Attractive results ………………………..
బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆకర్షణీయమైన త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. 2022 సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో రికార్డు స్థాయి లాభాలను గడించింది. గత ఏడాది రూ.7,626.57 కోట్ల నికర లాభాన్ని ఆర్జించిన ఎస్‌బీఐ.. ఈ ఏడాది 74 శాతం వృద్ధితో ఏకంగా రూ.13,264.62 లాభాన్ని సాధించింది.
మొండి బకాయిలు తగ్గి , వడ్డీ ద్వారా వచ్చే ఆదాయం వృద్ధి చెందడంతో లాభాలు పెరిగాయి. బ్యాంక్ ఆదాయం 14 శాతం మేర వృద్ధి చెందింది. గత ఏడాది రూ.77,689.09 కోట్లుగా ఉన్న ఆదాయం ఈ ఏడాది రూ.88,733.86 కోట్లకు పెరిగింది. గతత్రైమాసికంలో వడ్డీ ఆదాయం 12.83 శాతం వృద్ధితో రూ. 35,183 కోట్లకు పెరిగింది.
సెప్టెంబర్ 30 నాటికి ఎస్‌బీఐ డిపాజిట్లు రూ.41,90,255 కోట్లు కాగా గత ఏడాదితో పోలిస్తే 10 శాతం మేర పెరిగాయి. గత ఏడాది ఇదే సమయంలో బ్యాంకు వద్ద ఉన్న డిపాజిట్లు రూ.38,09,630 కోట్లు. ఇక నికర నిరర్ధక ఆస్తులు (NPA) సైతం 1.52 శాతం నుంచి 0.80 శాతానికి తగ్గినట్లు ఎస్‌బీఐ చెబుతోంది. ఎస్‌బీఐ గ్రూప్ మొత్తం ఆదాయం రూ.1,01,143.26 కోట్ల నుంచి రూ.1,14,782 కోట్లకు పెరిగింది.
ఈ త్రైమాసిక ఫలితాలు వెలువడిన తర్వాత ఎస్‌బీఐ షేరు రూ. 596.95 వద్ద ట్రేడ్ అయింది. 52 వారాల కనిష్ట ధర 426 కాగా గరిష్ట ధర 596. ధర తగ్గితే దీర్ఘకాలిక వ్యూహంతో ఈ షేర్లలో మదుపు చేయవచ్చు. గత ఏడాది కాలంలో షేర్ ధర బాగా పెరిగింది. అప్పట్లో కొనుగోలు చేసిన వారు లాభాలు స్వీకరించవచ్చు. షేర్ ధర తగ్గితే కొనుగోలు చేయవచ్చు. అధిక సంఖ్యలో షేర్లు ఉన్నవారు పాక్షిక లాభాలు స్వీకరించవచ్చు.