U turn Cm ………………..
ఆయన ఎమ్మెల్యే గా గెలవకుండానే 9 సార్లు ముఖ్యమంత్రి పీఠాన్నిఅధిష్టించి రికార్డు సృష్టించారు. ఇపుడు జరుగుతున్న ఎన్నికల్లో పార్టీ మళ్ళీ గెలిస్తే 10 వ సారి కూడా సీఎం గా ప్రమాణ స్వీకారం చేయవచ్చు. ఆయన ఎవరో కాదు బీహార్ సీఎం నితీష్ కుమార్. ఇదెలా సాధ్యం ? వినడానికి చిత్రంగా ఉందంటారా ? అవును ఇది నిజమే.
సీఎం అయ్యాక నితీష్ ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా గెలవలేదు. శాసన మండలి నుంచి ఎన్నికవుతూ సీఎం కుర్చీని ఇప్పటివరకు కాపాడుకుంటూ వచ్చారు. నితీష్ కుమార్ హర్నాట్ అసెంబ్లీ స్థానం నుండి నాలుగు సార్లు పోటీ చేశారు. ఆయన 1977లో జనతా పార్టీ సభ్యుడిగా ఓడిపోయారు, 1980లో చరణ్ సింగ్ జనతా పార్టీ (సెక్యులర్) సభ్యుడిగా ఓడిపోయారు, ఆ పార్టీ తరువాత లోక్ దళ్ గా పేరు మార్చుకుంది, 1985లో లోక్ దళ్ సభ్యుడిగా గెలిచారు, 1990లో పోటీ చేయలేదు… 1995లో సమతా పార్టీ సభ్యుడిగా గెలిచారు.
1989 లో లోక సభకు ఎన్నికయ్యారు. వరుసగా అయిదు సార్లు ఎంపీగా గెలిచారు. మంత్రి పదవులు కూడా చేపట్టారు. ఆ తర్వాత ఏ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు.అందుకే కాబోలు విపక్ష నేతలు ఆయనను పదే పదే ఎద్దేవా చేస్తుంటారు. ధైర్యముంటే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని సవాళ్లు విసురుతుంటారు. అయితే నితీష్ వాటిని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతుంటారు.
2004 తర్వాత ఏ ప్రత్యక్ష ఎన్నికల్లోనూ నితీష్ పోటీ చేయలేదు. ఎమ్మెల్సీ అయిపోయి దర్జాగా సీఎం కుర్చీలో కూర్చుంటున్నాడు.ఇలా అసెంబ్లీ కి పోటీ చేయకుండానే ఇన్ని సార్లు సీఎం అయిన ఖ్యాతి నితీష్ కే దక్కుతుంది. కాగా నితీష్ మొదటి సారి సీఎం అయింది 2000 సంవత్సరంలో. అప్పటికి నితీష్ బీహార్ లోని ఏ సభలోను సభ్యుడు కాదు.
అయితే అసెంబ్లీ లో తగు బలం లేక కేవలం 7 రోజులకే సీఎం పదవికి రాజీనామా చేశారు. 2005 లో జరిగిన ఎన్నికల్లో బీజేపీతో కలసి బీహార్ సీఎం అయ్యారు. అప్పటి నుంచి వరుసగా సీఎం అయ్యారు. వరుసగా సీఎం అయినప్పటికీ ఎక్కడా పోటీ చేయలేదు. ఇది కూడా ఒక రికార్డు అని చెప్పుకోవచ్చు.ఇక శాసనమండలికి వరుసగా ఎంపిక అవుతూ నెట్టుకొస్తున్నారు.
విపక్షాల సవాళ్లకు జవాబు చెబుతూ తాను ఏదో ఒక నియోజక వర్గానికి పరిమితం కాదల్చుకోలేదని… అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని చాలామార్లు స్పష్టం చేశారు. సీఎం అవ్వాలంటే ఎమ్మెల్యే అయిఉండాలి అనే నిబంధన ఉన్నట్టయితే నితీష్ పప్పులు ఉడికేవి కావు.
నితీష్ పాలనా కాలమంతా కొన్నేళ్లు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో మరి కొన్నేళ్లు ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘట్‌బంధన్‌లో కొనసాగింది. ఈ క్రమంలోనే ఆయన ను ‘యూ’టర్న్‌ల ముఖ్యమంత్రి అంటారు. ప్రస్తుతం నితీష్ కుమార్ వయస్సు 74 ఏళ్ళు.
ప్రభుత్వంపై పెరిగిన ప్రజా వ్యతిరేకత నేపథ్యంలో ఇప్పుడు జరిగేవే ఆయనకు చివరి ఎన్నికలు కావచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజావ్యతిరేకతను ఎదుర్కొనేందుకు నితీశ్ ప్రభుత్వం ఇటీవల మహిళలకు, యువతకు నేరుగా నగదు బదిలీ పథకాన్ని అమలు చేసింది.దీని ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి.
ఎన్నికల సర్వేలలో 42 శాతం మంది నితీష్ పట్ల మొగ్గు చూపారు. జేడీయూ పార్టీ 2010లో 115 సీట్లు గెలుచుకోగా, 2015 నాటికి ఆ సంఖ్య 71 సీట్లకు తగ్గింది. ఇక 2020లో కేవలం 43 సీట్లు మాత్రమే గెలిచింది. బీజేపీ 2010లో 91 సీట్లు , 2015 లో 53 సీట్లు , 2020 లో 74 సీట్లు గెలిచింది. నితీష్ పార్టీ కంటే బీజేపీ యే బలంగా ఉందని చెప్పుకోవాలి. ఈ ఎన్నికల్లో బలాబలాలు పెరుగుతాయో తగ్గుతాయో చూడాలి.
9 సార్లు ప్రమాణ స్వీకారం…………
మార్చి 3, 2000: ఏడు రోజుల పాటు ముఖ్యమంత్రిగా మొదటి ప్రమాణ స్వీకారం…..నవంబర్ 24, 2005: నితీష్ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం….నవంబర్ 26, 2010: బిజెపితో పొత్తులో మూడోసారి ప్రమాణ స్వీకారం.
ఫిబ్రవరి 22, 2015: జితన్ రామ్ మాంఝీ ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగిన తర్వాత, నితీష్ నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతకు ముందు 2014 లోక్‌సభ ఎన్నిక ల్లో పేలవమైన పనితీరు కి నైతిక బాధ్యత వహించి నితీష్ CM పదవికి రాజీనామా చేశారు.
నవంబర్ 20, 2015: మహాఘట్బంధన్ మెగా విజయం తర్వాత 5వ సారి ప్రమాణ స్వీకారం
జూలై 27, 2017: మహా కూటమిని విడిచి NDAతో తిరిగి కలిసిన తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.. సుశీల్ మోడీని డిప్యూటీగా నియమించారు.
నవంబర్ 16, 2020: బిజెపి మద్దతుతో నితీష్ 7వసారి ప్రమాణ స్వీకారం చేశారు
ఆగస్టు 10, 2022: ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బిజెపితో తెగతెంపులు చేసుకున్నారు..ఆర్జేడీ మద్దతుతో ఎనిమిదోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు, తేజస్వి డిప్యూటీగా బాధ్యతలు చేపట్టారు.
జనవరి 28, 2024 RJD తో మరోసారి సంబంధాలు తెగిపోయాయి…NDA తో చేతులు కలిపారు…. జనవరి 28, 2024న నితీష్ కుమార్ CMగా ప్రమాణ స్వీకారం చేశారు. సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హా ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

