Taadi Prakash…………………………………………..
మార్క్స్ చాలా సరదా మనిషి. ఈవెనింగ్ పార్టీలు, సిగిరెట్లు, జోకులు, అప్పటి ఫిలాసఫర్లు అందర్నీ చచ్చేటట్టు తిట్టడం, వీపు పగిలేట్టు విమర్శ రాయడం, పదునైన వాదనతో చెలరేగిపోవడం… ఎంతో నిబద్ధతతో చేసేవాడు. మార్క్స్ కి కవిత్వం తెలుసు. ఆరేడు భాషలు బాగా వచ్చు. గొప్ప సెన్సాఫ్ హ్యూమర్ వున్నవాడు. A spector is haunting europe, the spector of communism అని మేనిఫెస్టో ని మొదలుపెట్టాడంటే – ఎంత హాస్య దృష్టి వుండాలి! అదీ 150 సంవత్సరాల క్రితం!
మార్క్సిజం ఒక సైన్సు. అదొక ఫిలాసఫీ. Dogma కాదది. Its a guide to action. కాయకష్టం చేసే కార్మికులే పాలకులు కావాలన్నాడు మార్క్స్ …అంటూ మార్క్సిజం గురించి పెద్ద కమ్యూనిస్టులు నాయకులు చెప్పిన ఉపన్యాసాలు ఏళ్ళతరబడి విన్నాను. ఎకనమిక్స్ స్టూడెంట్ ని అవ్వడం వల్ల మార్క్స్ వీ కొన్ని పుస్తకాలే చదివినా అర్థం చేసుకోగలిగాను. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంకెళ్ళు తప్ప – అనడంలోని చమత్కారమూ, దూకుడూ భలేగా అనిపించాయి. మార్క్స్ మాటల్లోని అద్భుతమైన clarity ఆశ్చర్యపరిచేది.రష్యన్ మహాకవి మయకోవస్కీ, లెనిన్ కావ్యంలో – విద్యుత్ కిరణాలు ఉక్కును తినేసినట్టు పెట్టుబడిదారీ విధానపు రోజులు నిండాయి… అప్పుడు కాలం కడుపుతో వుండి … కార్ల్ మార్క్స్ ని ప్రసవించింది (అను:శ్రీశ్రీ) అని రాసిన మాటలు చాలాకాలం వెన్నాడాయి.
కేవలం దొంగ (thief) గురించి మార్క్స్ ఒక వ్యాసం రాశాడు. దొంగ అనేవాడి వల్ల మన సమాజానికి జరిగిన మేలేమిటో ఆయన వివరంగా చెప్పాడు. దొంగలు వుండటం వల్ల, దొంగతనం జరుగుతుందనే భయం వల్ల తాళం అవసరమయింది. అలా ఎన్నో రకాల తాళాల తయారీ మొదలైంది. గట్టిగా వుండే ఇనప షట్టర్లు వచ్చాయి. రకరకాల తలుపులూ, తాళాల ఉత్పత్తి పెరిగిపోయింది. ఇది లక్షల కోట్ల డాలర్ల వ్యాపారంగా మారింది. ఇదంతా దొంగ అనేవాడు సమాజానికి చేసిన సేవేకదా అంటాడు మార్క్స్. అలా 19వ శతాబ్దపు గొప్ప సిద్ధాంతవేత్త నాకు 20 ఏళ్ళు వచ్చేసరికి ఒక icon గా, నిజమైన visionary గా, మానవత్వపు మహోన్నత శిఖరంగా, విశ్వమానవ విప్లవ సంగీతంగా నాలో సుడులు తిరుగుతూ ప్రవహించాడు. అలా బాల్యాన్ని విస్మయపరిచిన మొగ్గలన్నీ నా యవ్వనంలో సామ్యవాద కుసుమాలై వికసించి మానవత్వపు పరిమళంతో గుబాళించాయి.
అది 1818. జర్మనీ దేశంలో ట్రయర్ అనే చిన్న పట్టణం. ఒక మధ్యతరగతి పుణ్య దంపతుల ప్రేమ ఫలించి ఒక పిల్లవాడు పుట్టాడు, మే నెల 5వ తేదీన. ఆ బాలుడి లేత పెదవులపై విరిసింది చిరునవ్వు కాదనీ, హేళన అనీ ఆ తలిదండ్రులకు ఎలా తెలుస్తుంది? పుట్టింది సాక్షాత్తూ శత సహస్ర బాహువుల సర్వాంతర్యామి అనీ, అది రాబోయే విప్లవ విశ్వరూప సాక్షాత్కారమనీ వాళ్లకెప్పుడు తెలియాలి! వాడికి యిష్టంగా పెట్టుకున్న ‘కార్ల్ మార్క్స్’ అనే పేరు , ఈ లోకం వున్నంతవరకూ కోటికాంతుల తేజస్సుతో విశ్వమానవ పతాకమై అజేయంగా ఎగురుతుందని వాళ్ళకెలా తెలుస్తుంది?
దేవుడు, మతం అనే 16వ శతాబ్దపు మూఢనమ్మకాల్ని తుత్తునియలు చేస్తూ, ‘అసలు సమస్యలన్నిటికీ ఆర్థికమే కీలకం’ అని మార్క్స్ చెప్పాడు. సాక్ష్యాలూ, రుజువులూ సమాజం ముందుంచాడు. పెట్టుబడి – శ్రమ, దోపిడీ – అదనపు విలువల అసలు రహస్యాన్ని విప్పిచెప్పాడు. Conditions determine the consequences అని స్పష్టంగా చెప్పాడు. కర్కశమైన, రాక్షసమైన పెట్టుబడిదారీ విధానాన్ని కూల్చివేయడం తప్ప మరోమార్గం లేదని ఆయన నమ్మాడు. కార్మికులు అంతిమ విజయం సాధించడానికి ఒక ఆర్గనైజ్డ్ పార్టీ వుండాలనీ, దానికోసం ప్రజాశ్రేణుల్ని సమీకరించాలనీ పిలుపిచ్చాడు. అయితే, కమ్యూనిస్టులకో హెచ్చరిక చేశాడు మార్క్స్. “మీరు గనక తెలివి తక్కువ వాళ్లయితే మీకూ, పార్టీకీ నష్టం జరుగుతుంది. మీరు బొత్తిగా తెలివిలేని వాళ్లయితే దేశానికి నష్టం జరుగుతుంది. మీరు మరీ చచ్చుపుచ్చు దద్దమ్మలైతే… మేం చచ్చి ఎక్కడున్నా ఆ అప్రదిష్ట నాకూ, ఎంగెల్స్ కీ చుట్టుకుంటుంది”. మార్క్స్ భయపడినంతా జరిగింది. ప్రపంచంలోని చాలాదేశాల్లో దద్దమ్మలే గద్దెలెక్కారు.మార్క్సిజానికి మచ్చ తెచ్చారు. Everybody’s responsibility… ఆఖరికి nobody’s responsibility గా పరిణమించిన విషాదాన్ని మనం చూశాం.
కార్ల్ మార్క్స్ ఐడియాలజీకి కాలం చెల్లింది. విశిష్టమైన ప్రజాస్వామ్యమూ, ఆధునిక పెట్టుబడిదారీ విధానమూ పరిడవిల్లుతున్న యీ కాలంలో కార్ల్ మార్క్సూ, కమ్యూనిజమూ outdated… సోషలిజం సఫా, విప్లవం అని ఇక విసిగించకండి – అంటున్నారు. ఓకే. మార్క్స్ తో విభేదించండి. ఆయన సిద్ధాంతాన్ని రిజెక్ట్ చేయండి. వర్గపోరాటమూ, ఎర్రజెండా పనికిమాలినవని అనండి. అయితే, అలా ఎగిరెగిరిపడ్డానికి ముందు మార్క్స్ ని సీరియస్ గా చదవండి. వీలయితే అధ్యయనం చేయండి. రెండే పుస్తకాలు ఈ భూమ్మీద ఎక్కువగా, అంటే కోట్ల కాపీలు అమ్ముడుపోయాయి.1. బైబిల్ 2. కమ్యూనిస్టు మేనిఫెస్టో. హిట్లర్ రెచ్చిపోయిన జర్మనీలోనే చాలా ఏళ్లుగా మార్క్స్ రచనలు విపరీతంగా అమ్ముడుపోతున్నాయి. విలువలన్నీ, మానవ సంబంధాలన్నీ ‘కేవలం డబ్బు’ అనే bottomless pit లో పడి గాడాంధకారం లోకి జారిపోతున్నపుడు… మార్క్స్ రిలవెంట్ అనిపిస్తాడేమో! పెట్టుబడిపై ఆయన చేసిందొక చరిత్రాత్మక యుద్ధం అని తెలిసొస్తుందేమో!ఒక గొప్ప గాయకుణ్ణి, శాస్త్రవేత్తనీ, ఆర్టిస్టునీ, అధ్యాపకుణ్ణి, రచయితని, కవినీ, నృత్యకళాకారిణినీ, సంపాదకుణ్ణి, సంగీత విద్వాంసుణ్ణి, సాంకేతిక నిపుణుణ్ణి, రోజుకూలీగా, కేవలం నెలజీతగాడిగా మార్చి, దిగజార్చివేసిన పెట్టుబడిదారీ వ్యవస్టని ఎలా ప్రేమించగలుగుతాం? మార్క్స్ నీ, ఎంగెల్స్ నీ ఏ మొహం పెట్టుకుని కాదనగలం? మరికొన్ని వందల ఏళ్ళయినా మార్క్స్ నిగ్గుతేల్చిన నిజం నిలిచి వెలుగుతుంది … అది శాస్త్ర విజ్ఞానం గనక… అది సజీవమైన ఫిలాసఫీ గనక!