గువ్వల చెరువు పాలకోవా పేరు వింటేనే నోట్లో నీళ్లూరుతాయి. స్వీట్లు ఎన్ని ఉన్నా ఈ పాలకోవా రుచే వేరు. కమ్మని పాలకోవా తినాలంటే గువ్వల చెరువుకెళ్లాల్సిందే. ఇంతకూ ఎక్కడ ఉంది ఆ గువ్వల చెరువు. కడప జిల్లా రామాపురం మండలం లో ఉంది. ఈ పాలకోవా టేస్ట్ కేవలం కడప కే పరిమితం కాలేదు. అన్ని తెలుగు రాష్ట్రాలకు .. కొన్ని విదేశాలకు పాకింది.
గువ్వల చెరువు పాలకోవాకు ఘనమైన చరిత్ర ఉంది. వందేళ్ల పైబడే గువ్వలచెరువులో పాలకోవా తయారుఅవుతోంది. మొదటి సారిగా సిలార్ సాహెబ్ ఈ పాలకోవాను తయారుచేసాడట. తన ఇంటిదగ్గర అంగడి లోనే ఈ పాలకోవా అమ్మేవారు. ఆయన వ్యాపారం చూసి మరికొందరు అదే బాటలో పయనించారు.
అలా అలా వందల కుటుంబాలకు ఈ పాల కోవా వ్యాపారం ఉపాధిగా మారింది. రెండు ముద్దలు పెడుతుంది. కరువు సీమలో జనాలకు ఇదొక ఆధారంగా మారింది. దీంతో మెల్లమెల్లగా పాలకోవాకు కు ఒక గుర్తింపు కూడా వచ్చింది. పాలకోవా అంటేనే గువ్వలచెరువు … గువ్వల చెరువు అంటేనే పాలకోవా అనే స్థాయి కి ఆ వూరు ఎదిగిపోయింది.
నాణ్యతకు, మధురమైన పాల కోవా కు గువ్వల చెరువు బ్రాండ్ గా మారింది. పాల కోవ తయారీ కి అవసరమైన పాలు కూడా అక్కడి ప్రజలే సమకూర్చుకుంటున్నారు. పాడి పరిశ్రమ వృద్ధి కూడా జరుగుతోంది. గువ్వల చెరువులో దాదాపు 40 కుటుంబాలు పాలకోవాని తయారు చేస్తున్నాయి. పరోక్షం గా మరో 50-60 కుటుంబాలు ఈ వ్యాపారం పై ఆధారపడి బతుకుతున్నాయి.
రోజుకి రెండువేల కిలోల పాల కోవా అమ్ముతున్నారు. కిలో వంద రూపాయలు మాత్రమే. ఈ ఊరిలో గుండా హైవే ఉన్నకారణంగా బిజినెస్ వేగంగా జరుగుతుంది. ఒక్కోరోజు తయారైన సరుకు మొత్తం కూడా అమ్మేస్తారు. ఈ షాపుల వద్దకు వెళ్ళినపుడు ఓ చిన్న కప్పులో కోవా వేసి నాలుగు బాదాం పలుకులు చల్లి ఇస్తారు. టేస్ట్ నచ్చితేనే కొనుకోవచ్చు . లేదంటే కొనుక్కోకుండానే వెళ్ళవచ్చు. డబ్బులు అడగరు.
ఇక బంగారు వర్ణంలో మెరిసిపోయే గువ్వలచెరువు పాలకోవాని చాలా చోట్లకు ఎగుమతి చేస్తారు. ఇతర రాష్ట్రాలకు ఇక్కడి నుండి ఎగుమతి అవుతోంది. రాయలసీమ పల్లెల్లో, పట్టణాల్లో బండ్ల మీద అమ్మే పాలకోవా చాలా వరకు ఇక్కడ తయారయ్యేదే. కడప జిల్లా పోయినప్పుడు గువ్వల చెరువు పాలకోవాని మర్చిపోకండి.
రాయలసీమలో చాలా చోట్ల పాలకోవాని బన్ను, బ్రెడ్ తో కలిపి తింటారు. దాన్నే స్థానికులు కోవా బన్ను అని ముద్దుగా పిలుచుకుంటారు. పాల కోవాను ఎక్కువ తినడం కష్టం. అందుకే బ్రెడ్ లోపల ఈ పాలకోవని పెట్టి తింటారు. రాయలసీమ అంతటా ఈ కోవా బన్ను దొరుకుతుంది. రుచిలో కోవా బన్నుకు మించింది లేదు.
————– KSK.Theja