాంప్రదాయపు ‘ పెంకులు ‘ ఊడిపోతున్నాయి ..!!ఒకప్పుడు పల్లెల్లో పూరిళ్ళు, పెంకుటిళ్ళుండేవి . ఎక్కడోగానీ…మేడనో, మిద్దెనో, డాబానో కనబడేది.

పేదోళ్ళు పూరిళ్ళలో వుంటే….ఎగువ మధ్యతరగతి నుంచి ఓ మోస్తరు సంపన్నులు పెంకుటిళ్ళలో వుండే
వారు.మోతుబరులు మేడల్లో వుండేవాళ్ళు.అన్ని ఊర్లలో మాదిరిగానే నంది వెలుగు గ్రామంలో కూడా పూరిళ్ళు,పెంకుటిళ్ళు,ఒక మేడ వుండేవి.రాను రాను పూరిళ్ళు,పెంకుటిళ్ళు కనుమరుగై పోయాయి. ఇప్పుడు ఊర్లో ఎక్కడ చూసినా..మిద్దెలూ,మేడలే…కనిపిస్తున్నాయి.

ఊర్లో మొత్తం కలిపినా పది,పదిహేను కంటే ఎక్కువలేవు.పూరిళ్ళ పరిస్థితి కూడా….ఇంచు మించు ఇలానే వుంది.అలాగని పేదోళ్ళందరూ మేడలకు ఎగబాకారని కాదు…వున్న గుడిసెలు అమ్ముకుపోతే
పూరి తన పునాదులపై మేడలు మొలుస్తున్నాయి.

ఇప్పుడు చెప్పొచ్చేది పెంకుటిల్లు కథ గురించి…!!పెంకుటిల్లు సాంప్రదాయ నివాసం.దూలాలు,నిట్టాడులు, రాతి /ఇటుక గోడలు…పైకప్పు మాత్రం పెంకులు….., ఈ పెంకుల్లో కూడా రెండు రకాలు.ఒకటి చిన్నపెంకులు, రెండోవి పెద్ద పెంకులు. మొదట అందరూ చిన్న పెంకులే వేసుకునేవారు.రాను రాను పెద్ద పెంకులపై మోజు పెరిగింది.

కానీ..మన సాంప్రదాయ పెంకుటిళ్ళన్నీ దాదాపు చిన్నపెంకులతో కప్పబడినవే. ఉమ్మడి కుటుంబాలకు నిలువెత్తు నిదర్శనాలు పెంకుటిళ్ళ మండువా లోగిళ్ళుండేవి..కుటుంబ గౌరవానికి ప్రతీకగా ఇవి అలరించేవి. ఆ ఇంటికీ,యజమానికి సంఘంలో గౌరవం ఉండేది. ఆ తరువాత ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం కావడంతో మండువా లోగిళ్ల అవసరం లేక పోయింది.

సుమారు 40 ఏళ్ల క్రితం వరకు గ్రామాల్లోఈ లోగిళ్లు ఎక్కువగా ఉండేవి. పచ్చని పంటచేలు, కాలువలతో కళకళలాడే పల్లెలకు ఈ మండువాలోగిళ్లు ప్రత్యేక ఆకర్షణగా ఉండేవి. ఆ తరువాత పట్టణాలకు దీటుగా గ్రామాల్లో కూడా కాంక్రీటు భవనాల నిర్మాణం పెరిగింది. పెంకుటిళ్ళు క్రమంగా కనుమరుగవుతున్నాయి. ఉమ్మడి కుటుంబాల ‘ వసారా’ కూలిపోతోంది.

సాహిత్యంలో పెంకుటిల్లు…!!

కొమ్మూరి వేణుగోపాలరావు గారు 1956లో “పెంకుటిల్లు”. అనే నవల రాశారు. 1950ల నాటి తెలుగు ప్రజల మధ్యతరగతి జీవనాన్ని ఈ నవలలో ప్రతిబింబించారు.ఆ కాలంలో మధ్యతరగతి ప్రజలు ప్రధానంగా పెంకుటిళ్ళలో నివసించేవారు కాబట్టి రచయిత ఆ పేరును ఎంచుకున్నారు. ఈ పెంకుటిల్లు
నవలా సాహిత్యంలో ప్రముఖమైన నవలల్లో ఒకటిగా… రికార్డు నమోదు చేసుకుంది.

రచయిత కొమ్మూరి వేణుగోపాలరావు నవలను 1956లో రాశారు. కథలో 1940 నుంచి 1950ల మధ్యకాలం, కృష్ణా డెల్టాలోని ఒకానొక పట్టణం స్థలకాలాల జీవన నేపథ్యాన్ని ఇందులో చూడొచ్చు. ఓ కుటుంబం ఎంతో ప్రేమతో వుంటున్న పెంకుటిల్లు ను ఖాళీ చేసి వెళ్ళడానికి దారితీసిన పరిస్థితులను ….ఎంతో హృద్యంగా,మానవతా దృక్పథంతో కళ్ళకు కట్టినట్లు వర్ణించారు రచయిత కొమ్మూరి వేణుగోపాలరావు.

ఇప్పుడు కాలం మారింది.కాలంతో పాటు విలువలూ మారాయి..ఉమ్మడి కుటుంబం వ్యవస్థ ఛిద్రమైంది….దాంతో పాటే.. పెంకుటిళ్ళు…మండువా లోగిళ్ళు…వసారాలు అంతర్థానమై పోతున్నాయి. రాబోయే తరానికి పెంకుటిళ్ళను ఫోటొ ఆల్బమ్స్ లో చూపించే పరి స్థితి దాపురించినా…ఆశ్చర్యం లేదు.!!

“పెంకుటిల్లు ముసలిదవుతున్నది.. కండలు పెంచుకున్న గోడలది వీడని ధైర్యం.. కోతి చేష్టలకు పెంకుల బొక్కలిరిగినట్లున్నయి… మబ్బులకెవరు తోరణాలు కట్టారో…పండుగ దండిగ చేసుకుంటోంది…
పూనకమొచ్చిన వర్షం… కిందికి మీదికి కుండపోత… కొత్త ఊర్పులన్ని కన్నీళ్లతో తొంగిచూస్తున్నాయి
గిన్నెలు, బకెట్లు నోరు తెరుచుకున్నయి ఆకలితో “!!
*(కొమురవెల్లి అంజయ్య) !!
ఇదీ ఒకనాటి వైభవానికి చిహ్నమైన మన సాంప్రదాయపు పెంకుటిళ్ళ…నాటిచరిత్ర.. .నేటి దుస్థితి.!!

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!