పలకరిస్తే పాట…ప్రసన్న కుమార్ సర్రాజ్!

Sharing is Caring...

Taadi Prakash ……………………………………….

Writer, singer, actor and composer_________________________  తొలికథ తోనే హిట్ కొట్టాడు. కొన్ని కథలతోనే జనం అటెన్షన్ డ్రా చేసాడు. 1998 లో డెట్రాయిట్ ఆటా సభలకోసం తెచ్చిన ‘చిరునవ్వు’ ప్రత్యేక సంచికలో ప్రసన్నకుమార్ కథ వేశాం. అక్కడ ప్రసన్నని పరిచయంచేస్తూ ఆర్టిస్ట్ మోహన్ ఇలా రాశారు.. నలుగురు పాతబస్తీ దాదాలతో ప్రసన్న కలిసి నడిస్తే వాళ్లలో ఒకడనే అనుకుంటాం.అలా కాకుండా ఒక్కడే నడిచి వస్తే గనక పాతబస్తీ దాదాయే అనుకుంటాం.లావుపాటి ఎత్తుపాటి మానవుడు.బొజ్జ అదనపు ఆకర్షణ.చొక్కా చేతుల్ని దండ దగ్గరికి మడుస్తాడు.

ఆ మడతల్లోంచి తీరిగ్గా గుట్కా పొట్లాలు తీస్తుంటాడు.దెబ్బలాటలు మానేసి ఇంట్లో కూర్చుని పొట్లాలు తింటున్న బాపతులా ఉంటాడు.ఇతను పాడతాడన్నా,నవ్వుతాడన్నా ఎంచక్కా ఎకార్డియన్ వాయిస్తాడన్నా ఎవరూ నమ్మరు.కథలు రాస్తాడంటే అందులోనూ హాస్యం పండిస్తాడంటే అనుమానంగా చూస్తారు.ప్రసన్న కుమార్ సర్రాజు అర్జంటుగా ఎం. ఎ ఫిలాసఫీ చదివేసి,పెళ్లికి ముందే తొందరపడి ఫిలాసఫర్ గా మారిపోయాడు.గడ్డం పెంచి గుంభనంగా నవ్వడంలో గొప్ప చమత్కారం సాధించి చదువును సార్థకం చేసుకున్నాడు.

ఆర్ట్ పేరుతో సాగదీసి వీర బోర్ కొట్టించే సినిమాల పనిపడుతూ ప్రసన్న రాసిన భూమత్స్య గుండ్ర కథ సూపర్ హిట్ అయ్యింది. ప్రసన్న కథ చెప్పే తీరు ఎమ్డన్ గా వుంటుంది. మనం పడీ పడీ నవ్వుకునే ఏర్పాటు ఆయన పకడ్బందీగా చేస్తాడు.పెద్ద హోటళ్ళలో పాటలు పాడీ పాడీ విసిగెత్తాక సినిమా వైపు చూసాడు. ‘వాలుజడ తోలు బెల్టు’ సంగీత దర్శకులు. ఇంకా ఆ సినిమా సంగీతంలోనే జీవిస్తున్నారు. భద్రంకొడుకో, ఆలీబాబా అరడజను దొంగల్లో ప్రసన్న ఆకారానికి తగిన పాత్రలు పొంది విలన్ గా రాణించారు. బతకడం కోసం ఎన్ని పిల్లి మొగ్గలేసినా రాయడం ఆయన ఆత్మకి నచ్చిన పని.

సైగల్ పాట పాడాడా… ఆ పాట మన తనువంతా అల్లుకుపోతుంది. ప్రసన్న పాన్ బిగించి హార్మోనియం ముందు కూర్చున్నాడా… ఆ రాత్రి పాత పాటల మాధుర్యంతో పులకరించిపోతుంది.తాను బాగా చదువుకున్న విషయం ఆయన రెండో కంటికి కూడా తెలియనివ్వడు. లో ప్రొఫైల్ కయినా ఓ హద్దుండాలేమో. చిన్నగా జోకేస్తాడు. పెద్దగా పట్టనట్టు వుండడాన్ని వృత్తిగా వృద్ధి చేసిన వాడు. వెర్రి లోకాన్ని జాలిగా చూసినా వళ్ళంతా నిండి వున్న వెక్కిరింపు కథల్లో పండుతుంది. సిద్ధాంతమును పట్టుకుని వేలాడుట అనే సెరికల్చర్ కి బాగా దూరం.సభలకి రాడు. సన్మానాలమీద బొత్తిగా గౌరవం లేదు.

బతుకంటే ఎంత సీరియస్సో అంత హేళన. స్నేహితులంటే ఎంత సరదానో అంత ప్రేమ.ఒక సోలో సాంగ్ లాగా బతికేయడంప్రసన్నకే చేతనవునేమో.తెలుగు కథల హాస్యం లెవెల్ పెంచిన ప్రసన్నజుట్టు దువ్వుకోకుండా గడ్డం పెంచుకుని, అరమోడ్పు కళ్ళేసుకుని అకార్డియన్ పట్టుకుని నించున్నాడు ఆ అబ్బాయి. పక్కన గిటారిస్ట్. అటు ఇటూ బ్యాంగోస్, కాంగోస్ ఇంకా అన్నీ. అయితే ఉక్రేనియన్ బొమ్మల కథల్లో ఒసాక్ చొక్కా ప్యాంటేసుకున్న నక్క బలాలయికా వాయిస్తుంటే పక్కనే అకార్డియన్ పట్టుకుని ఇకిలించే కుందేలు గుర్తొచ్చి నవ్వొచ్చింది.

కుర్రవాడు ఎవరో గుండ్రంగా, చిత్రంగా ఉన్నాడనిపించింది. తర్వాత పరిచయం ఎందుకో, ఎలాగో అయ్యింది. అది 1970 వ దశకం ప్రథమార్థం.విజయవాడలో మాక్కొంచం పరమార్థం దక్కుట.సాయంత్రమయితే చాలు ప్రసన్న అతని మిత్రులు మ్యూజిక్ కన్ సర్ట్ కి రెడీ. కన్ సెర్ట్ అంటే చయకోవిస్కీ, బితోవెన్ లాంటి వరస కాదు. జనం కోరేది మనం శాయడం లాంటి మేళం. నేను అండ్ మిత్రులు కూడా మూగేవాళ్ళు.

మేమంతా విశాలంధ్ర జర్నలిస్టులం. రెడ్ బ్రాండ్ మతస్థులం. ఈయన మత రహిత, కుల రహిత సకల సహిత సంగీతస్థులు. కళాపోషన అనే కామన్ గ్రౌండ్ వుందిగా కలిసిపోయాం. మేళం లేని కాలంలో మా ఇంటికి రావడం. ఈయన హర్మోనియం( మా ఏలూర్లో దీని అసలు పేరు ఆర్మని) వేసుకొచ్చేవాడు. పక్కింట్లో నా హైస్కూల్ క్లాస్ మేట్ శేషుబాబు, శిరీష వుండేవారు. శేషు తబలిస్టు. స్కూల్లో మా బెంచి వాడ్ని చూసి గడగడలాడేది.

ప్రసన్న వచ్చినప్పుడు కబుర్లు, నవ్వులు, సరదాల తర్వాత ఆర్మనీతో పాటలు మొదలయ్యేవి. మేళంలో పురజనుల కోరికపై ఒకటే పాట రెండోసారి కాకుండా తోచినవి పాడేవాడు. చుట్టూ చేరే ముగ్గురునలుగురమే అయినా పురజనులం కాకపోతామా? కనక ప్యాసా అని నసిగే వాడిని. ఇంకొకళ్ళు కాగజ్ కే ఫూల్ అని రెట్టించేవారు. ఒక హేమంత్ కుమార్ అని ఒకళ్ళు, సైగల్ అని మరొకళ్ళు కిట్టించే వాళ్ళు.

ఆర్మని పెట్టె పక్కన దొంగగా పెట్టుకున్న స్టీల్ గ్లాస్ దన్నుతో అన్నీ పాడేసేవాడు ప్రసన్న. వహ్వా వాహ్వా అని కడుపులోనే అరుచుకుని పైకి మూగిగా, గంభీరంగా వినేవాళ్ళం.అలా డజన్ల, పాతికల, వందల రాత్రులు దొర్లి డుల్లిపోయాయి. ప్రసన్న ఇంటికి వెళితే (ఇల్లు కాది, మూడు పరకల జనం వుండేవాళ్ళు) పీనట్స్ కామిక్ బుక్స్ కనిపించేవి. చార్లీ బ్రౌన్ లూసీ వాళ్ళ మగధీర గంభీర కుక్క పిల్లా జోకులు గుర్తుచేస్తే గాట్టిగా నవ్వేసేవాడు.

మ్యూజిక్కూ, పాటల వాళ్ళూ ఇలాంటివి కూడా చదువుతారా అని వింతగా వుండేది.కొన్నేళ్ళకో చిత్రం జరిగింది. ఆంధ్రజ్యోతి వీక్లీలో భూమత్స్యగుండ్ర కథ వచ్చింది. పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు వేసారంటే శానా గొప్ప కదా మరి. మై బహుత్ కథా రచయిత హూ అని ప్రసన్న సరదాకి కూడా చెప్పలేదేమా? అనుకున్నా. మనిషి అంత గుట్టు ఔర్ గుంభన్. మేమంతా బాగా ఎక్స్ ట్రా. ప్రసన్న అంతా చాలా ఇంట్రా. ఇంగ్లీషులో ఎక్సాట్రవర్ట్ అనీ, ఇంట్రావర్టనీ అంటారుకదా అదన్నమాట.

అప్పుడు ప్యారలర్ సినిమాలు ఉద్యమంలాగా వచ్చేవి. (ప్యారేలాల్ అని రాద్దామనుకున్నా కానీ అదే సినిమా పేరు అనుకుంటారని స్పెల్లింగ్ మార్చడమైనది.) చాలా మంచి సినిమాలు ఎన్నో వచ్చాయి. కానీ ప్రసన్న వంకర దృక్పథ ధారి అయి వాటిని వెటకారం చేస్తూ రాసిన భూమత్స్య గుండ్ర పెద్ద హిట్టు. ఉత్తరాల మీద ఉత్తరాలు వచ్చి పడ్డాయి. ఆషామాషీ కాదు. బాపు, ముళ్ళపూడి కూడా పొగిడేసారు.

ముత్యాలముగ్గు ప్రొడ్యూసర్ లాంటి రచయిత ఎమ్వీఎల్ కూడా బండికట్టుకుని నూజివీడు నుంచి వచ్చేసాడు. అందరూ కనకదుర్గా బార్ అండ్ మ్యూజిక్ మేళం దగ్గర చేరితే ప్రసన్న బిల్లులు కట్టుకునేవాడు.సక్సెస్ కష్టాలు సక్సెస్ వి. అది 1979 సంవత్సరం మొదట్లో. న్యూస్ పేపర్ వాళ్ళయితే తెలుగు కథాకాశంలో నూతనతార ప్రత్యక్షం అని హెడ్డింగ్ పెడతారన్నమాట. మన మ్యూజిక్ మేన్ కథల మ్యాజిక్ మేన్ గా అవతారమెత్తాడు.

ఏడాది ఒకటి, ఒకోసారి రెండూ కథలు కూడా యమ స్పీడుగా రాసేస్తున్నాడు. అచ్చయిపోతున్నాయి. ఏడాది తిరిగేసరికి నేను హైదరాబాద్ వచ్చేసా. ప్రసన్న మాత్రం కొద్ది కాలం బెజవాడలోనే బ్రూడింగ్ చేసి అటూఇటూ చూసి మద్రాస్ చెక్కేసాడు.

కామన్ ఫ్రెండ్స్ కలిసినప్పుడు కబుర్లు చెప్పడం తప్పితే దశాబ్ద కాలానికి పైగా కలిసింది లేదు. ఆంధ్రప్రభ, ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో రెండేళ్ళో, ఎంతో కార్టూన్లు వేసి తర్వాత ఉదయం డైలీలో చేరాను. ఆ పేపర్ ఇంకా రాలేదు. తిరుపతి నుంచి పతంజలి, ప్రకాశ్ వచ్చి చేరారు. ఏడాదికో, ఎప్పుడో రాబోయే ఉదయంకి జర్నలిస్టుల ట్రైనింగ్ క్లాసులు. ఇంగ్లీషు వార్తలని తెలుగులో అనువాదం చేయడానికి ప్రకాశ్ ట్రైనింగ్ ఇచ్చేవాడు.

అంతా కాలేజి నుంచి వచ్చిన ఫ్రెషర్స్. పతంజలి, నేనూ వేరే రూములో వుండే వాళ్ళం. ట్రైనీల్లో చాలా మంది అబ్బాయిలు, అంతే చాలమంది అమ్మాయిలూ వుండేవాళ్ళు. క్లాసులు అయిపోయిన తర్వాత సాయంత్రం కుర్రాల్లంతా విక్టోరియా కేఫ్ లో చేరి అమ్మాయిల గురించి మాట్లాడుకునేవారు.

మామూలేగా. వాళ్ళ మాటల్లో అనురాధ అనే పేరు చాలా సార్లు విన్నా. ఒక సారి కార్టూనిస్ట్, సితారిస్ట్, బ్యాంక్ ఉద్యోగిస్ట్ అయిన మల్లిక్ వచ్చి నాతో కబుర్లు కొడుతూ మా అనురాధ ఇక్కడే వుందటగా అన్నాడు. విన్నానన్నా. తనకి చెల్లాయి వరస అవుతుందని చెప్పాడు. తర్వాత ఎప్పుడో చూసా. అందం మామూలే కానీ మామూలు ఆడపిల్లలా లేదు. మనిషి ఎనర్జిటిక్ గా వుంది. ఉదయం పేపరు వచ్చేవరకు వుండలేదు. వెళ్ళిపోయింది. చాలా ఏళ్ళ తర్వాత తెలిసింది అనురాధ మదరాసులో తేలిందని. మహిళ పత్రికకి ఎడిటర్ కూడానట.

కొంతకాలానికి మరో వార్త. ప్రసన్న, అనురాధ పెళ్లి చేసుకున్నారని. ది వాల్డ్ ఈజ్ వెరీ స్మాల్ గురూ! మోహన్ హైదరాబాద్ కొచ్చాడు .మద్రాస్ మ్యూజిక్కూ, సినిమా పని హైదరాబాద్ కు షిఫ్ట్ అయింది. ప్రసన్న నగరప్రవేశం. మద్రాసు లో ఉండగానే బాగా జబ్బుచేసి భార్య అనురాధ చనిపోయింది.

కొడుకు కూతురు తో ఒంటరిగా మిగిలిపోయాడు. దిగులు ముసిరిన రాత్రులలో ఆయనకు తోడు ఒక హార్మోనియం, కొన్ని పాటలు. పిల్లలే ప్రాణం. ఎన్ని తిప్పలు పడ్డాడో. వాళ్ళని బాగా చదివించాడు. పెళ్లిళ్లు చేశాడు. ఇద్దరూ హాయిగా సెటిల్ అయ్యారు. మళ్లీ ఒంటరి తనం. అయినా ఆ జూబ్లిహిల్స్ లోని అపార్ట్ మెంట్లో మనల్ని అందరినీ నవ్వించే హాస్యకథలు రాసుకుంటూ ఒంటరి విషాదగీతంలా మిగిలిపోయాడు 70 ఏళ్ల ప్రసన్న.

నెలకో రెన్నెల్లకో మోహనూ,తల్లావజుల శివాజీ, శివలెంకపావనీప్రసాదు, నేను ప్రసన్నని కలిసేవాళ్లం. కొన్ని పాటలు… కొన్ని పెగ్గులు. పావనీప్రసాద్ మంచి తబలిస్ట్. పాతపాటల స్పెషలిస్ట్. మర్చిపోలేని సంగీత కచేరీలవి. మోహన్ మరోనెల తర్వాత చనిపోతాడనగా ప్రసన్నని రమ్మని పిలిచాను. అపుడు ఒకవారం రోజులు మోషే ఉష ఇంట్లో ఉన్నాడు మోహన్.వాళ్ళు ఉండేది రెండో అంతస్థు మెట్లెక్కడం ప్రసన్న కి చాలా కష్టం.

అతి కష్టంమీద పైకివచ్చి మంచందగ్గరగా కూర్చుని హార్మోనియం పక్కన పెట్టుకుని మోహన్ కి ఇష్టమైన పాటలన్నీ పాడాడు. మోహన్ ఇక కొంతకాలమే ఉంటాడనీ, బ్రతికే అవకాశం లేదనీ నాకొక్కడికి మాత్రమే తెలుసు. ప్రసన్న పాటలు వింటున్న మోహన్ ని చూస్తే నాకు కన్నీళ్ళాగలేదు. మోహన్ ప్రసన్నల 47 ఏళ్ల పరిచయం, స్నేహం, అభిమానం ప్రేమలకి అదే ఆఖరిరోజు.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!