2600 years of history………………
శ్రీలంక పర్యటనకు వెళితే తప్పక దర్శించాల్సిన బౌద్ధ దేవాలయాల్లో కేలనియా మహా విహారాయ ఆలయం ఒకటి. ఈ ఆలయం కేలనియా నది తీరాన కొలంబో నగరానికి ఈశాన్యంగా పది కిలోమీటర్ల దూరంలో ఉంది. సువిశాలమైన ఈ ఆలయ ప్రాంగణంలో పెద్ద బోధివక్షం, ఆ వృక్షం మొదట్లో బుద్ధుడి విగ్రహం పర్యాటకులను ఆకట్టుకుంటాయి.
శ్రీలంకలోని బౌద్ధ దేవాలయాలలో ఈ కేలనియా మహా విహారాయ శిల్పకళకు పెట్టింది పేరు. ఈ ఆలయానికి 2600 సంవత్సరాల చరిత్ర ఉంది. క్రీ.పూ. 543 ముందు కాలంలో ఈ ఆలయం నిర్మితమైందని అంటారు. శ్రీలంక రాజు దేవనాంపియతిస్సా సోదరుడు ప్రిన్స్ ఉత్తియాచే ఆలయాన్ని పునరుద్ధరించారు.
దక్షిణ భారతదేశం నుండి వచ్చిన ద్రావిడులు ఈ పురాతన ఆలయాన్ని ధ్వంసం చేశారనే ఆరోపణలున్నాయి. మధ్యయుగపు ఆలయాన్ని 1510లో పోర్చుగీస్ వారు ధ్వంసం చేశారు..తర్వాత రాజు కీర్తి శ్రీ రాజసింహ పునర్నిర్మించారు. కొత్త ఆలయాన్ని 1927లో ప్రారంభించారు.
కేలనియా మహా విహారాయ ఆలయం శిల్పకళానైపుణ్యం పర్యాటకులకు కనువిందు చేస్తుంది. అలాగే ఈ ఆలయం అద్భుతమైన చిత్రాలకు నెలవు. గోడలు, పై కప్పు నిండా చిత్రాలు కనిపిస్తాయి. ఒక్కొక్క చిత్రం ఒక్కో ఘటనను వివరిస్తుంది. బుద్ధుడు శీలంక ను మూడుసార్లు సందర్శించాడని అంటారు. ఈ కేలనియా ప్రాంతాన్ని కూడా సందర్శించాడని చరిత్ర చెబుతోంది
బుద్ధుడు శ్రీలంకలో అడుగుపెట్టిన చిత్రాలు, త్రిపీటకాలను బోధించే దృశ్యాలు, అష్టాంగమార్గాలను విశదపరచి.. సమ్యక్ జీవనం దిశగా నడవమని చెప్పే సన్నివేశం స్థానిక రాజులు బుద్ధుడికి అనుచరులుగా మారిన దృశ్యాలు, సామాన్యులు బుద్ధుడిని చూడడానికి ఆతృత పడడం, బుద్ధుడి మాటలతో చైతన్యవంతమై వికసిత వదనాలతో నిలబడిన దృశ్యాలన్నీ కనిపిస్తాయి.
ఈ చిత్రాల్లో విభీషణుడి పట్టాభిషేకం ఘట్టం కూడా ఉంది. విభీషణుడి రాజభవనం కేలనియా నది తీరాన ఉన్నట్లు వాల్మీకి రామాయణంలో ఉందని చెబుతారు. ఈ ఆలయంలో విభీషణుడి విగ్రహం కూడా ఉంది. విభీషణుడిని సింహళీయులు విభీషణ్ దేవయా అని పిలుచుకుంటూ ప్రాచీనకాలంలో తమను పరిరక్షించిన దేవుడిగా కొలుస్తారు. విభీషణుడిని రాజుగా ప్రకటిస్తూ పట్టాభిషేకం చేసిన ప్రదేశం కేలనియా ఆలయ ప్రాంగణమే అంటారు.
బౌద్ధ ప్రార్థనామందిరాల్లో అన్నిచోట్లా డ్రెస్ కోడ్ అమలులో ఉంటుంది. మన దుస్తులు భుజాలు, మోకాళ్లను కప్పేలా ఉండాలి. అలా లేకపోతే ఆలయ ప్రాంగణంలో ఒక వస్త్రాన్నిఇస్తారు. దాంతో భుజాలను కప్పుకోవాలి. మోకాళ్లు కనిపించే డ్రస్ అయితే ఆ వస్త్రాన్ని లుంగీలాగా చుట్టుకోవాలి. శ్రీలంక లో పర్యటనకు సంబంధించి ఎన్నో టూర్ ప్యాకేజీలున్నాయి. మహా విహారాయ ఆలయం కాకుండా మరెన్నో ప్రదేశాలున్నాయి.