ప్లాస్టిక్ తో పెనవేసుకున్న ప్రేమ !

Sharing is Caring...

Is the ban enforceable ?………………………………………

ప్లాస్టిక్ వాడకం పర్యావరణానికి ముప్పని తెలిసినా దొంగ చాటు విక్రయాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. నింగీ, నేలా, గాలి , నీరు కాలుష్యంతో  నిండి పోతున్నాయి.  సముద్రాలను సైతం ప్లాస్టిక్‌ వ్యర్థాలతో ముంచేస్తున్నారు. ప్లాస్టిక్ వల్ల లక్షల కొద్దీ  పక్షులు,అనేక మూగ జంతువులు ప్రాణాలు వదులుతున్నాయి.

భూమి అంతర్భాగంలో కరగలేక విషవాయువులు వెలువరిస్తూ మన ఊపిరితిత్తులు తినేస్తున్నా మనలో చాలామందికి ప్లాస్టిక్‌ పైన మమకారం చావట్లేదు. ఈ ఏడాది జులై 1 నుంచి ప్లాస్టిక్ నిషేధం పై కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. పెరుగుతున్న ప్లాస్టిక్ వాడకాన్ని అరికట్టేందుకు  సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ ను ప్రభుత్వం నిషేధించింది. 

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే… ఒక్కసారి మాత్రమే ఉపయోగించే ప్లాస్టిక్‌తో తయారు అయిన ఉత్పత్తులు. ఈ కేటగిరీలో వస్తువుల ప్యాకేజింగ్ మెటీరియల్, సీసాలు, షాంపూ, డిటర్జెంట్, సౌందర్య సాధనాలు, పాలిథిన్ బ్యాగ్‌లు, ఫేస్ మాస్క్‌లు, కాఫీ,టీ కప్పులు, క్లాంగ్ ఫిల్మ్,  బ్యాగ్‌లు, ఫుడ్ ప్యాకేజింగ్ కవర్స్ వంటి ఉత్పత్తులు ఉన్నాయి.

అలాగే నిషేధిత జాబితాలో… సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్లాస్టిక్ స్టిక్స్ ఇయర్‌బర్డ్స్‌‌తో పాటు బెలూన్స్‌లో వినియోగించే ప్లాస్టిక్ స్టిక్స్, ప్లాస్టిక్ బ్యాగ్స్, క్యాండీ స్టిక్స్, ఐస్‌క్రీమ్ స్టిక్స్, డెకరేషన్‌లో  ఉపయోగించే థర్మోకోల్, ప్లాస్టిక్ ప్లేట్స్, కప్స్, గ్లాసులు, ప్లాస్టిక్ కత్తులు, ఫోర్క్స్, స్పూన్స్, స్ట్రాలు వంటివి  ఉన్నాయి.

వీటితోపాటు స్వీట్ బాక్సులు, ఇన్విటేషన్ కార్డ్స్, సిగరెట్ ప్యాకెట్స్ ప్యాకింగ్‌కు వినియోగించే ప్యాకేజింగ్ మెటీరియల్ ,ప్లాస్టిక్ లేదా పీవీసీ బ్యానర్లు ఉన్నాయి. సింగల్ యూజ్ ప్లాస్టిక్  వస్తువులను విక్రయించకూడదనే షరతుతో వాణిజ్య లైసెన్స్‌లను జారీ చేయాలని ప్రభుత్వం  అధికారులను ఆదేశించింది. మరీ ముఖ్యంగా నిషేధిత జాబితాలో వస్తువులను విక్రయిస్తున్నట్లు తేలితే ఆయా సంస్థల వాణిజ్య లైసెన్స్‌లను రద్దు చేస్తారు.

కాగా ఏపీ సర్కార్  ప్లాస్టిక్‌ ఫ్లెక్సీల వినియోగంపై ఇటీవలే  బ్యాన్‌ ప్రకటించింది.ప్లాస్టిక్‌ ఫ్లెక్సీల బ్యాన్‌ ను తొలి అడుగుగా సీఎం జగన్‌ అభివర్ణించారు. 2027 కల్లా ఏపీని ప్లాస్టిక్‌ ఫ్రీ స్టేట్‌గా మారుస్తామని సీఎం  ప్రకటించారు. బట్టలతో చేసిన  ఫ్లెక్సీలకు మాత్రమే అనుమతి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటె ఏళ్ల తరబడి ప్రభుత్వం ఎంత ప్రచారం చేసినా… దశల వారీగా నిషేధం ప్రకటిస్తున్నా  ప్లాస్టిక్ వినియోగం తగ్గలేదు. పర్యావరణానికి పెద్ద ఎత్తున ముప్పు ఉందని తెలిసినా ప్రభుత్వం కూడా ఉదాశీనత తో వ్యవహరిస్తోందనే విమర్శలున్నాయి.

 ప్లాస్టిక్ వాడకం తగ్గించాలంటే ఉత్పత్తి తగ్గించడం ఒక మార్గం. ఉత్పత్తి నియంత్రణపై స్థానిక ప్రభుత్వాల అజమాయిషీ లేని పరిస్థితిల్లో రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవచ్చు. లైసెన్సింగ్ విధానంలో మార్పులు తీసుకురావాలి.

దూరదృష్టి, సమగ్ర ఆలోచన లేకనే ప్రభుత్వం నిషేధం విధించడాన్ని సులువైన మార్గంగా ఎంచుకున్నది. అందులోనూ పెద్దగా వ్యతిరేకత రాని ఉత్పత్తులు, సామాన్యులకు ఉపయోగపడే వస్తువుల మీద మాత్రమే. నిషేధ పద్ధతి అమలు కూడా సరైన ప్రణాళికతో చేయడం లేదని పర్యావరణ వేత్తలు విమర్శిస్తున్నారు. ప్రజల్లో అవగాహన బాగా పెరిగితేనే కానీ, ప్లాస్టిక్ కి వారు దూరం కారు. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!