పూదోట శౌరీలు………
ఎంతో కాలంగా కృష్ణానదిలో లాంచీ ప్రయాణం కోసం ఎదురుచూస్తున్నాను.ఈ ఏడాది (2017)సాగర్ నీటిమట్టం 570 అడుగులకు పైగా చేరటంతో తెలంగాణ ప్రభుత్వం లాంచీలను నడపాలని నిర్ణ యించింది.. వెంటనే ఆన్ లైన్ లో టికెట్స్ రిజర్వు చేసుకున్నాము. మిత్రబృందం తో కలిసి నాగార్జున సాగర్ లోని,లాంచీరేవు చేరుకున్నాము.లైఫ్ జాకెట్స్ వేసుకున్నాము.ఈ లోగా మా వెంట వచ్చిన లక్ష్మి భయపడుతూ వుంది.
కారణం అంతకు రెండురోజుల ముందు విజయవాడ దగ్గర,భవాని ఐలాండ్ లో జరిగిన లాంచీ ప్రమాదం లో 21 మంది చనిపోవటమే. ఈ లోగా లాంచీ స్టేషన్ మేనేజర్ సత్యం గారు వచ్చి అందరూ లైఫ్ జాకెట్స్ వేసుకున్నదీ,లేనిదీ పరిశీలించారు.సత్యం గారుమాట్లాడుతూ”ఎవరు ఎలాంటి భయాలు పెట్టుకోవద్దని,ఈ లాంచీ లో భద్రతకు అవసరమైన అన్నీ సదుపాయాలు వున్నాయనీ,అనుభవజ్ఞులైన డ్రైవర్లు ఇద్దరున్నారని చెప్పారు
సుమారుగా ఆరుగంటల పాటు కృష్ణజలాలలోప్రయాణిస్తామని, నేను గూడా మీతోపాటే ప్రయాణిస్తున్నాననీ”చెప్పటంతో మా లక్ష్మికి దైర్యం వచ్చింది..మధ్యాహ్న భోజనాన్ని పనివాళ్లు లాంచీలోకి చేర్చారు..మేమందరం వుల్లాసంగా ”పల్గుణి”లాంచీలోకి చేరాము.డ్రైవరు దిగంబర్ శ్రీశైల మల్లన్నకు జై కొట్టి లాంచీని నడపటం మొదలుపెట్టాడు.
అందరి మొహాలలో ఉద్విగ్నత,ఆనందం. మెల్లిగా మా లాంచీ నందికొండకు ఎడమవైపుకు చేరుకుంది .నందికొండను చూడగానే అందరి మదిలో ఆచార్య నాగార్జునుడు మెదిలాడు…సత్యంగారు మైకులో నందికొండ విశేషాలు చెబుతున్నారు.సాగర్ డ్యాం నిర్మాణం లో బయల్పడిన నాగార్జునుడు వాడిన వస్తువులను..బుద్ధవిగ్రహాలను,చారిత్రికాంశాలను, ఆనాటి రాజుల పాలనకు చెందిన అనేక విషయాలకు చెందిన వాటిని నందికొండ పైన. వున్న మ్యూజియం.. లో భద్రపరిచారు.ఈ ప్రాంతం లోని ”అనువు”అనే వూరిలో నాగార్జునుడు ఒక గొప్ప విశ్వవిద్యాలయాన్ని నిర్మించాడు..అందులో వేలాది మంది విద్యార్ధులు,ఇంకా దూరదేశాల నుండి ఎంతో మంది వచ్చి విద్య నభ్య సించారు.
ఎందరో బౌద్దబిక్షకులు ఇక్కడ ఆయుర్వేద విద్య నేర్చుకున్నారు.నాగార్జునుడు గొప్ప తత్వవేత్త,సుమారుగా 20 గ్రంధాలను రచించారు”అని చెప్పారు..ఒకసారి నాగార్జునుడు తన శిష్యు లకు ఆయుర్వేద విషయాలను చెబుతూ ”ఈ నల్లమల అడవుల్లో ఏదైనా ఆయుర్వేదానికి పనికిరాని మొక్క వుంటే వెదికి తీసుకుని రండి” అని పంపించాడట..శిశ్యులు రోజులు తరబడి తిరిగి,వెతికినా ఒక్క పనికి రాని మొక్కా దొరకలేదట. అంత గొప్ప ఔషధమొక్కల గని ఈ నల్లమల అటవీప్రాంతం.
పరవళ్ళు తొక్కుతున్న కృష్ణలో లాంచీ నెమ్మదిగా సాగిపోతూవుంది..దూరంగా ఏలేశ్వరం కొండ… చూస్తుంటే ఏలేశ్వరం కొండపైభాగంలో నల్లమలలో తిరిగే పులి వచ్చి విశ్రాంతిగా పడుకుందా అన్నట్లున్నది..ఈ లోగా ప్రయాణికులందరికి కమ్మటి టీ” ఇచ్చారు.”టీ”తాగుతూ మరోమారు సత్యం గారు చెప్పే మాటలు ఆలకిస్తున్నాము….ఈ కొండ మీదున్న ఏలేశ్వరునికి శివరాత్రినాడు పెద్ద జాతర జరుగుతుందట..చుట్టుపక్కల వున్న చెంచులు,గిరిజనులు వచ్చి పండుగలో పాల్గొంటారట.
ఇక్కడనుండి అందమైన కొండలు మొదలయ్యాయి.ఇదే రోజు హైదరాబాద్ నుండి మీడియా గూడా ఈ యాత్రలో పాల్గొన్నది..వాళ్ళు ప్రకృతి రామణీయతను చిత్రీకరిస్తూ హడావుడిగా తిరుగుతున్నారు..మాలో కొంతమంది దగ్గర ఇంటర్వ్యూ తీసుకున్నారు..ఈ లోగా సత్యం గారు ”తంబోలా’అడటానికి అందరినీ పిలిచారు.ఎప్పటిలాగే నేను ఒక్క బహుమతి గెలవలేదు.మావారు ఫుల్ హౌస్ చేసి మొదటి బహుమతి 120/రూ గెలుచుకున్నారు.
మా అందరి దృస్టి కొండల వరుసల పై పడ్డది..ఈ పలుగురాళ్ల కొండలు ఎర్రగాను,ముదురు జేగురు రంగులోనూ వుండి చాలా అందంగా వున్నాయి.ఎవరో రాజులు పెద్దపెద్ద కోటలు కట్టుకుని వదిలేశారా అన్నట్లుగా వున్నాయి.లాంచీ ఆమ్రాబాద్ ”టైగర్ రిజర్వ్ ఫారెస్ట్”గుండా వెళ్తున్నది.
ప్రభుత్వం చేపట్టిన రక్షణ చర్యల వల్ల ఇప్పుడిప్పుడే ఇక్కడ పులుల సంఖ్య పెరుగుతుందట..ప్రతి ఏడాది wwf తరపున పులుల లెక్కింపులో పాల్గొనే మా పెద్దకొడుకు విక్రమాదిత్య చెప్పిన దాని ప్రకారం 60నుండి 80 వరకు పులులు పెరిగాయట. లాంచీ కేదురుగా రకరకాల నీటిపక్షులు,కొంగలు,నీటికాకులు వస్తూ కనిపించాయి..దూరాన చేపలు పడుతున్న మత్స్యకారులు,చెంచులు కనిపించారు..నీళ్ళు తాగుతున్న ఆవులమందలు,బర్రెలు,గొర్రెలు కనిపించాయి..
ఈ లోగా భోజనాలు వచ్చాయి. పప్పు,వంకాయకూర,దోసకాయపచ్చడి,బెండకాయవేపుడు,సాంబారు వడియాలు,పెరుగు,కమ్మటి సేమ్యాపాయసం తో లాంచీ భోజనం, పెళ్లిభోజనాలను తలపింపజేసింది..లాంచీలో వున్న 80 మంది చక్కగా భోజనాలు చేశారు.
లాంచీ నల్లగొండ,గుంటూర్,ప్రకాశం,మహబూబ్నగర్,కర్నూల్ ఈ ఐదు జిల్లాల గుండా ప్రయాణిస్తున్నది.శ్రీ శైలానికి అబిముఖంగా ప్రయాణిస్తుంటే ఎడంపక్క ఆంద్ర,కుడిపక్కతెలంగాణ మద్య కృష్ణానది నీళ్ళలో మేము….ఒక వింత అనుభూతి..!!..టివి చానళ్ళ వాళ్ళు మా మూతుల దగ్గర మైకులు పెట్టి మీ అబిప్రాయం చెప్పండి అంటున్నారు…
మాటాడటానికి సిగ్గు పడేవాళ్లు కొందరైతే,అతిగా మాట్లాడే వాళ్ళు ఇంకొందరు.. మీడియా వాళ్ళ జోక్స్,ప్రయాణికుల నవ్వులతో నల్లమల మురిసిపోయింది. మా నవ్వులకు దూరాన పుట్టిలలో తిరుగుతున్న పల్లెకారులు చేతులూపుతూ సందడి చేశారు..సత్యం గారు మరోమారు తంబోలా ఆడించారు.
పొద్దు గుంకుతూ వుంది.ఎదురుగా సూరీడు నల్లమల కొండలలోకి దిగిపోతూ తన అందాలను కనువిందు చేస్తున్నాడు.నీళ్ళలో సూర్యకిరణాలు పడి,నీళ్ళు తళతళ మెరుస్తున్నాయి…ఈ లోగా మరోమారు వేడివేడి”టీ”బిస్కెట్స్”అందించారు.టీ రుచిని ఆస్వాదిస్తూ.,తోటివారితో ముచ్చటిస్తూ సూర్యాస్తమయాన్ని చూడటం ఎంతో ఆనందం ఇచ్చింది.
రెండు గుట్టల మద్య పాతాళగంగ వద్ద కట్టిన వారధి కింది నుండి లాంచీ శ్రీశైలం డ్యాం కు ఎదురుగా ఎడమవైపు నున్న లింగాలగట్టుకు. 5.30కి సురక్షితంగా చేరింది.డ్రైవర్ దిగంబర్,వెంకటేశ్వర్లు,మేనేజర్ సత్యం గారికి ,లాంచీ సిబ్బందికి కృతజ్ఞతలు చెప్పి పల్గుణి లోనుండి కిందికి దిగాము..అద్భుతమైన ప్రయాణం అప్పుడే అయిపోయిందా… అనిపించింది..
లింగాలగట్టు మీద ఐదు నిమిషాలు నిలబడి మెట్లెక్కి పై నున్న రోడ్డుమార్గంలోకి చేరాము.అక్కడనుండి శ్రీశైలం కొండ మీదకు వెళ్తున్న బస్ ఎక్కి మల్లన్న కొండకు చేరాము..ముందుగా బుక్ చేసుకున్న రూముల్లో చేరి విశ్రాంతి తీసుకున్నాము.
మరపురాని మధురానుభూతులను పంచిన ఈ సాగర్-శ్రీశైలం యాత్ర మీరూ చేయండి…నల్లమల కొండల,అడవుల అందాలను చూడండి…
నల్లమల లాంచీ ప్రయాణానికి టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలో తెలుపగలరు..ఇప్పుడు పన్నెండేళ్ళ పిల్లల్ని అనుమతిస్తున్నారా?
sir pl contact telangana tourisam department fo r different packages