సుమ పమిడిఘంటం …………………………………………………
ప్రకాశం జిల్లాలో ఎందరో మంచి నటులున్నారు. నాటకాల ద్వారా వీరు చాలా మందికి పరిచితులే. అలాంటి వారిలో నిమ్మగడ్డ నరశింహయ్య ఒకరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ నాటక పరిషత్ జరిగినా ఒంగోలు నుంచి నాటకాలు పోటీకి వెళ్ళేవి. పోటీలలో బహుమతులు గెలుచుకొచ్చేవారు. నరశింహాయ్య కూడా ఎన్నో నాటాకాలు వేసి ఉత్తమ నటుడిగా బహుమతులు పొందారు. ప్రకాశం ఖ్యాతిని ఇనుమడింప చేశారు.
నరశింహయ్య మాకు కాలేజ్ రోజులనుంచి పరిచయం. నా ఇతర మిత్రులు అక్కరాజు శంకర్రావు,అప్పయ్యశాస్త్రి, రచయిత హరనాధరావు తదితరులకు హైస్కూలు నుంచే స్నేహితులు. హరనాధరావు మొదట్లో రాసిన రక్తబలి, మనసుకుశిక్ష, జగన్నాధ రథచక్రాలు, క్షీరసాగర మధనం నాటకాలలో నరశింహయ్య మంచిపాత్రలు ధరించారు. పి.యల్.నారాయణ, కె.యస్.టి. శాయి, కనకాల దేవదాసు, ప్రొ.రాజా రాందాస్, భానుప్రకాష్ లాంటి మహానటులు నరశింహయ్య నటన చూసి నివ్వెర పోయేవారు. నరశింహాయ్య పాత్రలో లీనమైన తీరు ను ప్రశంసించేవారు.
జగన్నాధ రధ చక్రాలు నాటకాన్ని హరనాధరావు రాస్తే, టి.కృష్ణ దర్శకత్వం వహించాడు.అందులో పూజారి పాత్ర నరశింహయ్య తప్పమరొకరు నటించలేరేమో అనుకునే స్థాయిలో నటించి ప్రేక్షకుల,విమర్శకుల, నిర్వాహకుల ప్రశంసలు పొందారు. అలాగే హరనాధరావు రాసి దర్శకత్వం వహించిన క్షీరసాగరమథనం నాటకంలో అచార్యుల పాత్రకు నరశింహయ్యకు నరశింహయ్యే పోటీ. అప్పట్లో ఉత్తమనటుడు సాధించని నాటక పరిషత్తేలేదంటే అతిశయోక్తి కాదు.
గెద్దనాపల్లి పరిషత్ నుంచి విశాఖ,రవీంద్రభారతి, ఖమ్మం ఆంధ్రనాటక కళాపరిషత్తు ఇలా ఒకచోటేమిటి ఆంధ్రనేల నాలుగు చెరగుల అన్ని పరిషత్తులలో చర్చించే విషయం హరనాధరావు నాటకం,నరశింహయ్య నటన రోరింగ్ టాపిక్.ఆ తరువాత నేను రాసిన “అధినాయక జయహే “! నాటకానికి నరశింహయ్య చక్కగా దర్శకత్వం వహించి నటుడిగానే గాకుండా దర్శకుడు గా ప్రతిభ చూపి ప్రఖ్యాతి పొందాడు.
ఈ నాటకాన్ని అప్పయ్యశాస్త్రి,మద్దాలి కోటయ్య, వాడ్రేవు శ్రీరామ్మూర్తి, రత్నకుమారిలతో కలిసి ఆంధ్రదేశమంతా దిగ్విజయంగా ప్రదర్శించి అనేక బహుమతులు తెచ్చాడు.నరశింహయ్య నటుడు,దర్శకుడు మాత్రమే కాదు.మంచి గాయకుడు.
ఒంగోలులో అనేక లలితసంగీత కచేరీలలో హరనాధరావు, యు.వి.రత్నం,ఐ.వి.సుబ్బారావులతో పాల్గొని దేవులపల్లివారి పాటలు ఓహోహో వసంత, ప్రియభారత జనయిత్రి దివ్యధాత్రిలాటి సెమీ క్లాసికల్ గీతాలు పాడాడు ఈపాటలను ధారా రామనాధశాస్త్రి గారు స్వరపరిచారు. సహకార శాఖలో అధికారిగా ఉద్యోగం చేసి రిటైరయిన నరశింహయ్య 2021 ఆగస్టు 8 న కన్నుమూసారు. మిత్రుడి ఆత్మ కు శాంతి కలగాలని కోరుకుందాం. photo courtesy… Nirmal Akkaraju
Read it also ……………………………….. నాటక రంగంలో ఆయన ఓ సంచలనం !
Narasimhaiah ku ravaalisinantha peru raaledu.