Natyam ………………………………….
నాట్యం … రెండు నెలల క్రితం థియేటర్లలో విడుదలైన సినిమా … ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. నాట్య ప్రధానమైన సినిమాలొచ్చి చాలా రోజులైంది. నాట్యం అనగానే ఆనందభైరవి (జంధ్యాల ) స్వర్ణకమలం, సాగర సంగమం,సప్తపది, సిరిసిరి మువ్వ (ఈ నాలుగు విశ్వనాథ్ తీసినవే) వంటి సినిమాలు గుర్తుకొస్తాయి.మయూరి కూడా ఆ కోవలోనిదే. అవన్నీ ప్రజల ఆదరణ పొందినవే.
చాన్నాళ్లకు నాట్యం కధాంశం గా వచ్చిన సినిమా అనేసరికి పై సినిమాలతో పోల్చి చూస్తారు ఎవరైనా. వాటితో పోల్చి చూస్తే మటుకు నాట్యం నిరాశ పరుస్తుంది. కథ అందంగా చెప్పడమే నాట్యం అని చివరలో ఒక టాగ్ లైన్ చూపిస్తారు. మధ్యలో డైలాగు ద్వారా చెప్పిస్తారు. కాన్సెప్ట్ బాగుంది.. కానీ కథ ఆసాంతం ఆకట్టుకునే విధంగా లేదు. కథ ..కథనంపై మరింత కసరత్తు జరిగి ఉంటే బాగుండేది. కథంతా హీరోయిన్ చుట్టూనే నడుస్తుంది..ఆ పాత్రనే హైలైట్ చేయడానికి ప్రయత్నించారు.
దర్శకుడు రేవంత్ కోరుకొండ కష్టపడ్డారు కానీ సినిమా అదిరిపోయే స్థాయిలో రూపొందలేదు. స్క్రిప్ట్ . కెమెరా .. దర్శకత్వం అన్ని బాధ్యతలు ఆయనే మోశారు. అది కూడా ఒక కారణం కావచ్చు. కెమెరా పని తనం బాగానే ఉంది. ఈ తరం జనరేషన్ ను ఆకట్టుకోవడానికి కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌ని జోడించినప్పటికీ ప్రేక్షకులను కట్టి పడేసే సీన్లు లేవు. కథలో స్కోప్ ఉన్నప్పటికీ భావోద్వేగ సన్నివేశాలు లేవు.
మొదటి భాగంలో కొన్ని సీన్స్ సాగ దీసారా అనిపిస్తుంది. హీరో హీరోయిన్ల ప్రేమను ఎలివేట్ చేసే బలమైన సన్నివేశాలు కూడా లేవు. కాదంబరి గురించి సస్పెన్స్ కొంతవరకు కథను నడిపిస్తుంది. రెండో భాగం లో కొంత ఎమోషనల్ టచ్ ఇచ్చాడు దర్శకుడు. సినిమా చివరి ఇరవై నిమిషాల సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయి. కథకు అనువైన లొకేషన్స్ ఎంపిక చేసుకున్నారు.
ప్రముఖ కూచిపూడి డ్యాన్సర్ సంధ్యారాజు ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తూ నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. సితార పాత్రకు ఆమె నూరు శాతం న్యాయం చేశారు. నాట్య సన్నివేశాలు అద్భుతంగా తెర కెక్కాయి. యాక్టింగ్ పరంగా కూడా బాగానే చేసిందని చెప్పుకోవచ్చు. భాను ప్రియ లాంటి నటిని కేవలం తల్లి పాత్రకే పరిమితం చేశారు. గురువు గా ఆదిత్య మీనన్ బాగానే చేసాడు. ఈ పాత్రపై మరింత ఫోకస్ పెడితే బాగుండేది.
మంచి నటులున్నారు కానీ వారికి చేయడానికేమి లేదు. గురువుగారి కుమారుడు..క్లాసికల్ డ్యాన్సర్ హరిగా కమల్ కామరాజు కరెక్ట్ గా సూట్ అయ్యాడు. హీరోగా రోహిత్ బాగా యాక్టీవ్ గా ఉన్నాడు. అతని డాన్స్ కూడా ఆకట్టుకుంటుంది. శుభలేఖ సుధాకర్ విలన్ షేడ్ ఉన్న ట్రస్టీ పాత్రను తనదైన శైలిలో చేసాడు.
శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అలరిస్తుంది. నేపథ్య సంగీతం కూడా బాగుంది. మాస్ మసాలా సినిమాలు చూసే వారికీ ఈ సినిమా నచ్చకపోవచ్చు. వెరైటీ కథలు .. కుటుంబ చిత్రాలు చూసే వాళ్లకు కొంతమేరకు నచ్చుతుంది. ప్రతి ఒక్కరు చూసాక పాత సినిమాలతో పోల్చుకుని అసంతృప్తికి లోనవుతారు.