Gr Maharshi………………………………….
ప్రతి రచయితకి , తన పుస్తకం అంటే ఇష్టం. కొందరైతే తమవి తప్ప ఇతరులవి చదవరు. నా కొత్త పుస్తకం మార్నింగ్ షో అంటే ఇష్టం. ఎక్కువగా నా జ్ఞాపకాలే. అందుకే భయం. పేజీలు తెరవాలంటే చేతులు వణుకుతాయి.
అక్షరాల్లో కనిపించే మనుషులు , హీరోలు, హీరోయిన్లు, విలన్లు 90 శాతం మంది జీవించి లేరు. మనుషులే కాదు, నా జ్ఞాపకాల్లో వుండే థియేటర్లు, భవనాలు, చెట్లు, చివరికి కొండలు కూడా లేవు. శిథిలాల కుప్పలు. మనిషి విపరీతంగా భయపడేది జ్ఞాపకాలకే.
థియేటర్‌లో లైట్లు ఆర్పినట్టు, కళ్లు మూసుకుంటే చీకటి. నా లోపల ఉన్న ప్రొజక్టర్ ఆన్. కనురెప్పల తెరపైకి పోయినోళ్లంతా వస్తారు. వాళ్లలో అనేక మందికి ఆనవాళ్లు లేవు. ఫొటోలు లేని కాలం. ఎలా వుంటారో నాకే తెలుసు. చిత్రకారున్ని కాదు కాబట్టి, బొమ్మ గీయలేను.
మైకులో గురగురమని పాట. మట్టి రోడ్డుపై ఒంటెద్దు సినిమా బండి. అటూఇటూ ఎన్టీఆర్, కేఆర్ విజయ. భలే తమ్ముడు. పిల్లలతో పాటు ఐదారేళ్ల కుర్రాడు పరుగు తీస్తున్నాడు. మట్టి పాదాలు, పొట్టి టెర్లిన్ అంగి, నిక్కర్.బండి వెనుక చిరిగిన అంగి , ఖాకీ నిక్కర్‌తో మూగోడు.
రంగుల పాంప్లేట్స్ చేతిలో. వెంట పడిన కుర్రాడికి ఒక కాగితం ఇచ్చాడు. రెక్కల గుర్రం ఎక్కినట్టు గాలిలో ఎగురుతూ ఆ పిల్లాడు. వాడు నేనే.మూగోడికి అమ్మానాన్న లేరు. ఒక ముసలమ్మ పెంచుకుంది. నిశ్శబ్దం పుట్టుకతో వచ్చిన వరం. ఎంత గొప్ప సినిమా అయినా సైగలే. సినిమా బండికి కాపలాదారు. థియేటర్‌లో పనివాడు, ప్రేక్షకుడు. నవ్వడమే తెలిసిన వాడు.
ఒక రోజు చెట్టుకి వేలాడాడు. ముసలమ్మ గాజు కళ్లల్లో ఒకటే వాన. శవాన్ని నేను చూడలేదు. లోలకంలా అటూఇటూ కదులుతున్న మూగోడు ఇప్పుడు కూడా కనిపిస్తున్నాడు.అన్నం తప్ప ఏమీ ఆశించని వాడు, బతకడం తెలియని వాడు. బతికే తెలివిలేని వాడు. మాటరాని వాడు, వినని వాడు ఎందుకు ఆత్మహత్య చేసుకుని వుంటాడు?
అతన్ని కూడా బతకనివ్వని ఈ లోకాన్ని ఏమనాలి? కత్తుల వంతెన , విషనాగుల వంచన.
మనుషులెందుకు ఆత్మహత్య చేసుకుంటారు! ఇంత పెద్ద ప్రపంచంలో కాళ్లు మోపే స్థలం లేక, గాలిలో వేలాడతారా?
ఆత్మహత్య అనేది సీరియస్ ఫిలాసఫికల్ ప్రాబ్లమ్ అంటాడు కామూ (ది మిత్ ఆఫ్ సిసిఫస్). కానీ మూగోడికి ఫిలాసఫీ తెలియదు. ఆకలిని మించిన ఫిలాసఫీ లేదేమో!
(ఈ పుస్తకం కావలసిన వాళ్ళు నవోదయ బుక్ హౌస్ కాచిగూడ, అక్షర బుక్స్ జూబిలీ హిల్స్,విశాలాంధ్ర మధుర నగర్ లో పొందవచ్చు. లేదా 9000226618, 6304880031నంబర్ లకి 450 రూపాయలు ఫోన్ పే చేసి అడ్రస్ WhatsApp lo పంపితే పోస్టు ఖర్చు పెట్టుకుని పంపుతారు.)

