అర కొర .. కామెడీ దెయ్యాల కథ !

Sharing is Caring...

అనబెల్  సేతుపతి ….  పేరుకే ఇది హారర్, కామెడీ సినిమా. ఇందులో హారర్ ఇసుమంత లేదు .. ఇక కామెడీ అరకొర మాత్రమే. విజయ్ సేతుపతి, తాప్సీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. రాజేంద్ర ప్రసాద్,రాధిక,జగపతి బాబు వంటి నటులు ఉన్నప్పటికీ కథలో దమ్ము లేకపోవడంతో సినిమా పేలవంగా తయారైంది.

ఇలాంటి సినిమాలో నటించడమేమిటి అని భవిష్యత్తులో సేతుపతి,తాప్సీ బాధపడే రోజు ఒకటి వస్తుంది. అతి బలహీనమైన కథ ఆధారంగా సినిమా తీసిన దర్శకుడు దీపక్ సుందర్ రాజన్. దీనికి పార్ట్ 2 కూడా ప్రకటించారు. మొదటిభాగమే ప్రేక్షకుడి బుర్ర తినేలా ఉంటే.. ఇక రెండో భాగం మరెలా ఉంటుందో ?

కథ విషయానికొస్తే .. రుద్ర (తాప్సీ) కుటుంబం అంతా దొంగలే. దొంగతనాలు చేస్తూ బతికేసే వీరు ఒకానొక పరిస్థితిలో ఓ రాజమహల్ లోకి ప్రవేశిస్తారు.అప్పటికే అందులో ఒకే కుటుంబానికి చెందిన దెయ్యాలు ఉంటాయి. ఆ కుటుంబ హెడ్డు జగపతి బాబు. ఆ దెయ్యాలు అక్కడే ఎందుకున్నాయి ?అసలు ఆ కోట వెనుక కథ ఏమిటి? వాటికి బయటకు వెళ్లే మార్గం తెలియక కొట్టు మిట్టాడం ఏమిటో అర్ధం కాదు.

లాజిక్ లేని కథ .. పసలేని కథనంతో సినిమా సాగుతుంది. సేతుపతి పాత్ర సగం సినిమా అయ్యాక వస్తుంది. రౌద్రం లేని రాజు పాత్ర సేతుపతి ది. తాప్సీ సేతుపతి రొమాంటిక్ సన్నివేశాలు మరి కొన్ని సన్నివేశాల్లో డైలాగులు బాగున్నాయి. సేతుపతి .. తాప్సి విషాహారం తిని చనిపోయే దృశ్యాలు చూస్తే జాలి కలుగుతుంది. అవి మినహా సినిమా లో ఆకట్టుకునే సన్నివేశాలు లేవు.  వినసొంపైన పాటలు లేవు.

జగపతిబాబు తన ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేసాడు. రాధిక ..రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ కామెడీ పండలేదు. కథలో కొత్తదనం లేదు .. కథనంలో మలుపులు లేవు . భయం గొలిపే సన్నివేశాలే లేవు. గౌతమ్ జార్జ్ కెమెరా పనితనం గొప్పగా ఉంది. కానీ ప్రయోజనం ఏమిటి అనిపిస్తుంది. ఇక ఇతరత్రా చెప్పుకోదగిన అంశాలేమి లేవు సినిమాలో. 

కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసే ముందు దర్శక నిర్మాతలు కథ గురించి ఆలోచించలేదా అనే సందేహం కలుగుతుంది. కథ రాసిన దర్శకుడు స్క్రిప్ట్ పై మరింత కసరత్తు చేస్తే బాగుండేది. ఇలాంటి సినిమా హిందీ లో గతంలో వచ్చింది. సేతుపతి .. తాప్సి అభిమానులకు ఈ సినిమా నచ్చవచ్చు. హాట్ స్టార్ చందాదారులు చందా వేస్ట్ కాకూడదు అనుకుంటే ఈ సినిమా చూడవచ్చు. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!