Not assigning work ……………………….
కోటి రూపాయల జీతం ఇస్తున్నారు.. కానీ పని ఏదీ చెప్పడం లేదట.. దీంతో అతగాడు కోపమొచ్చి కోర్టు కెక్కాడు. అతడికి ఏడాదికి కోటి రూపాయల జీతం. కానీ ఆఫీసుకు వెళితే చేయడానికి పెద్దగా పని ఉండటం లేదట. పైగా వారంలో రెండు రోజులు ఆఫీసుకు కూడా వెళ్లాల్సిన అవసరం లేదట.
ఐరిష్ రైల్‌లో ఫైనాన్స్ మేనేజర్ గా చేస్తున్న డెర్మోట్ అలస్టైర్ మిల్స్ కి మేనేజ్మెంట్ వ్యవహార శైలి నచ్చలేదు. దీంతో కోర్టులో పిటీషన్ వేశాడు. కాగా అంతకు ముందు 2014లో అతడికి ఆఫీసు లావాదేవీలపై అనుమానం వచ్చింది. ఉన్నతాధికారులను సంస్థ లావాదేవీలపై ప్రశ్నించాడు. దీంతో అప్పటి నుంచి అతడు చేయాల్సిన పనిని తగ్గించారు.
ఏదో మొక్కుబడిగా పని ఇస్తున్నారు తప్పితే.. సమావేశాలకు ఇతర కార్యక్రమాలకు పిలవడం లేదు. తోటి ఉద్యోగులు కూడా అతడితో సరిగా మాట్లాడటం లేదు. పైగా వారంలో రెండు రోజులు ఆఫీసుకు రావాల్సిన అవసరం లేదని కూడా అతడికి చెప్పారు.గత కొన్నేళ్లుగా ఇదే తంతు కొనసాగుతోంది. అయితే ఇప్పటి వరకూ ఓపిక పట్టిన అతడు ఇటీవల సహనం కోల్పోయాడు. కోర్టును ఆశ్రయించాడు.
ఏటా కోటి రూపాయల జీతం ఇస్తున్నారు కానీ.. అందుకు తగిన పని మాత్రం చెప్పడం లేదంటూ కోర్టును ఆశ్రయించాడు. తన గోడును న్యాయమూర్తి ముందు వెళ్లబోసుకున్నారు. ఈ క్రమంలో అతడి కేసుపై విచారణ జరిపిన కోర్టు ఈ కేసు తదుపరి విచారణను వచ్చే ఫిబ్రవరికి వాయిదా వేసింది. విచారణకు ఉన్నతాధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని స్పష్టం చేసింది. ఈ వార్త స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది.