ప్రకృతి ప్రేమికులకు బాగా నచ్చుతుంది !!

Sharing is Caring...

MNR………………………………………………………….

కొండ పొలం సినిమా నచ్చాలంటే… ప్రకృతితో పరిచయం ఉండాలి. ఇది రివ్యూ కాదు. సినిమా చూసిన వెంటనే కలిగిన అనుభూతి. మెతుకులు వెతికే జీవన పోరాటం ఓ వర్గానిది…బతుకులు కొరికే ఆకలి కోరలు వేరొకరివి. ఈ రెంటి మధ్య జరిగే సంఘర్షణే ఈ సినిమా. నీరు దొరకని ప్రదేశంలో గొర్రెల కాపరులు పడే కష్టమే ఈ సినిమా. ప్రాణానికి ప్రాణంగా పెంచుకునే మూగ జీవాల దప్పిక తీర్చేందుకు ప్రాణాలతో చెలగాటమే ఈ సినిమా.

ఈ సినిమా నచ్చాలంటే…. వేకువఝామున వీచే చల్లని గాలి… పక్షుల కిలకిలారావాల మధ్య ఉదయించే సూర్యుడు… వాన వచ్చేముందు సంభవించే ఓ కుదుపు… చిరు జల్లుల పడుతున్న వేళ వచ్చే మట్టి వాసన… నులక మంచంపై పడుకుని పండు వెన్నెలని ఆస్వాదించే టప్పుడు కలిగే ఓ అనుభూతి… ఇలాంటివి అనుభవించే వారికి మాత్రమే ఈ సినిమా నచ్చుతుంది.

ఆ మధ్య తెలంగాణ పర్యాటక శాఖ అనుకుంటా సరిగా గుర్తు లేదు… ఓ అద్భుతమైన యాడ్ రూపొందించింది. అందులో ఒకాయన అంటాడు… మా ఇంట్లో మొత్తం నలుగురు మనుషులం… రెండు ఆవులు.. రెండు చెట్లు ఉంటాయని చెబుతారు. నాకు ఎంతగానో నచ్చిన ప్రకటన ఇది. జీవితం అంటే అదే కదా. అసలు జీవించడం అంటే మనిషే కాదు కదా… మన చుట్టూ ఉన్న చెట్టూ… చేమ… పశు పక్ష్యాదులూ కూడానూ.

కొండ పొలం సినిమాలో కూడా అదే చూపించారు. సారీ… కొండ పొలం నవలని సినిమాటిక్ గా చూపించారు. ముందుగా ఈ సినిమా దర్శకుడు క్రిష్ కి ఓ వంద వీరతాళ్లు వెయ్యాలి. ఇలాంటి సబ్జెక్టుని ఎంచుకున్నందుకు. గొర్రెల కాపరులు మూగ జీవాల్ని కూడా తమ కుటుంబ సభ్యులుగానే భావిస్తారనే ఎమోషనల్ టచ్ ను ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు దర్శకులు. అడవిలో వెళ్తున్నప్పుడు కాలు జారి ఓ గొర్రె ఎత్తునుంచి జారి పడుతుంది. వెన్నెముక  విరుగుతుంది. దాన్ని కోసుకు తినేద్దాం అని అంతా అనుకుంటే… దాన్ని సాకిన వ్యక్తి చికిత్స చేయిద్దాం అని అంటాడు. ఆ మూగ జీవాన్ని పట్టుకుని ఏడుస్తాడు. కదిలించే సీన్ అది. అంతే కాదు…ముచ్చు… నరిగే… తెల్ల అంటూ వాటిని  పేర్లతో పిలవడం అద్భుతంగా అనిపిస్తుంది.

గుక్కెడు నీటి కోసం ప్రాణాలను ఫణంగా పెట్టే జనం. వానలు కోసం పొంగళ్లు పెట్టి… దేముళ్లకు మొక్కే తనం. అడవి మా అమ్మ సామీ అంటూ పలికే పలుకులు. పులి నోట చిక్కిన తల్లి కోసం పరుగులు తీసే చిన్నారి మేక పిల్ల అరిచే అరుపు. ఒకటా రెండా సినిమా అంతా ఏదో ఎమోషన్. మనం రెగ్యులర్ లైఫ్ లో మిస్సయ్యే ప్రతి మానవీయ కోణం ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు క్రిష్.

దాచుకోవాల్సింది ధనం కాదు. ప్రకృతిని. పచ్చదనం… అడవి… అనేకానేక మూగ ప్రాణులు ఉంటేనే మనం. ఇదే అసలైన జీవన సారం. ఇదే అంశాన్ని మరోసారి సిల్వర్ స్క్రీన్ పై చక్కాగా చూపించారు.ప్రకృతికి మించిన గురువు లేడు. ఆడవికి మించిన అరుదైన ప్రపంచం మరొకటి ఉండదు. ఇది ఎవరు ఎన్ని సార్లు చెప్పినా… ఎలా చెప్పినా అద్భుతమే. ఒకచోట కథలో భాగంగా విచ్చల విడిగా చెట్లను నరికేసిన స్మగ్లర్ల గురించి మాట్లాడుతూ… తోలు ఒలిసి పెట్టిన పసి పిల్లల్లెక్క పడున్నాయి ఈ చెట్లు అనే డైలాగ్ వినగానే ఓ కుదుపు కలుగుతుంది. మదిలో ఎక్కడో మెలి పెట్టినట్లు అనిపిస్తుంది.

అవతలోడి కాలి చెప్పుల్లో కాలు పెడితే కానీ ఎన్ని ముళ్లున్నాయో తెలియదు కదా… అనే డైలాగ్ లో ఎంత అర్ధం దాగుందో కదా. అడవి నేర్పిన అక్షరాలతో… ఎదిగిన బతుకుల జీవన చిత్రం. ఓ రకంగా చెప్పాలంటే.. బతుకుపై తీపి పుట్టించే సిినిమా. మనందరి మూలాలను గుర్తు చేసే మంచి ప్రయత్నం.సినిమా తియ్యడంలో కొన్ని లోపాలు… తడబాట్లు  ఉండొచ్చు. కానీ… చెప్పాలనుకున్న భావం. చెప్పిన విధానం బాగుంది.

ఎదగాలనుకునే ప్రతి ఒక్కరికీ ఊరోళ్లకంటే… ఊర్లో ఉండే తల్లిదండ్రుల కంటే గొప్ప పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్లు లేరని చాటి చెప్పిన చిత్రం కొండ పొలం. చివరగా దర్శకుడు క్రిష్ కే కాదు… సంగీత దర్శకుడు కీరవాణికీ వెయ్యాలి బోలెడు వీరతాళ్లు.
ఇలాంటి సినిమాలు రావాలి. రావాలంటే… అందరం ఆదరించాలి. రంధ్రాన్వేషకులు ఈ తరహా సినిమాలను క్షమించి వదిలేయాలి. మంచి సినిమాలు రావాలనే ఆకాంక్షతో…

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!