‘ముంబై’ లో రాత్రివేళ రంగుల లోకం!!

Sharing is Caring...

Mohammed Rafee ………………

నాలుగు రోజులుగా ముంబయి థానే వెస్ట్ లో వున్నాను. మన హైదరాబాద్ మోడల్ సానియా సింగ్ ఎప్పటి నుంచో ముంబయి లో ఉండి అవకాశాలు వెతుక్కుంటున్నారు. తన ఆహ్వానం మేరకు వీకెండ్ లో మిత్రుడు ఆల్విన్ జార్జ్ తో కలసి అంథేరి లోని ఒక డ్యాన్స్ బార్ కు వెళ్ళాను. మతిబోయింది నాకు!

అక్కడ గుంపుగా వున్న డ్యాన్సర్స్ లో తను నిలబడి ఉన్నారు! ఆశ్చర్యపోయాను. చాలా కాలం తరువాత కలుస్తున్నాం పార్టీ ఇస్తుందేమో అనుకున్నాను. కానీ, తన రియల్ లైఫ్ ను చూపించేందుకు నన్ను బార్ కు ఆహ్వానించింది సానియా సింగ్!

ముంబై డ్యాన్స్ బార్ నైట్ లైఫ్ గురించి ప్రత్యేకంగా నేను చెప్పక్కరలేదు! ఇక్కడ రాత్రి పది గంటలకు తలుపులు తెరుచుకుంటాయి. తెల్లారు ఝామున మూడు గంటల వరకు నడుస్తుంటాయి! కొన్ని సీక్రెట్ డ్యాన్స్ బార్స్ తెల్లారి ఆరు గంటల వరకు కొనసాగుతుంటాయట.

నేను వెళ్లిన రెట్రో బార్ లో కస్టమర్ల కన్నా డ్యాన్సర్స్, సెక్యూరిటీ సిబ్బంది, బార్ టెండర్స్ సంఖ్య ఎక్కువగా వుంది! మరి ఎలా గిట్టుబాటు అవుతుందో ఏమిటో అని నేను అడిగితే, ఒకరి బిల్ తెప్పించి చూపించింది! ఇంకా మతిబోయింది! ఒక టేబుల్ బిల్ 16 వేలు! అది లీస్ట్ బిల్ అని సానియా వివరించారు.

నాకు మందు అలవాటు లేదు. కూల్ డ్రింక్ తీసుకుందామనుకుంటుండగా టీ వచ్చింది నా ముందుకు! ఓహ్ బార్ లో టీ! నేనింకా ఆశ్చర్యపోయాను! కేవలం టీ తాగి కనువిందు చేసుకుని వెళుతుంటారట చాలామంది ! మన కేఫ్ లో 20 రూపాయలకు దొరికే టీ అక్కడ 1200 రూపాయలు! టీ తో పాటు ఐదారు కప్పులు మురుకులు, జీడిపప్పు, పల్లీలు, క్యారెట్ ముక్కలు, ఖీరా చక్రాలు ఇలా చాలా నా టేబుల్ పైకి వచ్చేసాయి!

బిర్యానీలు,వేరే స్టార్టర్స్ ఇంకేమి దొరకవు అక్కడ! అలాంటివి తినడానికి రారు అక్కడ! కేవలం మందు, శాంపిల్ మంచింగ్ మాత్రమే ఎక్కువ మంది ఇష్టపడుతుంటారు! ఇక ఎదురుగా చిన్న వేదిక! డిజె సిస్టం, పాడుతున్నట్లు నటించే ఒక మేల్ సింగర్, ఇద్దరు ఫిమేల్ సింగర్స్ ఉంటారు. వారు డిజె ప్లే చేసే పాటలకు జస్ట్ స్పీకర్ మైక్ పట్టుకుని నిజ్జంగా వాళ్లే పాడుతున్నట్లు అనుకరిస్తుంటారు. 

వాళ్ళు పాడరని తెలిసినా వారు అలా స్టేజ్ మీద కనిపిస్తే కొందరికి అదో కిక్ అని జార్జ్ చెప్పాడు! ఇక 15 మందికి పైగా అందమైన అమ్మాయిలు అద్దిరిపోయే డ్రెస్సులలో మిలమిల మెరుస్తూ ఎదురుగా నిలబడి చూపులతో చంపేస్తుంటారు! నవ్వులతో ఆకర్షిస్తుంటారు! కోరితే ఐటమ్ సాంగ్స్ కు ఎదురుగా డ్యాన్స్ చేస్తున్నారు. డబ్బుల నోట్లు వారి పైకి టపటపా విసిరేస్తూ ఆనందం పొందుతుంటారు మందు బాబులు!

ఇదొక దందా! ఇదొక రాత్రి వేళ నడిచే మాఫియా! ఈ మాటున అక్కడే పెద్ద ఎత్తున వ్యాపారాలు జరుగుతుంటాయి! బిజినెస్ పార్టనర్స్ ను, ఫైనాన్స్ పార్టనర్స్ ను మచ్చిక చేసుకునే బిస్కెట్ పార్టీలు ఈ బార్స్! 2005లోనే మహారాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. అయినా 2011 వరకు స్టే తెచ్చుకుని నడిపించారు. మళ్ళీ తీవ్ర నిషేధం పెట్టింది. సుప్రీం కోర్టు కు వెళ్లి అనుమతి తెచ్చుకున్నారు.

అయినా మహారాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. దాంతో బలం లేని ఓనర్లు మూసేసి రెస్టారెంట్ లుగా మార్చుకున్నారు. ఇప్పటికీ డ్యాన్స్ బార్లు చాలానే ఉన్నాయి. ప్రతి బార్ వెనుక ఒక బలమైన అధికార పార్టీ నేత ఎవరో ఒకరు అండగా ఉంటారు. సానియా ఒక మోడల్ అయి, బాలీవుడ్ లో అదృష్టం పరీక్షించుకునేందుకు వచ్చి ఇలా బార్ డ్యాన్సర్ అయిపోయింది!

ఇదేంటి సానియా అన్నాను! ఆమె కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగాయి! ఎన్నో ఆశలతో వచ్చాను, ఓడిపోయాను అని ఆవేదన వ్యక్తం చేసింది. ముంబయి మహా సామ్రాజ్యంలో బతకాలంటే ఏదొకటి మనసు చంపుకుని చేయాల్సిందే అంటూ పెదవి విరిచింది!

బార్ డ్యాన్సర్స్ ను చిన్న చూపు చూస్తుంటారు కానీ, నిజానికి వాళ్ళు నిజాయితీగా ధైర్యంగా తమ ప్రతిభను ప్రదర్శించి సంపాదించుకుంటున్నారు! ఏ కొద్ది బార్స్ లో సెక్స్ వ్యాపారం నడుస్తుందేమో కానీ, చాలా బార్స్ లో ఎంతో గౌరవంగా చూసుకుంటారు! పూర్తి సెక్యూరిటీ కల్పిస్తారు. ఎవ్వరు ఎంత మత్తులో వున్నా ఏ డ్యాన్సర్ ను టచ్ చేయనివ్వరు!ఎదురుగా కళ్ళ ముందు చూసి ఆనందించాలే తప్ప వారితో మాట్లాడటానికి కూడా అనుమతి ఇవ్వరు.

ఫోటోలు తీసుకోవడానికి కూడా అనుమతి ఉండదు! వారు మామూలు డ్రెస్సుల్లో బార్ లోకి ప్రవేశిస్తారు. అక్కడికొచ్చాక మేకప్ చేసుకుని మెరిసే మోడల్ దుస్తులు ధరించి బార్ లో నిలబడి స్టయిల్ గా పోజులిస్తూ, చూపులతో రెచ్చ గొడుతూ, నవ్వుతూ నవ్విస్తూ సైగలు చేస్తూ, కోరినప్పుడు డ్యాన్స్ చేస్తుంటారు!

అదే వారి జాబ్! “ఇందులో చేయడానికి మొదట తప్పు గా ఫీల్ అయ్యాను. కానీ, ఎంతో సేఫ్టీ సెక్యూరిటీ తో ఆదాయం వున్న జాబ్” అని సానియా చెప్పింది! కొంతమందికి నెలవారీ జీతం, కొంతమంది డైలీ పేమెంట్స్ తో పని చేస్తుంటారు.

నెల జీతం 60 వేల నుంచి రెండు లక్షలు వరకు తీసుకునే మోడల్స్ ఉన్నారు. రోజువారీ రెండు వేల నుంచి 20 వేల వరకు కొందరికి ఇస్తున్నారు. మళ్ళీ వారికి ట్రాన్స్ పోర్ట్, ఫుడ్, తాగే అలవాటు వున్న వారికి రెండు పెగ్ లు ఫ్రీ కూడా అని సానియా వివరించింది. డ్యాన్సర్స్ కు లభించే టిప్స్ అన్ని ఏ రోజుకు ఆరోజు ఫిఫ్టీ ఫిఫ్టీ కాన్సెప్ట్ తో అందరూ పంచుకుంటారు.

బార్ ఓనర్ కు టిప్స్ లో 50 శాతం వెళుతుంది. మిగిలిన 50 శాతం డ్యాన్సర్స్ అందరూ పంచుకుంటారు. ఒక్కో రాత్రి టిప్స్ రూపంలో లక్ష నుంచి పది లక్షల వరకు వస్తుంటాయని, వాటిలో పంచుకుంటే పెద్ద మొత్తమే వస్తుంటుందని ఆమె వివరించారు.

ముంబయి నైట్ లైఫ్ గురించి ఆమె చెబుతుంటే, నేను వింటుంటే ఆశ్చర్యపోవడం నా వంతు! ఎంత సంపాదిస్తున్నారు జనం? వినోదానికి ఎంత ఖర్చు పెడుతున్నారు? ఎంతమంది నైట్ లైఫ్ లో ఉపాథి పొందుతున్నారు! కనిపించని వ్యాపార సామ్రాజ్యం వేళ్ళూనుకుని విస్తరించింది ముంబయి మహా నగరం!

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!