ఉక్రెయిన్ సేనలు తక్షణమే ఆయుధాలు వీడాలని రష్యా అల్టిమేటం జారీచేసింది. రెండో దశ యుద్ధం ప్రారంభమైందంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించిన కొన్ని గంటల్లోనే రష్యా ఈ తాజా హెచ్చరిక చేసింది.దీని సారాంశమేమంటే తమ ప్రయత్నాలకు అడ్డు పడొద్దని కోరడమే.
రష్యా సేనలు మేరియుపొల్ నగరాన్నిపూర్తిగా చేజిక్కించుకోబోతున్నాయి. ఇప్పటికే ఆ పట్టణాన్ని సర్వ నాశనం చేసారు. సైనిక చర్య పేరిట భీకర దాడులకు తెగబడుతున్న రష్యా సేనలకు ఉక్రెయిన్ సైన్యం నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతూనే ఉంది. ముఖ్యంగా ప్రధాన నగరాలను స్వాధీనం చేసుకోవడంలో రష్యా సైన్యం నానా కస్టాలు పడుతోంది.
ఉక్రెయిన్ సైనికులు ఆయుధాలు వదిలి లొంగిపోవాలని, లేకుంటే నాశనం చేస్తామని రష్యా రెండురోజుల క్రితమే హెచ్చరించింది.అజోవ్ స్టాల్ స్టీల్ మిల్ వద్ద ఉన్న ఉక్రేనియన్లకు ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు డెడ్ లైన్ పెట్టింది. అయితే ఉక్రెయిన్ సైనికులు రష్యా బెదిరింపులకు లొంగలేదు.దీంతో మరోమారు అల్టిమేటం జారీచేసింది.
రష్యా సేనలను ప్రతిఘటిస్తోన్న ఉక్రెయిన్ సైనికులను వెంటనే ఆ చర్యలను ఆపేలా ఆదేశాలు ఇవ్వాలని ఉక్రెయిన్ అధికారులకు మరోసారి సూచిస్తున్నాం. అందుకే సైనికులే స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకొని తక్షణమే ఆయుధాలు వీడాలి’ అని రష్యా రక్షణశాఖ పిలుపునిచ్చింది. మేరియుపోల్ నగరాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకునేందుకు రష్యా సైన్యం చేరువైన సమయంలో ప్రతిఘటించడం వల్ల ఉక్రెయిన్ సేనలు మరింత విపత్కర పరిస్థితుల్లో పడతారని స్పష్టం చేసింది. ఆయుధాలు వీడిన ప్రతిఒక్కరి ప్రాణాల రక్షణకు హామీ ఇస్తున్నామంటూ కూడా రష్యా ప్రకటించింది.
ఇదిలాఉంటే, ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను ఆక్రమించుకోవడంలో విఫలమైన రష్యా బలగాలు తాజాగా తూర్పు ప్రాంతాలపై దృష్టి సారించాయి. ఇదే సమయంలో తమ ప్రాంతాలను కాపాడుకునేందుకు రెండో దశ యుద్ధాన్ని ప్రారంభిస్తున్నామని ఉక్రెయిన్ పేర్కొంది. ఈ క్రమంలో చివరి అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించిన రష్యా.. మేరియుపొల్‌లో ప్రతిఘటన ఆపకపోతే భారీ స్థాయిలో నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించింది.
మేరియుపొల్ నగరాన్ని రష్యా స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. నగరంలో చిక్కుకున్న వారి కోసం మూవ్మెంట్ పాసులను రష్యా జారీ చేసింది. ఈ పాసులు ఉంటేనే ఇతర ప్రాంతాలకు వెళ్లే వీలు ఉంటుంది. లుహాన్స్క ప్రాంతం ప్రజలు కూడా సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని ఉక్రెయిన్ అధికారులు కోరారు