తెర వెనుక సణుగుడు ఇదే !

Sharing is Caring...

సినిమా కళాకారులు ముఖ్యమంత్రిని కలిసారు.అబ్బో బ్రహ్మండమైన వార్త.ఇంకేం ప్రజలకు మంచి జరగబోతుంది.వాళ్ళు లోపలకు వెళ్ళి నాలుగు ఫొటోలు తీసుకోని తర్వాత తీరికగా తమ కష్టాలు వెళ్ళబుచ్చుతారు.తమకు తినటానికి కూడా తిండి లేదని,కనుక తమ చేతిలో ఉన్న కనీసం వందకు పైగా ధియేటర్లకు కరెంట్ ఛార్జీలు మాఫీ చేయాలని కోరతారు. టికెట్ ధరల పెంపు కోసం అనుమతి అడుగుతారు. 24 గంటలు షోల కు పర్మిషన్లు ఇవ్వమని అభ్యర్థిస్తారు. లాక్ డౌన్ కాలంలో బకాయిలు మాఫీ చేయాలని ప్రాధేయపడతారు. అదేదో పెద్ద అంతర్జాతీయ సమస్య, సోమాలియా లో తిండికి లేక జనాలు చచ్చిపోతున్నట్లు.

సరే ప్రభుత్వం అన్ని చేస్తుంది …  తమరు  కోవిడ్ ముందు ఉన్న ధియేటర్ కార్మికులను తీసేయకుండా ఇప్పటివరకు జీతాలు ఇస్తున్నారా? ధియేటర్ లీజుల ధరలు యజమానులకు ఇస్తున్నారా? నో … ఇవేమీ ఉండవు.ప్రజల మీద బ్రతికే వీళ్ళు  ప్రజలకు చేసే సాయం కూడా ఉండదు.తీసుకునేది కోట్లల్లో రెన్యూమరేషన్.  ఇచ్చేది లక్ష…  పది లక్షలు. అసలు ఎందుకివ్వాలంటారా? తమరు  ఇటు మా టికెట్ల డబ్బులను,అభిమానాన్ని సొమ్ము చేసుకోవడమే కాక అటు మేము కట్టే పన్నులలో ప్రభుత్వం నుండి లబ్ధి పొందుతున్నారు.పోనీ చిన్న సినిమాలను  ఆడనిస్తారా! అదీ లేదు.తమరి కుటుంబంలో హీరోలే  సినీ రాజ్యాన్ని ఏలాలి. వారే ఎదగాలి.  కొత్తవాడిని రానివ్వరు.ఎవరైనా అడిగితే టాలెంట్ ను ఎవ్వరూ తొక్కలేరు అంటారు.ప్రభుత్వాలకు మీ అవసరం కన్నా..ప్రభుత్వాలతో మీకు అవసరమే ఎక్కువ.మీకు రాయితీలు కావాలి,భూములు కావాలి. ఇతరత్రా సవాలక్ష  అనుమతులు కావాలి.సరే అప్పట్లో ఒక పార్టీకి పని చేసేవారు.వారు దానికి ప్రతిగా ఏదో ఒకటి చేసేవారు.అభిమానుల ఓట్ల కోసం నటులను చేరదీస్తారు.ఇది పార్టీకి-సినిమా వారికి మధ్య సంబంధాలే కానీ,ప్రభుత్వానికి-సినిమా వారికి సంబంధం కాదు.

ఇప్పుడు GHMC ఎన్నికలలో సినిమా వారి గురించి మానిఫేస్టోలా..అదీ కార్మికుల ఓట్ల కోసం.రేపెప్పుడో ఆంధ్రలో ముఖ్యమంత్రిని కలుస్తారట.మళ్ళీ అవే అభ్యర్ధనలు..ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత కనీసం కర్టేసి కోసం కూడా కలవని,గుర్తించని సినిమా వారికోసం ముఖ్యమంత్రి ఏమి చేస్తారో చూడాలి.
చివరిగా కళలు బతకాలి… బతికించాలి…. బతికిస్తాం …. అంతే కానీ మీ కలలకు  .. వారసుల కలలకు  మేమెందుకు కాపుకాయాలి. అవును … ఇది సగటు ప్రేక్షకుల ఘోష … సణుగుడు.! 

———  Nirmal Akkaraju 

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!