క్లాస్+మాస్ ను మెప్పించడం ఆయనకే సాధ్యం !

Sharing is Caring...

ఆయన “ఆరేసుకోబోయి పారేసుకున్నాను” అన్నాడు జనం వెర్రెక్కిపోయారు.
“కృషి ఉంటే మనుషులు రుషులవుతారు ” అనగానే ఈ రెండు పాటలు ఒకరేనా రాసింది అని అబ్బురపడ్డారు.
“చిలక కొట్టుడు కొడితే” అంటూనే “చీరలెత్తుకెళ్లాడే చిలిపి కృష్ణుడు” అనే కొత్త పల్లవి అందుకున్నాడు.
 జనం చప్పట్లు కొట్టారు.
“ఎరక్క పోయి వచ్చానే…ఇరుక్కుపోయానే” అనుకుంటూ చిత్రపరిశ్రమ లో స్థిరపడిపోయాడు.
“అద్వైత సిద్ధికి అమరత్వ లబ్ధికి – గానమే సోపానము ” అనగానే జనం నీరాజనాలు పట్టేరు.
“దొరకునా ఇటువంటి సేవా” అని భావించి వందలకొద్దీ పాటలు రాసాడు.
“తనువూగింది ఈ వేళ “.. అంటే జనాలు ఊగిపోయారు. “ఝమ్మంది నాదం…” అని అంటుంటే అందరి పాదాలు సై అన్నాయి.
“తకిట తథిమి తకిట తథిమి తందానా” అనంటే ప్రేక్షకులు టెన్షన్‌ పడిపోయారు.
“నవమి నాటి వెన్నెల నీవు..దశమి నాటి జాబిలి నేను” అనగానే ప్రేమికులు జేజేలు పలికేరు.
” ప్రతి భారత సతిమానం చంద్రమతి మాంగళ్యం – మర్మస్థానం కాదది మీ జన్మస్థానం “అంటూ పోకిరీలకు చురకలేసి అందరి ప్రశంసలు అందుకున్నారు.
 “రాలి పోయే పూవా నీకు రాగాలెందుకే” అంటే అబిమానులు కన్నీళ్లు పెట్టారు. కేంద్రం అవార్డ్ తో సత్కరించింది.
భక్తి, వేదాంతం, శృంగారం, ప్రేమ, విషాదం, వినోదం, విప్లవం, సందేశాత్మకం ఇలా ఒక్కటేమిటి… ఏ రసంలోనైనా, ఏ సన్నివేశానికైనా పాటలు రాసి అందించారు ఆయన. చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. 

1936 జనవరి 29న కృష్ణా జిల్లా పెద్ద కళ్లేపల్లిలో వేటూరి సుందరరామ్మూర్తి పుట్టారు. మద్రాస్‌ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియేట్, విజయవాడలో డిగ్రీ పూర్తి చేసిన వేటూరి సుప్రసిద్ధ కవి వేటూరి ప్రభాకరశాస్త్రి కుటుంబానికి చెందినవారు.

అప్పట్లో దైతా గోపాలం నటన, కధ, కవిత, గాన, దర్శకత్వ శాఖల్లో పలువురికి శిక్షణ ఇచ్చేవారు. వేటూరి  ఆయన దగ్గర తొలి పాఠాలు నేర్చుకున్నారు. తరువాత మల్లాది దగ్గర కూడా శిష్యరికం చేశారు. ఆపై… ఆంధ్రప్రభ దినపత్రికలో పాత్రికేయుడిగా 1956 నుంచి సుమారు 16 సంవత్సరాలు పనిచేశారు.

విశ్వనాధ్ ద్వారా  సినీ పరిశ్రమకు పరిచయమై కొన్ని వేల పాటలు రాసారు. వేటూరికి ఎన్నో అవార్డులు, పురస్కారాలు లభించాయి. ఎనిమిది సార్లు నంది బహుమతులు అందుకున్నారు.‘మాతృదేవో భవ’ చిత్రం కోసం వేటూరి రాసిన ‘రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే?’ పాటకు జాతీయ పురస్కారం లభించింది. అదే సినిమాలోని ‘వేణువై వచ్చాను భువనానికి…గాలినై పోతాను గగనానికి’ పాటకి మనస్విని అవార్డు లభించింది. అటు క్లాస్ ఇటు మాస్ ప్రేక్షకుల  మనసుదోచుకున్న కవి ఆయన. 

—————KNM

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!