Goebbels’ ideal for many people………………………..
గోబెల్స్ ప్రచారం…… ఈ మాట తరచుగా రాజకీయాల్లో మనకు వినబడుతుంటుంది. అసత్యాలు చెప్పడం,లేని దాన్ని ఉన్నదానిగా చూపించడం గోబెల్స్ ప్రచారం అంటారు .హిట్లర్ అనే నియంతను దేవుడిగా ప్రచారం చేయడానికి ‘గోబెల్స్’ఎంతో కష్టపడ్డాడు.
అదేరీతిలో ఉన్నవీ లేనివీ కల్పించి, అభూత కల్పనలను జోడించి… పాలకులు మహానుభావులంటూ వక్ర ప్రకటనలతో ప్రజల మెదళ్లకు తుప్పు ఎక్కించే ప్రచార ప్రయత్నాలకు ‘గోబెల్స్ ప్రచారం’ అనే పేరు మాత్రం స్థిరపడిపోయింది.
ఒక వాదనని సృష్టించడంలోనూ,దానిని ప్రచారం చేయడం లోను దానికి ఒక గొప్పదనం కల్పించడంలో ‘గోబెల్స్’ ప్రతిభా వంతుడు.నలుపుని తెలుపని చెప్పగలడు. మేకను గొర్రెగా… గొర్రెను గోవుగా తన ప్రచారంతో మార్చేయగలడు. తన ప్రచార విధానాలతో నమ్మించ గలడు.
”ఒక చిన్న అబద్దం కంటే పెద్ద అబద్ధానికి విశ్వసనీయత ఉంటుంది ”అన్న హిట్లర్ సూక్తిని గోబెల్స్ అమలుపరిచాడు. ‘ మనం రాజ నీతిజ్ఞుడిగా నైనా బతికి చావాలి,లేదా ఓ దుర్మార్గుడిగా నైనా చచ్చి బతకాలి.కానీ చరిత్ర మనల్ని మరచి పోకూడదు ” అని గోబెల్స్ అన్నట్టుగా చరిత్ర చెబుతోంది.
ఇంతకీ ఏవరీ గోబెల్స్ ?? వివరాల్లోకెళ్లి చూస్తే …
పౌల్ జోసెఫ్ గోబెల్స్ 1897లో జర్మనీ లోని బెర్లిన్ లో జన్మించాడు.బాల్యంలో పోలియో వచ్చింది. మనిషి సన్నగా పొట్టిగా ఉండే వాడు.అంగ వైకల్యంతో, ఆత్మ న్యూనతా భావంతో సమాజంపై ద్వేషం పెంచు కున్నాడు.అయితే చదువులో మాత్రం ముందుండేవాడు.హేడెల్ బర్గ్ నుంచి ఫిలాసఫీ లో పట్టా పుచ్చుకున్నాడు.తన నెగటివ్ ఆలోచనలతో ఎదుటి వారిని క్రమంగా ప్రభావితం చేయడంలో దిట్ట.
మొదటి ప్రపంచ యుద్ధంలో చేరడానికి వెళ్తే సైనిక అధికారులు అతగాడిని ఎగతాళి చేశారు.దీంతో అతనిలో ఒక రకమైన కసి పెరిగింది. అధినేతలకు,అధికారులకు నచ్చే విధంగా మాటలు చెప్పి వారికి దగ్గరయ్యాడు.ఉత్తర జర్మనీ పార్క్ ఉన్నత నాయకుడు గ్రెగర్ స్ట్రాసార్ కింద కోశాధికారిగా పని చేసి మన్నన పొందాడు.తరువాత హిట్లరు వద్దకు చేరి ఆయన అభిమానాన్ని సంపాదించాడు .
పార్టీని బలోపేతం చేయడంలో, హిట్లరుకు మద్దతు కూడగట్టటంలో విజయం సాధించాడు. గోబెల్స్ ప్రతిభను గమనించిన హిట్లర్ మొత్తం జర్మనీకి ప్రచార వ్యవ హారాలు చూసే బాధ్యత అప్పగించాడు.గోబెల్స్ నాజీల పార్టీలకు చెందిన పత్రికలకు సంపాదకుడిగా పని చేశాడు.హిట్లర్ ఒక్కడే వామపక్ష వాదుల నుండి,యూదుల నుండి సమస్యల నుండి గట్టెక్కించగల అవతార పురుషుడన్నాడు.
హిట్లర్ 1933లో ప్రచార శాఖకు గోబెల్స్ ను మంత్రిగా చేశాడు.గోబెల్స్ తన ఆధీనంలోకి వచ్చిన పత్రికలు,రేడియో, నాటక రంగం,సినిమాలు,సాహిత్యం,సంగీతం,లలిత కళలు అన్నిమాధ్యమాలను గరిష్ట స్థాయిలో వాడుకుని అసత్య ప్రచారంతో హిట్లరును అవతార పురుషునిగా చేశాడు.
సోవియట్ సైన్యాలు జర్మనీలోకి చొచ్చుకొని వచ్చే వరకు తన వాగాడంబరతతో మోసగించి ప్రజల్ని పక్కదోవ పట్టించాడు.చివరికి 1945 ఏప్రిల్ 20న తన ఆరుగురు పిల్లలకు విషమిచ్చి చంపేశాడు తరువాత భార్యాభర్తలు పరస్పరం కాల్చుకుని మరణించారు. గోబెల్స్ మరణం పై కూడా పలు ప్రచారాలున్నాయి.
మొత్తానికి గోబెల్స్ తాను అనుకున్నట్టుగానే చరిత్ర కెక్కాడు. ఇపుడు ఆ గోబెల్స్ ను ఆదర్శంగా తీసుకుని పలు పత్రికలు, వ్యక్తులు గిట్టని వారిపై వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు.
———–KNM