నిమ్మగడ్డ దూకుడు !

Sharing is Caring...

ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ దూకుడు పెంచారు.  ఎన్నికలు నిర్వహించవచ్చుఅని హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం…సుప్రీం కోర్టు ఏపీ సర్కార్ దాఖలు చేసిన పిటీషన్ తప్పుల తడకగా ఉందని తేల్చి చెప్పన నేపథ్యంలో నిమ్మగడ్డ జోరు పెంచారు. ఈ క్రమంలోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తూనే కొందరు అధికారులపై ఆయన వేటు వేసారు.  9 మంది అధికారులను ఎన్నికల విధుల నుంచి ఎస్ఈసీ తొలగించారు. గుంటూరు, చిత్తూరు కలెక్టర్లను బదిలీ చేస్తూ నిమ్మగడ్డ  ప్రొసీడింగ్స్ జారీ చేశారు. తిరుపతి అర్బన్ ఎస్పీ, పలమనేరు, శ్రీకాళహస్తి డీఎస్పీలను కూడా ఆయన తొలగించారు.అంతేకాకుండా మాచర్ల, పుంగనూరు, రాయదుర్గం, తాడిపత్రి సీఐలను తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తొలగించిన అధికారుల స్థానంలో కొత్త అధికారుల పేర్లు పంపాలని సీఎస్‌కు  నిమ్మగడ్డ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే నిమ్మగడ్డ ఇద్దరు అధికారులపై వేటు వేసిన విషయం తెల్సిందే.

ఎన్నికల నోటిఫికేషన్ శనివారం ఇవ్వనున్నక్రమంలో  ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ అధికారులతో వరస భేటీలు అవుతున్నారు. ఇవాళ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తోకూడా ఆయన  భేటీ అయ్యారు. ఆ తర్వాత పంచాయతీరాజ్ అధికారులతో  నిమ్మగడ్డ సమావేశం కావాల్సి ఉంది. ఇదిలా ఉంటే  స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలని ఎన్నికల కమిషన్‌కు ఏపీ సర్కార్ విజ్ఞప్తి చేయనున్నట్టు తెలుస్తోంది.

కాగా ఏపీ స్థానిక ఎన్నికలపై దాఖలైన హౌస్ మోషన్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. సుప్రీంకోర్టులో ఏపీ సర్కార్, ఉద్యోగ సంఘాలు హౌస్ మోషన్ దాఖలు చేశాయి. అయితే ఈ పిటిషన్‌ను సోమవారం విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు పేర్కొంది. కాబట్టి సోమవారం వరకు ఎన్నికల నోటిఫికేషన్‌ను వాయిదా వేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ప్రభుత్వం కోరనున్నట్టు సమాచారం.  కాసేపట్లో ఎస్ఈసీ నిమ్మగడ్డ ‌ను సీఎస్ ఆదిత్యనాథ్, పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కలవబోతున్నారని సమాచారం. ఈ భేటీకి నిమ్మగడ్డ సుముఖంగా ఉన్నారో  లేదో తెలీదు. ఏపీ సర్కార్ విజ్ఞప్తిని నిమ్మగడ్డ తోసిపుచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

మొత్తం మీద పరిస్థితులు జగన్ సర్కార్ కు అనుకూలంగా లేవు. ఇప్పటివరకు ఉన్న పరిస్థితులను బట్టి  ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నోటిఫికేషన్ జారీ అయితే  వచ్చే నెల 5, 9, 13, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి. మరోవైపు సీఎస్‌ ఆథిత్యనాద్‌ను ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగ సంఘాలు కలిసాయి.  పంచాయతీ ఎన్నికల నిర్వహణ వాయిదా వేయాలంటూ 9 పేజీల లేఖను సీఎస్‌కు ఉద్యోగ సంఘాల నేతలు ఇచ్చారు. ఎన్నికల విధుల్లో పాల్గొనలేమని సీఎస్‌కు ఉద్యోగ సంఘాలు తెలిపాయి. ఉద్యోగులకు వ్యాక్సిన్‌ వేసేంత వరకు ఎన్నికల విధుల్లో పాల్గొనలేమని తేల్చి చెప్పారు. సీఎస్ ఈ విషయాన్ని నిమ్మగడ్డ దృష్టికి తీసుకెళ్లనున్నారు. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!