విశాఖ రిషి కొండ బీచ్ వద్ద తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఈ నెల 13 న ప్రారంభం కానుంది. అందం .. ఆధ్యాత్మికత కలబోత గా ఈ దేవాలయం పర్యాటకులను ఆకర్షించనుంది. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఈ ఆలయ నిర్మాణ పనులను 2018 లో ప్రారంభించింది. సుమారు 10 ఎకరాల భూమిలో రూ. 26 కోట్ల అంచనా వ్యయంతో పనులు మొదలు పెట్టారు.
విగ్రహ ప్రతిష్ఠ .. మహా సంప్రోక్షణ …అంకురార్పణం వంటి కార్యక్రమాలు ఆగస్టు 9 నుంచి 13 వరకు జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగస్టు 13 న ఈ ప్రారంభోత్సవానికి హాజరు అవుతారు. ఆగస్టు 13 తర్వాత భక్తులను దర్శనానికి అనుమతించే అవకాశం ఉంది. తిరుపతి నుండి వచ్చే పూజారుల బృందం అవసరమైన కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.
తిరుపతి ప్రధాన దేవాలయం మోడల్ నే ఈ ఆలయ నిర్మాణంలో అనుసరించారు. ప్రధాన దేవాలయం పక్కన భూదేవి,శ్రీదేవి దేవాలయాలు ఉంటాయి. శ్రీవారి పాదాలు సహా అన్ని ఇతర దేవతల విగ్రహాలు తిరుపతి SV ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రెడిషనల్ స్కల్ప్చర్ అండ్ ఆర్కిటెక్చర్ (SVITSA) శిల్పుల చే చెక్కబడ్డాయి. ఆలయంలో దాదాపు 150 మంది సభ్యులు కూర్చుండే వసతి గల ధ్యాన మందిరం, వివాహ వేడుకలను నిర్వహించడానికి ఒక పెద్ద హాల్ కూడా నిర్మించారు.
భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి సదుపాయాలు కల్పిస్తున్నారు. ఆలయం వెలుపల ప్రత్యేక టికెట్ కౌంటర్.. ప్రసాదం కౌంటర్ అందుబాటులో ఉంటాయి. ఈ దేవాలయంలో ఇద్దరు ప్రధాన పూజారులు ఉంటారు. భక్తులు ఆలయాన్ని సందర్శించడానికి, టీటీడీ బీచ్ రోడ్డు నుంచి ఆలయం వరకు 500 మీటర్ల ఘాట్ రోడ్డును నిర్మించింది. నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి అయ్యాయి. ఈ ఆలయం ద్వారా విశాఖలో టెంపుల్ టూరిజం అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.

