మనసును కదిలించే సినిమా !!

Sharing is Caring...

Subramanyam Dogiparthi……………………….

“ఇది మల్లెల వేళయనీ ఇది వెన్నెల మాసమని తొందరపడి ఒక కోయిలా ముందే కూసింది” . దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి పాట ఈ సినిమాను వంద రోజులు ఆడించటమే కాదు . జనం వెయ్యేళ్ళు ఆస్వాదించే పాటయింది.మనసున్న జనం గుండెల్ని పిండే పాటయింది.

ఈ పాటలో ప్రతి పదం అద్భుతం. దేవులపల్లి వారి పద విరాట రూపం. ఆ సాహిత్యానికి ధీటుగా ముఖ భావాలను చూపించింది వాణిశ్రీ. కళాభినేత్రిగా ప్రేక్షకుల మన్ననలను పొందటానికి వాణిశ్రీ చాలా కష్టపడి  వచ్చిన అవకాశాన్నిసద్వినియోగం చేసుకొంది. 

SVR నటన మహాద్భుతం . యుధ్ధరంగంలో కళ్ళు పోయినా , మనస్సుతో ప్రపంచాన్ని అడుగులతో సహా కనుక్కోకలిగిన పాత్రలో గొప్పగా నటించారు క్రమశిక్షణ , మానవత్వం , క్షమాగుణం కలబోసిన పాత్ర . బహుశా ఆయన్ని కాకుండా మరోకర్ని ఈ పాత్రలో ఊహించుకోవడం కూడా కష్టమే . ఈ సినిమాలో మరొక గొప్ప పాత్ర చంద్రమోహన్ ది .

ఆయన కూడా  వాణిశ్రీ లాగానే తన వెయ్యి సినిమాల కెరీర్ కు కావలసిన పునాదిని వేసుకున్నారు . అన్నగా , తన చెల్లెలిని మోసం చేసిన దుర్మార్గుడిని చంపిన తర్వాత అతని తండ్రి చేతులలోనే ఆత్మహత్య చేసుకొని చనిపోయే పాత్రకు జీవం పోసారు. 

ఈ ముగ్గురి తర్వాత మెచ్చుకోవలసింది రామకృష్ణనే చక్కగా నటించారు. జయలలిత ముద్దు బొమ్మగా అందంగా తిరగాడుతుంది సినిమాలో. ఇతర పాత్రల్లో రమణారెడ్డి , సూర్య కాంతం,సారధి ప్రభృతులు నటించారు .

తమిళంలో సూపర్ హిట్ అయిన ‘మేజర్ చంద్రకాంత్’ సినిమా రీమేకే  ఈ తెలుగు సినిమా. ప్రముఖ దర్శకుడు కె బాలచందర్ కధ ఇది . I N మూర్తి దర్శకుడు.ప్రధానంగా అభినందించవలసింది యస్ పి కోదండపాణి సంగీతాన్ని. దేవులపల్లి వారి మరో పాట “మేడంటే మేడా కాదు..  గూడంటే గూడు కాదు” పాట చాలా బాగుంటుంది. 

ఈ  పాటను కోదం‌డ‌పాణి మొదట మహ‌మ్మద్‌ రఫీ చేత పాడిం‌చా‌ల‌ను‌కు‌న్నారు.‌ అయితే ఉచ్చా‌రణ దోషాలు వచ్చే ప్రమా‌ద‌ముం‌దని తలచి ఆ పాటను ఘంట‌సాల చేత పాడిం‌చేం‌దుకు నిశ్చ‌యిం‌చారు.‌ సినిమా ముహూర్తం రోజున విజయా గార్డె‌న్స్‌లో ఈ పాట ఘంట‌సాల పాడాల్సి ఉండగా .. ఆయన అనారోగ్యం కారణంగా రాలేదు. దాంతో బాలు చేత ఈ పాటను పాడించి రికార్డు చేశారు.‌ తనకు ఎంతో పేరు తెచ్చిన పాటగా బాలు ఈ పాట గురించి చెప్పేవారు.

అలాగే బీహార్ క్షామ సహాయంగా కాలేజిలో హరనాథ్ , వాణిశ్రీల బృంద నృత్యం ,  పాట కూడా చాలా బాగుంటాయి . ‘ఎందరు ఉన్నారు మీలో ఎందరు ఉన్నారు’ పాట హుషారుగా, సందేశాత్మకంగా సాగుతుంది. పాత సినిమాల్లో దేశభక్తి పాటల్లో గాంధీ , నెహ్రూ , నేతాజీ బొమ్మల్ని చూపి ప్రేక్షకులను ఉత్తేజపరిచేవారు. 

బాలచందర్ సినిమా రంగంలోకి రాక ముందే మేజర్ చంద్రకాంత్ నాటకాన్ని ప్రదర్శించేవారు. ఈ నాటకాన్ని’ ఊంఛే లోగ్’అనే టైటిల్ తో హిందీలో 1965 లో నిర్మించారు. హిట్ అయింది. జాతీయస్థాయిలో ద్వితీయ ఉత్తమ చిత్ర పురస్కారాన్ని పొందింది . AVM వారు ఈ హిందీ సినిమాను మేజర్ చంద్రకాంత్ టైటిల్ తో తమిళంలో నిర్మించారు.

ఆ తర్వాత మన తెలుగులో రీమేక్ అయి ఘన విజయాన్ని సాధించింది.  ఎన్‌.‌ఎన్‌.‌భట్‌ ఈ సినిమా హక్కులు కొని ‘సుఖ‌దుః‌ఖాలు’ సినిమా నిర్మిం‌చారు.‌ తెలుగు సిని‌మాలో ఈ చిత్రక‌థకు కొన్ని మార్పులు చేశారు.‌ బాల‌చం‌దర్‌ రాసిన మూల‌క‌థకు పాల‌గుమ్మి పద్మ‌రాజు స్క్రీన్‌ప్లే, సంభా‌ష‌ణలు సమకూర్చారు. 

ఇప్పటికీ తరచుగా టివి లో వస్తూనే ఉంటుంది . ఓ నెల కింద కూడా టి విలో వచ్చింది.ఏ థియేటర్లో చూసానో గుర్తు లేదు కానీ మా నరసరావుపేటలోనే చూసా. యూట్యూబులో ఉంది. తప్పక చూడవలసిన మనసు చిత్రం.ఆర్ద్రత,మనుషుల మీద ప్రేమ,లాలిత్యం అన్నీ కలబోసిన మనసు సినిమా. నాకు చాలా ఇష్టమైన సినిమా. ఈ సినిమాలో వాణిశ్రీ నటనకు ఫిదా అవుతాను చూసిన ప్రతీ సారి. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!