AG Datta……………………………….
రామకృష్ణ పరమహంసకి సంతానం ఉండి ఉంటే, మనమో కొత్త ప్రవర చెప్పుకోవాల్సి వచ్చేదని ఓ మిత్రుడు సరదాగా వ్యాఖ్యానించారు. రామకృష్ణుడికి సంతానం ఎందుకు లేదు? ఉంది. అయితే ఆ ప్రవర సంప్రదాయంగా, శాంతంగా, ప్రశాంతంగా ఉండదు. అది విప్లవకరమైన ప్రవర!
ఆ ప్రవర చెబుతుంటే యుగ యుగాల, తర తరాల చెత్తాచెదారం ఎగిరి పడుతోంటుంది. చారిత్రిక దారుల వెంబడి రక్తపాతాలు, దేశ వినీల ఆకాశంలో అగ్నికీలలు, జాతి జనులు హృదయాల్లోని మహోగ్రహాలు కదలాడుతాయి. ఇదే రామకృష్ణుడి విప్లవకర ప్రవర!
శ్రీరామకృష్ణ, శారదాదేవి ప్రథమ ప్రియ సంతానం స్వామి వివేకానంద! స్వామి వివేకానంద ఇంగ్లాండ్ నుంచి తీసుకొచ్చిన సిస్టర్ నివేదిత శారదాదేవి ప్రియపుత్రిక. స్వామి వివేకానంద మరణం తరువాత బ్రిటీష్ గుండెల్లో అగ్గి బావుటాలు ఎగరేసిన అనుశీలన సమితి స్థాపకుడు అరబిందో ఘోష్ ద్వితీయ పుత్రుడు. అనుశీలన సమితి కేంద్ర కమిటీలో సిస్టర్ నివేదితతో పాటు వివేకానందుడి సోదరులూ ఉంటారు. వారూ రామకృష్ణుడి సంతానమే!
అనుశీలన సమితి సభ్యుడు, ఉరికొయ్యను ముద్దాడిన తొలి స్వాతంత్ర్య సమర బాలుడు ఖుదీరామ్ ఈ ప్రవరలోని వాడే! ఆనాడు ఈ విప్లవ యువకులందరికీ పెద్ద దిక్కుగా ఉన్న చిత్తరంజన్‌దాసుదీ ఇదే ప్రవర. సాలీడుకి, రాట్నం వడకడానికి తేడా ఏముందని గాంధీని ప్రశ్నించిన శరత్‌చంద్ర చటోపాధ్యాయదీ ఇదే ప్రవర!
మన్యంలో దేవీ ఉపాసకుడు అల్లూరి సీతారామరాజుదీ, తెలంగాణాలో కొమరం బీముదీ ఈ ప్రవరే! అనుశీలన సమితి హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్‌గా మారినప్పుడు భగత్‌సింగ్‌దీ, చంద్రశేఖర్ అజాద్‌ది ఇదే ప్రవర! విమానం ఆకాశంలో పేలిపోయి మేఘాల్లో కలిసిపోయిన సుభాష్‌చంద్రబోస్‌దీ ఇదే ప్రవర. ఈ విప్లకర ప్రవరలో ఆఖరి నామం నేతాజీ.
సాక్ష్యం కావాలా?
ఒకసారి స్వామి వివేకానంద తనకు నిర్వికల్ప సమాధి కావాలని పరమహంసను కోరినప్పుడు ఆయన
”ఛీ ఛీ నీ నోటి నుండి ఈ మాటలా? నువ్వేనా ఇలా మాట్లాడేది?ఎంత గొప్ప యోగ్యుడివిరా నువ్వు! నీకింత చిన్న కోరికా? నీవు నీ ఒక్కడి ముక్తి గురించే ఆలోచిస్తున్నావా? అసంఖ్యాకమైన ఈ నిస్సహాయ జనుల గురించి, వారి బాధల గురించి ఏ మాత్రం ఆలోచించవా నువ్వు? నువ్వేదో పెద్ద విశాల వటవృక్షమవుతావని, వేలాదిమంది జనులు నీ నీడలో ఆశ్రయం పొందుతారని, ఎన్నో కలలు కన్నాను నేను.
అలా కాకుండా, నువ్వు కేవలం నీ విముక్తి గురించే ఆలోచిస్తున్నావా? నువ్వింత స్వార్థపరుడివా? లేదు, నాయనా, అలా కాకుడదు. అంత అల్ప దృష్టితో ఆలోచించకు. నాకు చేప పులుసూ ఇష్టం, ఇగురూ ఇష్టం. వేపుడూ ఇష్టం. అలా నువ్వు కూడా భక్తి, జ్ఞాన, కర్మ యోగాలను అనుష్టించు నాయనా!” అన్నారు.
రామకృష్ణుడి ఓషనిక్ అనుభవం తరువాత ఏమైందీ? అసలా అనుభవంపై ప్రపంచ సైకాలిజస్టులు ఏమన్నారు? వంటి విషయాలపై నిపుణుల అభిప్రాయాలతో ఈ వెబ్సైట్ నిర్వాహకులు ఒక ప్రత్యేక కథనం వెలువరించాల్సిందిగా కోరడమైనది.