మోటుపల్లి లో “పల్లవ ప్రశస్తి”శాసనం!

Sharing is Caring...

 A precious inscription without protection…………………………………… 

ప్రకాశం జిల్లా చినగంజాం మండలం మోటుపల్లి లో ఉన్న రామాలయం ప్రాంగణంలో “పల్లవప్రశస్తి”శాసన ఫలకాన్ని ఆ మధ్య కనుగొన్నారు. ఇది ఎండకు ఎండుతూ .. వానకు తడుస్తూ ఒక పక్కన పడి ఉంది. ఇటీవల రామాలయాన్ని దర్శించిన  ప్రముఖ చారిత్రక పరిశోధకుడు మైనాస్వామి ఈ ఫలకాన్ని పరిరక్షించాలని రాష్ట్ర పురావస్తు శాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు. 

మోటువల్లి రామాలయం, వీరభద్ర స్వామి సన్నిధి పరిసరాల్లోని శాసనాలను ఆయన పరిశీలించారు. రామాలయం పక్కనున్న శాసనంలోని అంశాలను చదివి. .. దానిని క్రీ.శ. 1231 నాటి ముక్కంటి పల్లవప్రశస్తి శాసనంగా నిర్ధారించారు.

ఇప్పటిదాకా ఆ శాసనాన్ని కాకతీయ గణపతి దేవుని శాసనంగా భావించారు. బ్రిటిష్ అధికారులు కూడా గణపతి దేవుని శాసనంగానే పరిగణించారు. గణపతి దేవుని 1244 సం॥ నాటి శాసనం వీరభద్రాలయంలో ఉంది. 

రామాలయంగా ప్రసిద్ధి పొందిన మందిరం ఒకనాడు. గణపతి ప్రసన్న చెన్నకేశవ గుడి. చెన్నకేశవగుడికి భూదానం చేసిన సందర్భంగా రాసినదే  ఆ శాసనం.  శాసన ఫలకం నాలుగు ముఖాల్లోనూ శాసనాలున్నాయి. మొదటి ముఖంలో ‘పల్లవ కుల తిలక’ మలిదేవ మహారాజు కుమారుడు సిద్ధమ దేవమహారాజు చేసిన భూదానం గురించి రాసి ఉందని మైనాస్వామి వివరించారు.

ఆ శాసనంలో తెలుగు భాష అద్భుతంగా ఉంది.  అటువంటి శాసనం ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూండడం బాధాకరమని మైనాస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. మోటు పల్లి పల్లవ ప్రశస్తి శాసన పరిరక్షణకు తక్షణం చర్యలు. చేపట్టాలని ఆయన కోరారు. ఔత్సాహిక పరిశోధకుడు కావలి సనత్ కుమార్ రెడ్డి కూడా మైనాస్వామి వెంట ఉన్నారు. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!