ప్రభుత్వాన్ని కూల్చడానికి లేదా అస్థిర పరచడానికి లేదా ప్రభుత్వంలోని కీలక వ్యక్తులను అంతమొందించడానికి చేసే వ్యూహరచనను కుట్ర గా పరిగణించవచ్చు.మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో చాలా కుట్ర కేసులు నమోదు అయ్యాయి.
వాటిలో ప్రధానమైనవి నాలుగు కుట్ర కేసులు. అవి పార్వతీపురం కుట్ర కేసు, సికింద్రాబాద్ కుట్రకేసు,రాంనగర్ కుట్రకేసు , ఔరంగాబాద్ కుట్రకేసులు. వాటి పూర్వాపరాలు ఇలా ఉన్నాయి.
పార్వతీపురం కుట్ర కేసు ….
సాయుధ పోరాటం ద్వారా ప్రభుత్వాన్ని కూలదోసే కుట్ర చేశారని 1970లో ఈకేసు నమోదు అయింది. ప్రధానంగా శ్రీకాకుళ గిరిజన రైతాంగ పోరాటంలో పాల్గొన్న, సానుభూతి చూపిన సుమారు 148 మందిపై కేసులు పెట్టారు.
ఈ కేసులో బెంగాల్ కి చెందిన నక్సలైట్ నాయకుడు కానూ సన్యాల్ ను మొదటి ముద్దాయిగా చూపారు. ఈ కేసులోనే తరిమెల నాగిరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావులను మద్రాసులో అరెస్ట్ చేశారు. ఈ కేసును కేసు విచారించిన విశాఖపట్నం రెండో అదనపు సెషన్స్ జడ్జి 15 మందికి జీవిత ఖైదు విధించారు.
మరో పది మందికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు. 50 మందిని నిర్దోషులుగా ప్రకటించారు. జీవిత ఖైదు పడిన వారిలో సౌరెన్ బోస్, ఒరిస్సాకు చెందిన నాగభూషణ్ పట్నాయక్ (ఇంతకుముందు మరొక కేసులో మరణశిక్ష పడింది ) చౌదరి తేజేశ్వరరావు, దుప్పల గోవిందరావు, హేమచంద్ర పాణిగ్రాహి..తదితరులు ఉన్నారు.
పార్వతీపురం కుట్ర కేసులో పలువురు నక్సల్స్ నేతలకు శిక్ష పడటం తో నక్సలైట్ ఉద్యమం తొలి దశ భారీ కుదుపుకు లోనైంది. అంతటితో ఉద్యమం ముగిసి పోయిందని భావించారు. కానీ అనూహ్యంగా పుంజుకుంది.
సికింద్రాబాద్ కుట్ర కేసు…………….
ఇందులో పలువురు వామపక్షనాయకులు, విప్లవ నాయకుల మీద కేసు పెట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్‌లో కుట్ర చేశారనే ఉద్దేశంతో దీనికి ‘సికింద్రాబాద్ కుట్ర కేసు’ అని పేరు పెట్టారు.
ఈ కుట్రకేసుకు సంబంధించి 1974లో ఎఫ్‌ఐఆర్ దాఖలయింది.1971 నుండి వరంగల్, ఖమ్మం, నల్లగొండ, మెదక్ ఇంకా కొన్ని ప్రాంతాల్లో జరిగిన బహిరంగ సమావేశాలు, సభలు, ఊరేగింపులు, వాటికి ముందు జరిగిన హింసాత్మక ఘటనల ఆధారంగా ఈ కుట్ర కేసు నమోదు చేశారు.ఈ కేసులో 46 మంది పై కుట్ర, రాజద్రోహ నేరం అభియోగాలు మోపారు.
550 మందిని సాక్షులుగా నమోదు చేసారు. నాటి నక్సలైట్ నేత కొండపల్లి సీతారామయ్య, కేజీ సత్యమూర్తిలతో పాటు విప్లవ రచయితల సంఘం సభ్యులైన కె.వి.రమణారెడ్డి, త్రిపురనేని మధుసూదనరావు, వరవరరావు, చెరబండరాజు, ఎం.టి.ఖాన్‌లను ఈ కుట్ర కేసులో నిందితులుగా పేర్కొన్నారు.
ఈ కేసులో నిందితుల తరపున ప్రముఖ న్యాయవాది కన్నాభి రాన్ వాదించారు. ప్రజాస్వామ్యంలో సమావేశాలు పెట్టుకునే హక్కు, అభిప్రాయాలు కలిగి వుండటం, వ్యక్తీకరించడం, వ్యక్తిగత స్వేచ్ఛ, నిరసన తెలిపే హక్కు అంశాలు మౌలికమైనవి కన్నాభి రాన్ కోర్టుకు వివరించారు. 1989 ఫిబ్రవరి 27న సెషన్స్ కోర్టు సికింద్రాబాద్ కుట్ర కేసులో ప్రాసిక్యూషన్ సరియైన సాక్ష్యాలు సేకరించలేదని అభిప్రాయపడుతూ అందరినీ నిర్దోషులుగా ప్రకటించింది.
రాంనగర్ కుట్ర కేసు………….
1986లో ప్రభుత్వాన్ని కూలదోయడానికి కుట్ర పన్నారంటూ 45 మంది విప్లవోద్యమ నాయకులు, విప్లవ రచయితలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. వారిలో 17 మందిపై చార్జిషీట్ దాఖలు చేశారు.ఈ 45 మందిలో కొండపల్లి సీతారామయ్య వంటి నక్సల్స్ నేతలు, వరవరరావు తదితర విప్లవ రచయితలను నిందితులుగా పేర్కొన్నారు. ఆ తర్వాత 1995లో కొండపల్లి సీతారామయ్యపై కేసు ఉపసంహరించుకున్నారు.
కేసు విచారణ జరిగిన ఈ సుదీర్ఘ కాలంలో కేవలం వరవరరావు, సూరిశెట్టి సుధాకర్‌లు మినహా మిగిలిన నిందితులంతా మరణించారు.ఈ కేసులోనూ కన్నబిరాన్ ముద్దాయిల తరపున వాదించారు. గతంలోనే ఇలాంటి ఆరోపణలు చేయగా, ఆ కేసులో కూడా నిరపరాధులుగా బయటపడ్డారని వాదించారు. 2003 సెప్టెంబర్‌లో నిందితుల్లో మిగిలిన వరవరరావు, సూరిశెట్టి సుధాకర్‌లు ఇద్దరినీ నిర్దోషులుగా పేర్కొంటూ కోర్టు కేసు కొట్టేసింది.
ఔరంగాబాద్ కుట్రకేసు …….
గంటి ప్రసాదంతో పాటు విరసం కన్వీనర్ పినాకపాణి, సభ్యులు యమసాని సురేందర్, చెంచయ్య, ఎన్. వేణుగోపాల్, రవికుమార్ లను 2005 లో అరెస్ట్ చేశారు. IPC సెక్షన్ 120 (B), 121 (A) 122 కింద కేసు నమోదు చేశారు. ఈ కేసును రుజువు చేసేందుకు నమ్మ దగిన ఆధారాలు లేవని న్యాయమూర్తి పేర్కొన్నారు.
అంతే కాకుండా నిందితులు ఆయుధాలు,మందుగుండు సామగ్రిని సేకరించినట్లు లేదా భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి ఎలాంటి సన్నాహాలు చేసినట్లు సాక్ష్యాలు లేవని న్యాయమూర్తి నమ్మి కేసును కొట్టివేశారు. ఇలాంటి కేసులే దేశవ్యాప్తం గా మరి కొన్ని ఉన్నాయి. వాటి గురించి మరోమారు చెప్పుకుందాం.