జో బైడెన్ …. నిన్నొమొన్నో రాజకీయాల్లోకి వచ్చిన వాడు కాదు. యాభైయేళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి. మాజీ అమెరికా ప్రెసిడెంట్ బరాక్ ఒబామా కు ప్రియమైన స్నేహితుడు,శిష్యుడు. రాజకీయాల్లోకి రాకముందు న్యాయవాదిగా పనిచేశాడు. 1942 లో పెన్సిల్వేనియా లోని స్క్రాంటన్‌లో ఓ కేథలిక్ కుటుంబలో జన్మించారు. ఆర్ధికంగా ఉన్న కుటుంబం కాకపోవడంతో చిన్నతనం నుంచి జీవితంలో కస్టపడి పైకొచ్చాడు.
బాల్యంలో అతనికి కొంచెం నత్తి ఉండేది.దీంతో మాట్లాడానికి ఇబ్బందిపడేవాడు. స్కూల్ లో పిల్లలు అతగాడిని బాగా ఏడిపించేవారు. దీంతో అతగాడు ఇంట్లో అద్దం ముందు నిలబడి ఇంగ్లీష్ కవితలను బిగ్గరగా చదివేవాడు. అలా ఆ కవితలను కంఠస్థం చేస్తూ తన కున్న నత్తిని వదిలించుకున్నాడు. దేనికి భయపడకుండా పట్టుదలతో పోరాడే సాధించే తత్వం బైడెన్ ది. చదువులో చురుగ్గా ఉండేవాడు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి న్యాయ విద్య నభ్యసించాడు. ఆ తర్వాత డెలావేర్ లోని విల్మింగ్టన్ వెళ్లి న్యాయవాద వృత్తిలో ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. న్యాయవాద వృత్తి చేస్తూనే డెమొక్రాటిక్ పార్టీలో చురుకైన సభ్యుడయ్యాడు. 1970 లో న్యూకాజిల్ కౌంటీ కౌన్సిల్ కు ఎన్నికయ్యాడు.
ఈ క్రమంలోనే సొంతం గా లీగల్ సర్వీసెస్ సంస్థను ప్రారంభించాడు. 1972 లో డెలావేర్ డెమొక్రటిక్ పార్టీ బైడెన్ ను సెనెటర్ పదవి కి పోటీ చేయమని ప్రోత్సాహించింది. దీంతో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి కాలేట్ బొగ్స్ పై బైడెన్ పోటీ చేశారు. అప్పట్లో బైడెన్ విజయం కోసం మిత్రులు, కుటుంబ సభ్యులు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసారు. ఆ ఎన్నికల్లో బైడెన్ ఘన విజయం సాధించారు. ఆ పదవీ ప్రమాణస్వీకారానికి కొద్దీ రోజుల ముందు ఓ కారు ప్రమాదంలో భార్య,కూతురు మరణించారు. కుమారులకు గాయాలయ్యాయి. దీంతో ఆయన తనపిల్లలకు చికిత్స అందిస్తున్న ఆసుపత్రి గది నుంచే డెమొక్రాటిక్ పార్టీ సెనెటర్ గా ప్రమాణ స్వీకారం చేశారు.అప్పట్లో ఆ సంఘటన అమెరికన్లను కదిలించింది. అప్పటి నుంచే బైడెన్ అమెరికా ప్రజలకు తెలుసు.
తరవాత కాలంలో జిల్ జాకబ్స్ ను బైడెన్ పెళ్లి చేసుకున్నారు. బైడెన్ దేనికి జంకరు. పట్టుదలతో పోరాడాతారు. విమర్శలకు వెరవరు. ఆయన వ్యక్తిత్వమే ఆయనను ప్రజలకు దగ్గర చేసింది. పార్టీ కోసం చాలా కృషి చేసారు. ప్రెసిడెంట్ పదవికి పోటీ చేసి .. పీఠం ఎక్కాలన్నది బైడెన్ చిరకాల కోరిక. 1987 లోనే తొలిసారిగా అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసే యత్నాలు చేశారు. అప్పట్లో బ్రిటిష్ లేబర్ పార్టీ లీడర్ నీల్ కినోక్ ఉపన్యాస శైలిని బైడెన్ అనుకరించారనే ఆరోపణలు వచ్చాయి. దాంతో తన ప్రయత్నాన్ని విరమించుకున్నారు.
2008 లో మళ్ళీ ప్రయత్నించగా అది కూడా ఫలించలేదు. అపుడే ఒబామా తనకు తోడుగా ఉపాధ్యక్ష పదవికి బైడెన్ ను ఎంచుకున్నారు. ఒబామా ప్రెసిడెంట్ అభ్యర్థిగా … బైడెన్ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా జనంలోకి దూసుకుపోయారు. ఘనవిజయం సొంతం చేసుకున్నారు. మళ్ళీ 2012 ఎన్నికల్లో పోటీ చేసి పీఠాన్ని దక్కించుకున్నారు. ఆనాటి అనుభవాల న్నీ బైడెన్ కు బాగా ఉపయోగపడ్డాయి. పక్కా వ్యూహంతో ప్రచారంలో దూసుకుపోయి ఫలితాలలో ముందంజలో నిలిచాడు. ఒబామా కూడా బైడెన్ విజయం కోసం ప్రచారం నిర్వహించారు. అదికూడా బైడెన్ కి ప్లస్ అయింది.
————- KNMURTHY