రేప్ కేసులో 27 ఏళ్ల తర్వాత న్యాయం !

Sharing is Caring...

12 ఏళ్ల వయసులో ఆమెపై ఇద్దరు ముష్కరులు సామూహిక అత్యాచారం చేశారు.పేదరికం కారణంగా ఆ బాలిక తల్లితండ్రులు నోరు విప్పలేకపోయారు. పోలీసులకు విషయం చెబితే పరువు పోతుందని.. మరేదైనా ఘోరం జరుగుతుందని భయపడి మౌనంగా ఉన్నారు. 

బాధితురాలు గర్భవతి అయింది.  గుట్టు చప్పుడుగా  కాన్పు చేయించారు. పుట్టిన మగబిడ్డను వేరే వాళ్లకు ఇచ్చి రాంపూర్ వెళ్లిపోయారు. యూపీ లోని షాజహాన్‌పూర్ లో ఈ ఘటన 1994 లో జరిగింది.బాధితురాలికి తర్వాత మరొక వ్యక్తితో వివాహం జరిగింది.  

ఆ బాలిక భర్త కు రేప్ ఘటన గురించి తెలిసి పెళ్లయిన 10 పదేళ్ల తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చాడు. ఆమె మళ్ళీ ఒంటరి అయింది. కూలీ నాలీ చేసుకుంటూ పొట్ట పోసుకుంటోంది.  ఈ లోగా కొడుకు పెద్ద వాడయ్యాడు. తల్లి ని వెతుక్కుంటూ వచ్చాడు. తండ్రి గురించి ఆరా తీశాడు.

తొలుత ఆమె చెప్పలేదు. అతగాడు ఒత్తిడి చేస్తే ఆమె నిజం చెప్పింది. కొంచెమో గొప్పో చదువుకున్న ఆమె కుమారుడు ఆమెకు న్యాయం జరిగేందుకు పోరాడాడు.  ఆమె కుమారుడి వయసు 27 ఏళ్లు. ఆ యువకుడు గత ఏడాది మార్చి 4న తల్లి చేత పోలీసు కేసు పెట్టించాడు.

నిందితుల పేర్లు, చిరునామాకు సంబంధించి పూర్తి వివరాలేవీ లేకున్నా.. బాధితురాలి ఫిర్యాదులో నిజాయతీని గుర్తించి.. ఆమెకు న్యాయం చేసేందుకు పోలీసులు నడుం కట్టారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితులను గుర్తించారు. తమకే పాపం తెలియదంటూ నిందితులు బుకాయించడం తో కోర్టు  డీఎన్‌ఏ పరీక్షకు ఆదేశించింది.

డీఎన్ఏ నమూనాలు సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. గత ఏప్రిల్ లో ఫలితాలొచ్చాయి. బాధితురాలి కుమారుడికి తండ్రి రజీ అని నిర్ధారించారు. నిందితులను అరెస్టు చేసేందుకు పోలీసులు వెళ్లగా ఇద్దరూ పత్తా లేకుండా పోయారు. సాంకేతిక ఆధారాలతో రజీ హైదరాబాద్ లో ఉన్నట్లు గుర్తించి అరెస్టు చేశారు. నఖీ ఒడిసాలో ఉన్నట్లు గుర్తించారు. అతణ్నికూడా అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.  

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!