వీల్ చైర్ లోనే దీదీ ఎన్నికల ప్రచారం !

Sharing is Caring...

తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కాలికి ఫ్రాక్చర్ అయిన కారణంగా వీల్ చైర్ లోనే ఎన్నికల ప్రచారం చేయబోతున్నారు. నందిగ్రామ్ లో తోపులాట సందర్భంగా దీదీ కాలుకి గాయమైంది.తర్వాత ఆమె కోల్‌కతా ఆసుపత్రిలో చికిత్స పొందారు. డాక్టర్లు మరో రెండు రోజులు రెస్ట్ అవసరమని చెప్పినప్పటికీ ఆమె డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకున్నారు. ఇవాళ నుంచి రోడ్ షోలు మొదలు పెట్టనున్నారు. ముందుగా కోల్ కతా లోని  గాంధీ విగ్రహం నుంచి హజ్రా వరకు పెద్ద  రోడ్  నిర్వహిస్తున్నారు. సోమవారం నుంచి  మరికొన్నిరోడ్ షో లు నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే మరి కొన్నిబహిరంగ సభల్లోనూ దీదీ ప్రసంగించనున్నారు.పురూలియా జిల్లాలోని బాగ్ ముండీ జల్దా ప్రాంతంలోనూ , బలరాంపూర్ రతటాల  ప్రాంతంలో దీదీ బహిరంగసభల్లో పాల్గొనాల్సి ఉంది. అలాగే బంకురా, జార్గ్రామ్ జిల్లాలలో కూడా మమతా ఎన్నికల ప్రచారం చేపట్టాల్సి ఉన్నది. ఈ జిల్లాలకు హెలికాప్టర్ ద్వారా వెళ్లి ప్రచారం చేయనున్నారు.  కాగా పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ను ఆదివారం విడుదల చేయాల్సిఉండగా..  అనివార్యకారణాల ఆ కార్యక్రమాన్ని వాయిదా వేశారు.

ఇదిలా ఉంటే మమతా బెనర్జీ గాయపడటాన్ని తృణమూల్ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ ఘటనను రాజకీయ ప్రత్యర్థుల కుట్ర అని ఆరోపించారు. ఇక సీఎం మమత బెనర్జీపై దాడి జరగలేదని  కేంద్ర ఎన్నికల కమిషన్ నియమించిన ప్రత్యేక పరిశీలకులు తేల్చిచెప్పారు. ప్రమాదవశావత్తూ మమతకు గాయాలయ్యాయని, కారు డోర్ తగిలి ..  కాలికి దెబ్బ తగిలిందని అంటున్నారు. మమతపై దాడి జరిగిందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని ప్రత్యేక పరిశీలకులు చెబుతున్నారు.కాగా మమతా విమర్శకులు కూడా సీఎం చుట్టూ పోలీసులు ఉండగా దాడి ఎలా జరుగుతుందని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సలహా మేరకు దీదీ జరగని దాడిని జరిగినట్టు ప్రచారం చేస్తున్నారని  విమర్శిస్తున్నారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే సింపతీ కోసం దీదీ పదేపదే దాడి అంటున్నారని ఆరోపిస్తున్నారు. అయితే ఈ విమర్శలను మమతా అసలు పట్టించుకోలేదు. వీల్ చైర్ లోనే ప్రచారానికి సిద్ధమయ్యారు. మార్చి 27 నుంచి 8 దశల్లో ఎన్నికలు జరుగుతాయి. మే 2 న ఫలితాలు వెలువడుతాయి. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!