నోలంబ శిల్ప శైలికి ప్రతీక…..హేమావతి !!

Sharing is Caring...

Sculptural art is beautiful………………………

మైనాస్వామి………………………………

అత్యద్భుత శిల్పకళకు ఆలవాలమైన ఆరు ఆలయాలు ఒక మారు మూల కేంద్రంలో వున్నాయి. ఆ సముదాయంలోకి వెళ్ళి ప్రత్యక్షంగా చూస్తే తప్ప ఆ గుడుల గొప్పదనం తెలియదు. భారతదేశంలో తొలి దశలో గుహలను తొలచి గుడులుగా తీర్చిదిద్దారు. సుమారు 1500 సంవత్సరాలకు పూర్వం ఒకే గదితో రాతి నిర్మాణంగా దేవాలయం రూపు దిద్దుకొన్నది. తర్వాత క్రీస్తుశకం 7వ, 8వ శతాబ్దాల్లో ఆలయాలు. అద్భుత కళా నిలయాలుగా తీర్చిదిద్దబడ్డాయి.

దక్షిణాదిలోను తొలి నాళ్ళలో చాళుక్యులు, పల్లవులు, గంగరాజులు, నోలంబ పల్లవ ప్రభువులు కోవెలలకు విశేష రూపాలను కల్పించారు. గర్భగుడి, అంతరాళం, ముఖ మండపం, మహా మండపం, ఉత్సవ మండపం, యాత్రికుల బసమండపాల నిర్మాణంతో గుడి సంపూర్ణ రూపాన్ని సంతరించుకొన్నది. గర్భగుడిలోని మూల విరాట్ లను ఎంతో సుందరంగా మలిపించడం, వివిధ మండపాల స్తంభాలను శిల్పాలతో అందంగా తీర్చిదిద్దడం వంటి వాటితో ఆలయాలు అత్యున్నత కళా కేంద్రాలయ్యాయి.

ఆదిలోనే అద్భుతాలకు ఆటపట్టుగా ‘హేమావతి గుడు’లను తీర్చిదిద్దిన ఘనత నోలంబ పల్లవ ప్రభువులదే. క్రీ.శ.8వ, 9వ శతాబ్దాలలోనే ఆలయ నిర్మాణాల్లో సరికొత్త పంథాలను అనుసరించి, తమ సొంత శైలికి శ్రీకారం చుట్టారు నోలంబులు. చోళులు సైతం నోలంబ శిల్ప శైలిని స్వీకరించారు. హేమావతిలోని శివ సన్నిధులు నోలంబశైలికి ప్రత్యక్ష నిదర్శనం. సిద్ధేశ్వర, నోలంబేశ్వర (దొడ్డేశ్వర), మల్లేశ్వర, విరుపాక్షేశ్వర, చిత్రేశ్వర, సోమేశ్వర దేవలాలు క్రీ.శ.8 మరియు 9 శతాబ్దాల్లో హేమావతిలో నిర్మితమయ్యాయి.

హేమావతి ప్రాచీన పేర్లు హెంజేరు, పెంజేరు. హెంజేరు రాజధానిగా నోలంబ పల్లవులు సుమారు 400 సంవత్సరాలు పాలించారు. దక్షిణ భారతావనిలో కొంత భాగంలో నోలంబ ప్రభువుల ముద్ర బలంగా వున్నా..వారి చరిత్రను అధ్యయనం చేయడంలో, వారు సాధించిన విజయాలను నమోదు చేయడంలో చరిత్రకారులు సరైన పాత్రను పోషించలేదు.

సంస్కృతం, తెలుగు, కన్నడ, తమిళ భాషలను, రాజ్యంలోని ప్రజలు పాటిస్తున్న సంస్కృతి-సంప్రదాయాలను పరిరక్షించడంలో నోలంబ రాజులు ముందు వరుసలో వున్నారని వారు రాయించిన శాసనాల్లో పేర్కొనడం జరిగింది. నోలంబులు కట్టించిన కోవెలలకు భూరి దానాలు, గుడుల నిర్వహణ, రాజవంశ వివరాలు తదితర అంశాలు శాసనాల్లో వున్నాయి. హెంజేరు నుంచి ఆనెగొంది (హంపి), మరోవైపు ధర్మపురి (తమిళనాడు) దాకా నోలంబ పల్లవుల శాసనాలు కనిపిస్తాయి.

హేమావతి పరిసరాల్లో శివ లింగాలు విశేషంగా కనిపిస్తాయి. ఆలయాల్లో మాత్రమే కాకుండా ఆరుబయలులోనూ శివలింగాల దర్శనం కలుగుతుంది. నోలంబవాడి రాజ్య రాజధానీ కేంద్రం – హెంజేరులో పెద్ద గుడులు 6 వుండగా, అందులో 5 శివలింగాలున్నాయి. ప్రధాన దేవాలయమైన సిద్ధేశ్వర సన్నిధిలో శివుడు సిద్ధుని రూపంలో భక్తులకు అభయమిస్తున్నాడు.

మిగతా ఐదుచోట్లు లింగరూపంలో ముక్కంటి భక్తులను బ్రోస్తున్నాడు. ఐదు లింగాలతో అలరారుతున్నందున హేమావతి పంచలింగ క్షేత్రం అయింది. సిద్ధేశ్వర స్వామి, పంచలింగాల దర్శనం, ఆలయాల్లోని శిల్పశోభ, పురావస్తు ప్రదర్శనశాలలోని శిల్ప సంపద యాత్రికులను భక్తి – సాంస్కృతిక సాగరంలో ముంచెత్తుతాయి. హేమావతి ఆంధ్రప్రదేశ్ లోని మడకశిరకు 36 కి.మీ. దూరంలో వుంది.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!