ఇరవై ఏళ్ళక్రితం కార్యకర్త…ఇపుడేమో పార్టీ ప్రెసిడెంట్ !!

Sharing is Caring...

 Entering a key position at a young age……………..

బీహార్ రాష్ట్రానికి చెందిన నాయకుడు నితిన్ నబీన్ జనవరి 20, 2026న భారతీయ జనతా పార్టీ (BJP) నూతన జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.45 ఏళ్ల వయస్సులో నితిన్ నబీన్ పార్టీ పగ్గాలు చేపట్టడం విశేషం. బీజేపీ చరిత్రలోనే అత్యంత తక్కువ వయస్సు గల జాతీయ అధ్యక్షుడిగా ఆయన రికార్డు సృష్టించారు. 

నితిన్ నబీన్  సీనియర్ బీజేపీ నాయకుడు,నాలుగు సార్లు ఎమ్మెల్యేగా చేసిన నవీన్ కిషోర్ సిన్హా కుమారుడు. 2006లో తండ్రి మరణం తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఏబీవీపీ (ABVP) కార్యకర్తగా ప్రస్థానాన్ని ప్రారంభించి, భారతీయ జనతా యువ మోర్చా (BJYM) జాతీయ ప్రధాన కార్యదర్శిగా, బీహార్ యువ మోర్చా అధ్యక్షుడిగా పనిచేశారు.

పాట్నాలోని బంకీపూర్ నియోజకవర్గం నుండి వరుసగా ఐదు సార్లు (2006, 2010, 2015, 2020, 2025) ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరించి 2023లో బీజేపీ అక్కడ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. ఆయనలోని ఈ కేడర్ మేనేజ్‌మెంట్, సంస్థాగత నైపుణ్యాలే ఆయన జాతీయ అధ్యక్ష పదవికి ఎంపిక అయ్యేలా చేశాయి. 

జేపీ నడ్డా వారసుడిగా డిసెంబర్ 2025లో వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు.అనంతరం జనవరి 19, 2026న జరిగిన ఎన్నికల ప్రక్రియలో ఏకగ్రీవంగా జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈయన్ని పార్టీ విషయాల్లో తన “బాస్” (Boss) గా అభివర్ణిస్తూ, యువ నాయకత్వానికి పార్టీ ప్రాధాన్యత ఇస్తుందని చాటి చెప్పారు.

నితిన్ నబీన్ బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం వెనుక పార్టీ వ్యూహకర్తలు పక్కా ప్రణాళికతో వ్యవహరించారు.45 ఏళ్ల నితిన్ నబీన్ యువ ఓటర్లను ఆకర్షించడానికి పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపడానికి ప్రయత్నిస్తారని ఈ నిర్ణయం తీసుకున్నారు.

పశ్చిమ బెంగాల్‌లో ప్రభావవంతంగా ఉండే ‘కాయస్థ’ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఎంపిక చేయడం ద్వారా, 2026 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందాలని బీజేపీ భావిస్తోంది.ఈయన ఎంపిక ఆర్‌ఎస్ఎస్, మోదీ-షా ద్వయం ఉమ్మడి అభిప్రాయం ద్వారానే జరిగిందని విశ్లేషకులు భావిస్తున్నారు. నబీన్ తండ్రికి ఆర్‌ఎస్ఎస్‌తో ఉన్న బలమైన సంబంధాలు దీనికి తోడయ్యాయి.

నితిన్ నబీన్ ప్రధాని మోదీకి అత్యంత నమ్మకస్తుడైన నాయకుడు. ఆయన ఎంపికను మోదీ నేరుగా బలపరిచారు.2026 అసెంబ్లీ ఎన్నికలు,2029 సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికే ఈ యువ నాయకుడిని బీజేపీ ఎంచుకుంది.  

నితిన్ నబీన్ పేరును ప్రతిపాదిస్తూ మొత్తం 37 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి.నామినేషన్ ప్రక్రియలో ప్రధాని మోదీ స్వయంగా మొదటి వరుసలో ఉండి నితిన్ నబీన్ పేరును ప్రతిపాదించారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, ధర్మేంద్ర ప్రధాన్, భూపేంద్ర యాదవ్ వంటి అగ్రనేతలు ఆయన పేరును బలపరుస్తూ నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు.

ప్రస్తుత కేంద్ర మంత్రి, మాజీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఈ ప్రతిపాదనలో భాగస్వాములయ్యారు. 36 రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు, పార్లమెంటరీ బోర్డు సభ్యులు కూడా నితిన్ నబీన్ అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించారు.
రిటర్నింగ్ అధికారి కె. లక్ష్మణ్ నేతృత్వంలో జరిగిన ఈ ఎన్నికల్లో వేరే ఎవరూ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో నితిన్ నబీన్ ఏకగ్రీవంగా (Unopposed) ఎన్నికైనట్లు ప్రకటించారు.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!