చురకలేయడం ఈజీ..ఉరకలేస్తూ వార్తలు చదవడమే.,

Sharing is Caring...
ఈ యాంకర్ బాగా చదివారు. ఆ యాంకర్ వేస్ట్. ఆ అమ్మాయి సూపర్. ఈవిడ వేస్ట్. వారు చదివితే ఎంత బాగుుంటుందో. అతగాడు అన్నీ తప్పులే చెబుతాడు. ఆవిడ డ్రెస్సింగ్ సెన్స్ బాగుంటుంది. ఆవిడ మరీ లావుగా ఉంటుంది. ఈవిడకి యాంకరింగ్ అవసరమా. ఇంకెన్నాళ్లు బాబు నువ్వు వార్తలు చదువుతావు…. ఇలా టీవీల మందు కూర్చుని ఫలహారాలు తింటూ, భోజనాలు చేస్తూ మరో పక్క మొబైల్ స్క్రోల్ చేస్తూ… చాలామంది అవలీలగా కామెంట్లు చేసేస్తుంటారు.
ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి కామెంట్లు విసిరినవారే. ఇవి ఎలా ఉంటాయంటే…. క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఆటగాడికి మన ఇంట్లో నుంచే ఆ బాల్ ను ఇలా ఆడాల్సింది. అలా కొట్టాల్సింది. చూసుకుని పరిగెట్టొచ్చు కదా…. అనవసరంగా రన్ అవుట్ అయిపోయాడు… వీడు వేస్ట్ రా… ఇలా ఉచిత సలహాలివ్వడం వంటివి. ఎందుకంటే న్యూస్ ప్రజెంటింగ్ అంత ఈజీగా చేసేసే పని కాదు. అందరూ చేసేసే పనీ కూడా కాదు.
ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటూ…. ప్రతి అంశం పట్ల నిత్యం అప్ డేట్ అవుతూ కొనసాగే అతి తక్కువ విధుల్లో న్యూస్ ప్రజెంటింగ్ ఒకటి. బాడీ, బ్రెయిన్ సమర్థవంతమైన కో ఆర్టినేషన్ ఉండాల్సిన వృత్తి. మీడియాలో అనేక విభాగాలు ఉంటాయి. దేనికదే ప్రత్యేకం. న్యూస్ ప్రజెంటింగ్ మాత్రం చాలా ప్రత్యేకమైన ఆర్ట్. ఎంతో ఓర్పు, నేర్పుతో చేయాల్సిన పని. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా క్షణాల్లో లక్షలాది మందికి తప్పుడు సమాచారం చేరిపోతుంది.
నిత్యం సవాళ్లతో కూడుకున్న పని న్యూస్ ప్రజంటింగ్. పదేళ్ల క్రితం వరకూ న్యూస్ రీడింగ్ మాత్రమే ఉండేది. అంటే ఎవరో రాసింది చూసి చదివితే సరిపోయేది. రోజుకి అలా రెండో మూడో బులిటెన్లు చదివి హాయిగా వెళ్లిపోయేవారు.కానీ 24 గంటల ఛానెళ్ల ఉధృతి పెరిగాక యాంకర్లు, న్యూస్ ప్రజెంటర్ల ఉద్యోగాలు కత్తిమీద సాముగా మారాయి. టీవీల ముందు కూర్చున్న వీక్షకుడు బ్రేకింగ్ న్యూస్ గోలరా బాబు. వీడెవడండీ ఇంతలా వాయించేస్తున్నాడు. అంటూ ఏవేవో కామెంట్లు చేస్తారు. కానీ అక్కడ న్యూస్ ప్రజెంటర్ పడిన తిప్పలు మామూలు తిప్పలు కాదు. ఎందుకంటే ఆ బ్రేకింగ్ న్యూస్ ని ఏదో ఒక రిపోర్టర్ కట్టా కొట్టా తెచ్చా అన్నట్లు ఆఫీసుకు చెబుతాడు.
దాన్ని పట్టుకుని ఈ చిన్న ఆధారాలతో కనీసం ఓ పది నిముషాలు షో రన్ చెయ్యాలి. అదంతా న్యూస్ ప్రజెంటర్ బాధ్యతే. ఇలాంటి సందర్భాల్లో పలానా కలెక్టర్ తో మాట్లాడిస్తాం… మీరు రెడీనా అంటూ పీసీఆర్ వారు సదరు యాంకర్ చెవిలో చెబుతారు. బులిటెన్ ను టెక్నికల్ గా కంట్రోల్ చేసే వ్యవస్థే పీసీఆర్. పీసీఆర్ టెక్నీషిియన్ ఇయర్ ఫోన్లో చెప్తాడు సర్ రెడీనా… మంత్రిగారు లైన్లో ఉన్నారనో… కలెక్టర్ గారికి కాల్ కలిపేస్తున్నాననో చెప్పి టక్ మని కట్ చేసేస్తాడు. అంతే క్షణాల్లో సదరు పెద్దమనిషి నేరుగా న్యూస్ ప్రజెంటర్ తో మాట్లాడతారు. నేరుగా లైవ్ లో ప్రత్యక్షమౌతారు.
అంటే ఆ బ్రేకింగ్ న్యూస్ రెండు లైన్లు చూసి… అప్పటికప్పుడు ఆ వార్తను పూర్తిగా ఆకలింపు చేసుకుని… ఆ వ్యక్తికి ఏం అడగాలి. ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఆ వార్త జరిగింది. ఆ వార్త పూర్వాపరాలేంటి. ఇలా అనేక కోణాల్లో వార్తను అందరికీ అర్ధం అయ్యేలా ప్రజంట్ చేయ్యాల్సిన బాధ్యత సదరు న్యూస్ ప్రజెంటర్ దే అన్నమాట.
ఇక్కడ ఇంకో దారుణం ఏంటంటే… కొన్ని సందర్భాల్లో గంటలకు గంటలు నిలబడే వార్తల్ని ప్రజెంట్ చెయ్యాల్సి వస్తుంది. కనీసం గొంతెండిపోతున్నా కొన్ని సందర్భాల్లో నీరు కూడా ఉండని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మొత్తం మీడీయా ఆఫీసులో ఎవరి గోలలో వారు ఉంటారు. అందులోనూ ఎవరికీ కనిపించకుండా దూరంగా ఓ పక్క నాలుగు గోడల మధ్య స్టూడియోలో ఉండే యాంకర్ అవస్థలు ఎవరికీ పట్టవు.లేడీ యాంకర్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. వార్తలు చదివేందుకు ముందు వారు ఎంత కష్టపడతారో తెలిస్తే ప్రతి ఒక్క లేడీ న్యూస్ ప్రజంటర్ పట్ల గౌరవం పెరుగుతుంది. స్క్రీన్ పై కనిపిం చడానికి ముందు కనీసం రెండు గంటల ముందు నుంచే వారి హడావిడి ప్రారంభం అవుతుంది. సుదూర ప్రాంతాల నుంచి రకరకాల రవాణా వ్యవస్థల ద్వారా ఆఫీసులకు చేరుతారు.
వెంటనే గబగబా పరుగులు పెడుతూ మేకప్ రూంకి చేరుకుంటారు. ఓ పక్క హెయిర్ డిజైన్ చేసుకోవాలి. మేకప్ సరిగా వేసుకోవాలి. మరో పక్క ఆరోజు అప్పటి వరకూ జరిగిన, జరుగుతోన్న వార్తల అప్ డేట్స్ తెలుసుకోవాలి. చాలామంది ఈ హడావిడిలో కడుపునిండా తిండి కూడా తినలేరు. బ్రేకింగ్ న్యూస్ హడావిడి ఉన్నప్పుడు సరిగా నీరు కూడా తీసుకోలేరు. ఎందుకంటే పూర్తిగా లైవ్ లో ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని. ఎంత దారుణమైన పరిస్థితో కదా అనిపిస్తుంది.
ఇలా అనేక అవస్థల మధ్య చక్కగా ఉద్యోగాన్ని కొనసాగిస్తూన్నా… సూటిపోటి మాటలు, సైడ్ డైలాగులు, కించపరిచేలా వ్యాఖ్యలు నిత్యం ఉంటూనే ఉంటాయి.ఇన్ని ఇక్కట్లు పడుతున్నప్పుటికీ… మరో దారుణం ఏంటంటే… పెదవులపై చిరునవ్వు, కల్లల్లో ఆ తేజస్సుని కొనసాగించాలి. రోజంతా ఓ పక్క బులిటెన్లు చదవాలి. మరోపక్క అవసరమైన ప్రతిసారి వాయిస్ ఓవర్ చెప్పాలి. కొన్ని సందర్భాల్లో చాలా పెద్ద పెద్ద వాయిస్ ఓవర్లు చెప్పాలి. ఏదో ఆషామాషీగా వాయిస్ చేస్తే సరిపోదు.వార్త ప్రాధాన్యతను బట్టి వాయిస్ లో మాడ్యులేషన్ మార్చుకుంటూ చెప్పాలి. ఎంత నైపుణ్యాన్ని ప్రదర్శించాలో. ఎంత మానసిక ఒత్తిడిని రోజు అధిగమిస్తూ ఉండాలో.
ఇంత కష్టపడి… ఇన్ని ఇక్కట్లు పడి ఉద్యోగాలు చేస్తున్నా… చాలా మందికి అరకొర జీతాలే ఉంటాయి. నలభై వేలు రావాలంటే ఎన్నో అవస్థలు పడాలి. ఆ మార్కు దాటుతున్నారనేసరికి వీళ్లని ఎప్పుడు పీకి పడెయ్యాలో అనే ఆలోచన మీడియా యాజమాన్యానికి కలగడం అసలైన ట్రాజడి.
చివరగా చెప్పేదేంటంటే… ల, ళ, స,శ,ష, వీటిని పలకాలండీ… తెలుగుని కూనీ చేసేస్తున్నారండీ.. అబ్బా వీడి గోల భరించలేకపోతున్నామండీ.. అంటూ ఏవేవో కామెంట్లు చేసే మహానుభావులు ఓసారి సదరు వ్యక్తులు పడే ఇబ్బందులు కూడా గమనించాలనే చిన్న మనవి. అంతే.
తెలుగు బాష అన్నా… మీడియా ఉద్యోగం అన్నా ప్రేమ ఉండబట్టే ఇంతమంది… ఇన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నా మీడియాలో న్యూస్ ప్రజెంటర్లుగా ఎంతో ఓర్పుతో నేర్పుతో కొనసాగుతున్నారు. సమాజంలో ఉండే విభిన్న సమస్యల్ని అద్భుతంగా ప్రపంచానికి చాటిచెబుతారు. కానీ వీరి సమస్యల్ని ఎప్పటికీ ఎవరికీ పంచుకోకపోవడమే వింత పరిస్థితి. అద్భుతమైన ప్రతిభతో కొనసాగుతోన్న న్యూస్ ప్రజెంటర్లందరికీ హ్యాట్సాఫ్.
——— MNR
Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!