ఆన్ లైన్ ప్రేమలు..స్మార్ట్ ఫోన్ స్నేహాలు !

Sharing is Caring...

Online friendships are dangerous………………………………………

స్మార్ట్ ఫోన్లు,ఫేసుబుక్, వాట్సాప్ చాటింగ్ వచ్చాక స్నేహం, ప్రేమలు కూడా హైటెక్‌ రంగులు పులుము కుంటున్నాయి.  లోకమంతా ఆన్‌లైన్‌ మయమైన నేపధ్యం లో గంటల తరబడి జనాలు ( వయసుతో నిమిత్తం లేదు) మాట్రిమోనియల్స్‌, సోషల్‌ నెట్‌వర్కింగ్‌, ఆన్‌లైన్‌ చాటింగ్‌ పేరేదైనా కొత్త పరిచయాల కోసం జనాలు అర్రులు చాస్తున్నారు. 

‘హాయ్ నైస్‌ మీటింగ్‌  యు’ అంటూ నెమ్మదిగా మొదలయ్యే ఆ పరిచయాలు కొద్ది కాలంలోనే స్నేహాల పరిధిని దాటేసి రంగురంగుల లోకంలో విహరించేలా చేస్తున్నాయి.. ఈ పలకరింపుల కవ్వింతలు…ఊహల పలవరింతలు మొదట్లో బాగానే అనిపిస్తాయి. రాన్రాను  మైకంలో ముంచేసి మోహంలో పడిపోయే ట్టు చేస్తాయి.ఆకలి దప్పులు తెలియవు…గంటల కొద్ది చాటింగ్ లేదంటే ఫోనులో మాటలు..వీటితోనే కాలం గడచి పోతుంది.

కమ్యూనికేషన్ వ్యవస్థ విస్తృతం అయ్యాక ఈ తరహా స్నేహాలు మొదలైనాయి. గతంలో మనిషి ని చూసాకనే స్నేహం చేసేవారు.ప్రేమించేవారు… పెద్దలకు తెలియకుండా చెట్ల వెంట ..పుట్టల వెంట తిరిగే వారు. అప్పట్లో కలం స్నేహాలు ఉన్నప్పటికి అంతగా పాపులర్ కాలేదు.ఆ స్నేహం చదువుకున్న వారికే పరిమితం.

ఎపుడైతే  కమ్యూనికేషన్ పెరిగిందో… స్నేహాలు హద్దులు దాటాయి. ఎల్లలు అధిగమించాయి.వయసు,చదువు,అర్హతలు వంటి వాటితో పనిలేకుండానే స్నేహాలు పెరిగి పోయాయి.
ఈ ఆన్ లైన్ స్నేహాలు ఏదో కొద్దిమందికి నిజమైన స్నేహాన్ని పంచినా చాలామందికి మాత్రం ఆ ఆనందం తాత్కాలికమే.

ఆ అనుభవాలు చేదు అనుభవాలే.అలాంటి స్నేహంలో కాలం గడిచే కొద్దీ చిక్కులు అనివార్యం. పరిచయాల్లో చనువు అధికమై, మాటలు కోటలు దాటి, సరదాలు శ్రుతి మించుతాయి. ఇంకేం? ఆ తర్వాత స్నేహం ముసుగులో గాఢమైన బంధాలు ఏర్పరుచుకునే దిశగా అడుగులు పడతాయి. తమాషా ఏమిటంటే అటు వైపు వారు ఆడో ?మగో??వారి వయసు ఎంతో తెలీకుండానే బంధాలు బలపడతాయి. కొందరైతే మోసపోతారు.కొందరైతే ప్రాణాలు కోల్పోయిన ఉదాహరణలున్నాయి.

సంసారం లో కలతలు ..విడాకులు ..పెళ్లిళ్లు పెటాకులు అయిన సందర్భాలు ఉన్నాయి.ఒకప్పుడు ఇతరుల వ్యామోహంలో పడడానికి వైవాహిక జీవితంలో అసంతృప్తి ప్రధాన కారణంగా ఉండేది. భార్య నచ్చకనో ..భర్త నచ్చకనో…లేదా కోర్కెలు తీరకనో ..మరేదైనా అసంతృప్తి తోనో  కొత్త సంబంధాల కోసం వెంపర్లాడే వారు.

ఈ నయా స్నేహాల విషయంలో ఆ తరహా అసంతృప్తి పాత్ర కొంత ఉన్నప్పటికీ అదే కీలకం కాదు. అపోజిట్‌ సెక్స్‌తో మాట్లాడాలన్న తహ తహ, ఉత్సుకత వంటివే ఇక్కడ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఇంట్లో, ఆఫీసులో పరాయి వ్యక్తులతో అతిచనువు ప్రదర్శిస్తే నలుగురూ ఏమనుకుంటారోనన్న బిడియం, భయానికి ఆస్కారం లేకపోవడమూ మరో వెసులుబాటు.

ఆన్‌లైన్‌లో మాటల హద్దుమీరినా, భావాలు పోటె త్తినా పట్టించుకునేవారు లేరు. ఇక ఎవరికి తెలిసే అవకాశం లేకపోవడం ఒక కారణం .  ఈ ఆన్‌లైన్‌ స్నేహాలు… సెల్ ఫోన్ పరిచయాలు …మిస్డ్ కాల్ పరిచయాలు హద్దులు దాటడానికి దారితీస్తున్నాయి. 

వీటిల్లో  చిక్కుకునే   ప్రతి పదిమందిలో ఐదుగురు ఆ సంబంధాలను ఎఫైర్‌గా మార్చుకుంటున్నారు.కొత్త సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు.పెళ్లి అయిన పురుషులు,మహిళలు కాపురాల్లో నిప్పులు పోసుకుంటున్నారు ..పెళ్లి కాని యువతీ యువకులు  అశాంతికి  లోనై భవిష్యత్ ను అంధకారం చేసుకుంటున్నారు.విదేశాల్లో విశృంఖలంగా ఉన్న ఈ సంస్కృతి మనకూ అంటుకుంది.

పెరిగిన కమ్యూనికేషన్ దీనికి దోహద పడింది. ఇప్పుడు సెల్ ఫోన్ లు లేని ఊళ్ళే లేవు ..అత్యాధునిక స్మార్ట్  ఫోన్ లు అందుబాటులో కొచ్చాక మనుషులు ఏకాంతాన్ని ఎక్కువగా కోరు కుంటున్నారు.ఏకాంతంలో చాటింగ్,ఫోన్ లో కబుర్లు,గర్ల్ ,బాయ్ ఫ్రెండ్స్ తో మాటలు అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకుంటున్నారు.ఇక డబ్బు సంగతి సరే సరి.

ఈ క్రమంలో పరిచయాలను,స్నేహాలును తరచూ కలుసుకునే ఓ బంధంగా మార్చుకోవాలని కోరుకునే వారు కోకొల్లలు. కుటుంబ పరంగా, సామాజికంగా ఉన్న అనేక భయాలు వారిని వెనక్కు లాగుతున్నాయి. అలాగని ఆ వలలో పడకుండా దూరంగా ఉంటున్నారా అంటే లేదు. ఆన్‌లైన్‌ కబుర్లు, ఫోనులో కవ్వింతలతో  కాలక్షేపం చేసే యువతీయువకుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది.

వివాహితులూ ఇందుకు మినహాయింపు కాదు. స్నేహితులను ప్రత్యక్షంగా కలుసుకుని  థ్రిల్‌ని ఎంజాయ్ చేసే వారి సంఖ్య అధికమవుతోంది. ‘శారీరక సంబంధాల’ దాకా వెళ్తున్న సంఘటనలు కూడా పెరుగుతున్నాయి.ఈ ఉచ్చు లో చిక్కి  మోసపోయే వారున్నారు.మోసం చేసే వారు వున్నారు.

ఆన్‌లైన్‌/ఫోన్  స్నేహంలో ఒకస్థాయి దాటి  పలకరింత..పులకరింతలు … కవ్వింతలలో  తేలియాడే వారికి ఇరవై నాలుగ్గంటలు సెల్ ఫోన్ /కంప్యూటరే లోకం. ఎప్పుడు చాట్‌ చేస్తుంటారు. ముసిముసిగా నవ్వుతుంటారు. కలల లోకంలో విహరిస్తుంటారు . అర్థరాత్రి అయినా సెల్ ఫోన్ వదలరు. ఫోన్ వస్తే పక్కకు వెళతారు.

అందరిముందు ఫోన్ మాట్లాడరు….  కుటుంబ సభ్యులు, జీవిత భాగస్వామితో కలివిడిగా ఉండరు. సాధారణంగా పంచుకొనే అభిప్రాయాలు సైతం పంచుకోరు. వారి ఫాంటసీలకు తగినట్టు లైఫ్‌ పార్ట్‌నర్‌ ఉండాలనుకుంటూ నువు్ ఫలానా వారిలా ఉంటే బావుండేది అంటుంటారు. పెళ్లయిన వారిలో లైంగికాసక్తి లోపించడమూ కనిపిస్తుంటుంది.

ఈ నయా స్నేహం ఓ భ్రమ అని తేలిపోయినా, ఆ బంధం చెదిరిపోయినా తట్టుకోలేరు.   అదే సమయంలో  కుటుంబ అనుబంధాల్లో కలతలు రేగి భాగస్వామికి మానసికంగా దూరమౌతారు.. కొందరు  ‘వృత్తిగతంగా వెనకపడతారు ..మరికొందరు ఉపాధిని కూడా దెబ్బ తీసు కుంటున్నారు.

ఏదో తెలియని ఆందోళనకు గురవుతూ ఇతర వ్యసనాలకు లోనవు తున్నారు.  భాగస్వామిలో ఏ పొరబాటు లేక పోయినా అసంతృప్తితో విడాకులు కావాలనుకునే వారిలో ఈ నయా స్నేహాల పిచ్చి  ఎక్కువగా కనిపిస్తుంది.ఇలాంటి వారికి మానసిక చికిత్సలు అవసరం. ఈ స్నేహాలు,బంధాలు అశాశ్వతమని అందరూ గ్రహించాలి.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!