Taadi Prakash………………………………………..
Don’t spare me Shankar : Nehru—————
ప్రపంచ ప్రసిద్ధ కార్టూనిస్టు కేశవ శంకర్ పిళ్ళై. భారతీయ రాజకీయ కార్టూన్ పితామహునిగా పేరు పొందారు. 1902 జూలై 31న పుట్టిన శంకర్ 1989 డిసెంబర్ 26న మరణించారు. ఆయన సొంత వూరు కేరళలోని కాయంకుళం. ఆయన నడిపిన ‘శంకర్స్ వీక్లీ’ కార్టూన్ పత్రిక రాజకీయ నాయకుల వెన్నులో వొణుకు పుట్టించింది.
అబూ అబ్రహాం, రంగ, కుట్టి లాంటి జాతీయ స్థాయి కార్టూనిస్టుల్ని మనకి అందించింది శంకర్స్ వీక్లీనే. 1932 నుంచి 1946 దాకా శంకర్ ‘హిందుస్తాన్ టైమ్స్’ డైలీ కార్టూనిస్ట్ గా ఢిల్లీ లో పని చేశారు. అలా అయన కుటుంబం ఢిల్లీ లోనే స్థిరపడిపోయింది. 1956లో పద్మశ్రీ, 1966లో పద్మభూషణ్ , 1976లో పద్మవిభూషణ్, 1977లో పోలెండ్ బాలల కమిటీ నుంచి ‘ఆర్డర్ ఆఫ్ స్మైల్’ అవార్డులు పొందారు.
మనల్ని చూసి మనమే నవ్వుకోడాన్ని ఈ దేశానికి నేర్పించినవాడు శంకర్. జవహర్ లాల్ నెహ్రూ శంకర్ కార్టూన్లని ఎంతో యిష్టపడేవారు. “Dont spare me shankar” అన్నారు నెహ్రూ అప్పట్లో. కొత్తగా స్వతంత్రం పొందిన దేశంలో వ్యక్తి స్వేచ్ఛకి నెహ్రూ యిచ్చిన విలువ అది. ఇపుడు టూల్ కిట్ అనే బుల్ షిట్ నెపంతో యువతీ యువకుల్ని అరెస్ట్ చేసి వేధిస్తున్న దుర్మార్గాన్ని మనం కళ్లారా చూస్తూనే వున్నాం.
హ్యూమర్, సెటైర్, జోకు, రిపార్టీ… అంటే నవ్వడం చేతకాని దళసరి చర్మపు రాజకీయ గాడిదలు తిరుగుతున్న కాలంలో మనం బతుకుతున్నాం. శంకర్స్ వీక్లీ ని ఇండియన్ ‘PUNCH’ అంటారు.ఇది, శత్రువుని కూడా హాయిగా నవ్వించగల శంకర్ పిళ్ళై గురించి ఆర్టిస్ట్ మోహన్ 30 ఏళ్ల క్రితం రాసిన వ్యాసం. చదవండి .
పేద దేశాల పతాక శంకర్ తాత!ప్రతి కార్టూనిస్టు చిన్నపుడు చిన్నవాడై వుంటాడు. పెద్దయ్యాక బాగా పెద్దవాడైపోతాడు. కొత్తలో వేసిన కొన్ని కార్టూన్లు సెన్సేషన్ పుట్టిస్తాయి. కొన్నిటి మీద పూలు, రాళ్ళూ పడతాయి. ఒకసారి వైశ్రాయి గారొచ్చి షేక్ హ్యాండ్ ఇస్తారు. మరోసారి మంత్రిగారొచ్చి లెంపకాయ కొట్టబోతారు.
చివరికి ఆ కార్టూనిస్టు ఒక వ్యక్తే కాదంటారు. పైగా ఇంకో సంస్థ అనికూడా అంటారు. శంకర్ నీ, ఆయన వీక్లీ నీ ఇలాగే చెప్తారు. ఇంతకుమించి, ఏ కార్టూనిస్టు చరిత్ర చూసినా ఏముండును బోడిగొప్ప!శంకర్ పూర్తిపేరూ, పూర్తివూరూ, తల్లిదండ్రులూ, విద్యా, అనుభవమూ వగైరా బయోడేటా పేపర్లలో చదివే వుంటారు.కనుక ఇక వేరే సంగతులు. మన దేశానికి స్వతంత్రం రాకముందే కార్టూనింగ్ లో ఉన్నాడాయన.
స్వతంత్రం వచ్చాక ‘శంకర్స్ వీక్లీ’ పెట్టాడు. రాజకీయంగా దేశానికి స్వేచ్చ వచ్చింది గానీ మేధావుల బుర్రలన్నీ లండన్ జైల్లోనే వున్నాయి. అపుడు బొమ్మ గీసేవాడూ, శిల్పం చెక్కేవాడూ, స్టేజి నటుడూ, కవీ, రచయితా అందరూ లండన్ వైపే చూసేవారు. గొప్ప దేశభక్తులైన కళాకారులు కూడా సాంస్కృతిక అవసరం వస్తే ‘మదర్ కంట్రీ’ బ్రిటన్ మీదే ఆధారపడేవాళ్ళు.
‘ఇండియన్స్ అండ్ డాగ్స్ ఆల్సో పర్మిటెడ్’ అనే బోర్డు కనిపిస్తే కనుక మనకి గుర్తింపు దొరికిందని సంబరపడే పరిస్థితే. తెల్లదొరగారు అరబ్ లనీ, పాలస్తీనియన్లనీ తిడితే మన స్వతంత్ర పత్రికలు కూడా తిట్టేవి. దొరగారికి చర్చిల్ మీదా, రూజ్వెల్ట్ మీదా ప్రేమ పుట్టుకొస్తే, మన జర్నలిస్టులూ, రచయితలకి కూడా అంతే ప్రేమ వొలికిపోయేది.
వాళ్ల భవంతుల్లాగే మన ఇళ్ళు కట్టి చూసుకుని గొప్పయిపోయేవాళ్లు. ఈనాటికీ మనలో ఈ కల్చరల్ ఇన్ఫీరియారిటీ ఉంది.అలాంటి స్థితిలో కొత్త గవర్నమెంటొచ్చింది. దీన్ని గౌరవించండి. దీని నాయకుడు నెహ్రూ గొప్పవాడు. ఇక మన కష్టాలన్నీ గట్టెక్కుతాయ్ – అని జనానికి చెప్పి వొప్పించటం కళాకారుల వంతయింది.
No Responses