Lost their lives………………………………………..
చాపర్స్ కి అడుగడుగునా గండాలు ఎదురవుతుంటాయి. హెలికాఫ్టర్లకు ప్రధాన శత్రువు వాతావరణమే. కొన్ని ప్రాంతాల్లో వాతావరణం తరచు మారిపోతుంటుంది. అలాంటి ప్రాంతాల్లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ప్రమాదాల కారణంగా భారత్ డిఫెన్స్ సర్వీసెస్ ఉన్నతాధికారులు ఎందరో ప్రాణాలు కోల్పోయారు.ఊహించని ఈ ప్రమాదాలు.. మరణాలు విచారకరం.
జనరల్ బిపిన్ రావత్ వంటి ఉన్నత స్థాయి అధికారి మరణించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా జరిగాయి. 1963లో జరిగిన ప్రమాదంలో ఆరుగురు, 1997లో నలుగురు, 2011లో 17 మంది అధికారులు చనిపోయారు.నవంబర్ 1963లో జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ సమీపంలో జరిగిన ప్రమాదం అప్పట్లో దేశం దృష్టిని ఆకర్షించింది.
యాభై ఎనిమిది సంవత్సరాల క్రితం, జమ్మూకాశ్మీర్‌లోని పూంచ్ సమీపంలోని గుల్పూర్‌లో వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్ నవంబర్ 22 మధ్యాహ్నం కుప్పకూలింది.ఈ ఛాపర్లో ఉన్న ఆర్మీ, వైమానిక దళానికి చెందిన ఐదుగురు సీనియర్ అధికారులు అక్కడికక్కడే మరణించారు.
ఈ ఘటనలో పశ్చిమ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ దౌలత్ సింగ్; ఎయిర్ వైస్-మార్షల్ EW పింటో, ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్, వెస్ట్రన్ ఎయిర్ కమాండ్; లెఫ్టినెంట్ జనరల్ బిక్రమ్ సింగ్, కార్ప్స్ కమాండర్, వెస్ట్రన్ కమాండ్, మేజర్-జనరల్ NKD నానావతి, బ్రిగేడియర్ సిరి రామ్ ఒబెరాయ్ లతో పాటు హెలికాప్టర్ పైలట్ లెఫ్టినెంట్ ఎస్ఎస్ సోధి కూడా మరణించారు.
అపుడు కూడా పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. మిలిటరీ అధికారుల నుంచి విషయం తెలియగానే అప్పటి రక్షణ మంత్రి వై.బి.చవాన్ లోక్‌సభ లో ప్రమాద ఘటన గురించి ప్రకటన చేశారు. పూంచ్‌లో రెండు హెలికాప్టర్లు అందుబాటులో ఉన్నప్పటికీ వాతావరణం అనుకూలించకపోవడంతో ప్రమాద స్థలానికి వెంటనే చేరుకోలేకపోయారు. మూడు నెలల తర్వాత విచారణ జరిపిన కమిటీ టెలిఫోన్ వైర్లకు హెలికాప్టర్ తగలడమే ప్రమాదానికి కారణమని నివేదికలో పేర్కొంది.
తవాంగ్‌లో రెండు ప్రమాదాలు
1997 నవంబర్ 14న అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ జిల్లాలోని లుంగర్ సెక్టార్‌లో జరిగిన ప్రమాదంలో అప్పటి కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి ఎన్‌విఎన్ సోము..ఒక మేజర్ జనరల్‌తో సహా ముగ్గురు అధికారులు మరణించారు. హెలికాప్టర్ శిథిలాలు.. నలుగురి మృతదేహాలు మంచులో కూరుకుపోయాయి. 4,000 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో మృత దేహాలను కనుగొన్నారు.
2011 లో MI-17 హెలికాప్టర్ అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సమీపంలోని బోమ్‌దీర్ దగ్గర కూలిపోయింది, లెఫ్టినెంట్ కల్నల్ స్థాయికి చెందిన ఆర్మీ అధికారితో సహా 17 మంది రక్షణ సిబ్బంది మరణించారు.