నైనితాల్ …. తప్పక చూడాల్సిన ప్రదేశాల్లో ఒకటి. ఓ పక్క హిమాలయ పర్వతాలు, మరోపక్క అందమైన సరస్సులు నైనితాల్ ప్రత్యేకత.ఇంకో వైపు దర్శించాల్సిన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. పక్కా గా ప్లాన్ చేసుకుని వెళితే వీటినన్నింటిని చూసి రావచ్చు.
ఈ ప్రాంతాన్ని ఆధారం చేసుకుని పౌరాణిక గాధలు ఎన్నో ప్రచారంలో ఉన్నాయి. అసలు నైనితాల్ అన్న పేరే ‘నయనా తల్’ అనే పదం నుంచి వచ్చిందని అంటారు. దక్షయజ్ఞం తరువాత పార్వతి అమ్మవారి కళ్లు (నయనాలు) ఇక్కడ పడ్డాయట. ఆ ప్రదేశంలో ఏర్పడిన సరస్సుని ‘నయనా తల్’ అంటారు.
ఆపేరు మీదుగానే ఊరు ఏర్పడింది. ఆ నయనా తల్ పక్కనే ఉన్న నయనాదేవి ఆలయాన్ని దర్శించేందుకు భక్తులు పెద్ద ఎత్తున వస్తుంటారు. ఇక్కడి ఆలయం 15 శతాబ్దం నాటిది.1883 లో ఆలయ పునర్నిర్మాణం జరిగింది. ఆగస్టు , సెప్టెంబర్ మాసాల్లో నంద అష్టమి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. భక్తులు పెద్ద ఎత్తున వస్తారు.
నైనితాల్‌కు ఓ 20 కిలోమీటర్ల దూరంలో ‘భీమతల్’ అనే మరో సరస్సుకూడా ఉంది. ఈ సరస్సు పదిహేడు కిలోమీటర్ల మేరకు ఇది విస్తరించి ఉంది . ప్రజల దాహార్తిని తీరుస్తూ … పంటల సాగుకి … చేపల వేటకు ఈ సరస్సు ఉపయోగపడుతున్నది. దీని చుట్టూ ఒక గ్రామం ఏర్పడింది.
ఈ భీమతల్ గురించి పౌరాణిక కథనం ఒకటి ప్రచారంలో ఉంది. పాండవులు అరణ్యవాసం చేసే సందర్భంలో వారు ఈ ప్రాంతానికి వచ్చారట. ఆ సమయంలో భీమునికి హిడింబాసురుడు అనే రాక్షసుడు ఎదురుపడ్డాడు. భీమునికీ ఆ రాక్షసునికీ మధ్య భీకర యుద్ధం జరిగింది.
ఆ పోరులో భీముడు గెలిచాడు. యుద్ధంలో భీముడు బాగా అలసిపోయి దప్పిక కు గురైనాడు. దాహం తీర్చుకునేందుకు భీముడికి చుక్క నీరు కూడా కనిపించలేదు. దాంతో కోపమొచ్చిన భీముడు తన గద తో ఒక్కసారిగా నేల మీద కొట్టాడట. అలా భీముని గద తాకిడికి అక్కడ నీరు పైకి ఉబికి వచ్చిందట. అదే సరస్సుగా మారిందట. దానినే ‘భీమ్ తల్’ సరస్సు అని పిలుస్తారు. ఆ సరస్సు ఒడ్డున భీముడు ఓ శివాలయాన్ని కూడా నిర్మించాడని అంటారు. అక్కడ శివుడిని ‘భీమేశ్వర మహాదేవుని’గా పిలుస్తూ పూజిస్తారు.
భీమ్‌తల్ సరస్సు కి దగ్గరలో ‘నల దమయంతి’ సరస్సు కూడా ఉంది. ఇక హిడింబాసురుడు నివసించిన హిడింబ పర్వతం కూడా ఇక్కడికి దగ్గరలోనే ఉన్నది. కర్కోటక అనే పాము పేరు మీదుగా మరో పర్వతం కూడా ఇక్కడికి సమీపంలో ఉంది. ఈ పర్వతం మీద నిర్మించిన ఆలయంలో ‘కర్కోటక మహరాజ్’ పేరుతో ఆ నాగదేవత కు పూజలు చేస్తారు.
భీమ్‌తల్ సరస్సులో బోట్ షికారు సదుపాయం ఉంది. చిన్న హిల్ స్టేషన్ అయినప్పటికీ మంచి హోటళ్లు ఉన్నాయి. సరస్సుకి దగ్గరలో హోటల్ రూమ్ తీసుకుంటే దగ్గరలో ఉన్న విక్టోరియా డ్యామ్, గిరిజన మ్యూజియం, బట్టర్ ఫ్లై రీసెర్చ్ సెంటర్ లను దర్శించవచ్చు. నైనితాల్ కి ఢిల్లీ నుంచి బస్సులు ఉన్నాయి. రైలు అయితే కాతగోడం వరకు వెళ్లి అక్కడనుంచి బస్ /కారు లో వెళ్ళవచ్చు.